మళ్లీ ఐపీవోల జాతర!!

SME IPO party is on even as market runs into rough patch - Sakshi

రూ.20 వేల కోట్ల సమీకరణలో కంపెనీలు

వచ్చే రెండు నెలల్లో అరడజను పైగా ఇష్యూలు

గతేడాది రికార్డు స్థాయిలో రూ.67వేల కోట్ల సమీకరణ

ఈ ఏడాది రూ.50వేల కోట్లకు పరిమితమయ్యే అవకాశం  

సాక్షి, బిజినెస్‌ విభాగం :  కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ప్రైమరీ మార్కెట్‌ మళ్లీ పబ్లిక్‌ ఇష్యూలతో కళకళలాడబోతోంది. స్టాక్‌ మార్కెట్లో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్న అంచనాల నేపథ్యంలో పలు కంపెనీలు ఐపీవోలపై కసరత్తు ఆరంభించాయి. వరోక్‌ ఇంజనీరింగ్, సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ, ఫైన్‌ ఆర్గానిక్స్, నజారా టెక్నాలజీస్, పటేల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సంధ్యా మెరైన్స్, సెవెన్‌ ఐలాండ్స్, ఫ్లెమింగో వంటి అరడజను పైగా సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇవి ఐపీవోల ద్వారా రూ.20,000 కోట్ల వరకూ సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో కొన్ని పబ్లిక్‌ ఇష్యూలు ఈ నెల్లోనే రానుండగా, మరికొన్ని వచ్చే నెలలో ఉన్నాయి. అటు ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు కూడా కొన్ని ఐపీవోలకు సిద్ధమయ్యాయి. వీటిలో రైల్‌ వికాస్‌ నిగమ్, ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ మొదలైనవి ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్, రెన్యూ పవర్, లోధా డెవలపర్స్‌ వంటివైతే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదముద్ర కోసం చూస్తున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో ఐపీవోల ద్వారా 36 కంపెనీలు ఏకంగా రూ.67,100 కోట్లు సమీకరించాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 15 సంస్థలు రూ.20,400 కోట్లు సమీకరించాయి. గతేడాది రికార్డు స్థాయిని దాటడం కష్టమే అయినప్పటికీ... 2018లో సుమారు రూ. 50,000 కోట్ల స్థాయిలో పబ్లిక్‌ ఇష్యూలు రావచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సెప్టెంబర్‌లోగా పూర్తి ..
చాలా కంపెనీలు సెప్టెంబర్‌లోగా ఇష్యూల ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు బ్యాంకర్లు తెలిపారు. ఎన్నికల అనిశ్చితి పరిస్థితుల సమస్య లేకుండా చూసుకోవాలనుకోవడమే ఇందుకు కారణమని తెలిపారు. డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిని వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే.

స్థిరపడుతున్న మార్కెట్‌పై ఆశలు..
ఏప్రిల్‌ నెలలో గణనీయంగా కరెక్షన్‌ జరిగిన తరవాత దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం కొంత స్థిరపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇందుకే కంపెనీలు ఐపీవో ప్రణాళికలతో ముందుకొస్తున్నాయని మార్కెట్‌ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. వచ్చే కొన్ని నెలల్లో పెద్ద సంఖ్యలో పబ్లిక్‌ ఇష్యూలుంటాయని అంచనా వేస్తున్నట్లు వారు తెలిపారు. చమురు ధరలు ఒక మోస్తరు శ్రేణికి పరిమితం కావడంతో మార్కెట్లు సైతం స్థిరత్వ సంకేతాలిస్తున్నాయన్నారు.

కొనుగోళ్లకు మంచి అవకాశాలు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా సానుకూలంగా ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈడీ అజయ్‌ సరాఫ్‌ చెప్పారు. ముఖ్యంగా దేశీయంగా వినియోగ ఉత్పత్తుల సంస్థలు, ఆర్థిక సర్వీసుల సంస్థల ఇష్యూలకు మంచి డిమాండ్‌ ఉండొచ్చునన్నారు. ఏక కాలంలో పలు కంపెనీలు ఇష్యూలకు వస్తే సరఫరా పెరిగిపోయి.. స్పందన అంతంతమాత్రంగానే ఉండే అవకాశాలూ తోసిపుచ్చలేమని పరిశీలకులు తెలిపారు.

ఐపీవోలు ఒకేసారి వెల్లువెత్తడంతో మార్చిలో ఇదే పరిస్థితి ఎదురైందని, భారీ వేల్యుయేషన్స్‌ వల్ల కొన్ని ఇష్యూలు.. ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయాయని వివరించారు. అయితే, మెరుగైన కంపెనీలు.. సరైన వేల్యుయేషన్స్‌తో వస్తే ఇన్వెస్టర్ల ఆదరణ తప్పకుండా ఉంటుందని కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.జయశంకర్‌ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లకు చెప్పుకోతగ్గ స్థాయిలో రాబడులిచ్చే సత్తా సదరు స్టాక్స్‌కు ఉండాలని చెప్పారు.

మార్చిలో కూడా కొన్ని ఇష్యూలకు అంతంత మా త్రం స్పందనే కనిపించినప్పటికీ.. బంధన్‌ బ్యాంక్‌ లాంటి ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి గట్టి మద్దతు లభించడం ఇందుకు నిదర్శనమని తెలిపారు.

ఐపీవోకి రానున్న సంస్థలు
1. వరోక్‌ ఇంజనీరింగ్‌
2. సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ
3. ఫైన్‌ ఆర్గానిక్స్‌
4. నజారా టెక్నాలజీస్‌
5. పటేల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
6. సంధ్యా మెరైన్స్‌
7. సెవెన్‌ ఐలాండ్స్‌
8. ఫ్లెమింగో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top