ఆరో రోజూ ఆగని నష్టాలు

The sixth losses are daily - Sakshi

మళ్లీ వాణిజ్య యుద్ధ భయాలు

కొనసాగిన బ్యాంక్‌ షేర్ల క్షీణత

ఇంట్రాడేలో 33,000 దిగువకు సెన్సెక్స్‌

284 పాయింట్ల నష్టంతో  33,033 వద్ద ముగింపు

కీలకమైన 10,200 దిగువకు నిప్టీ 

95 పాయింట్ల నష్టంతో  10,154 వద్ద ముగింపు   

అమెరికా అధ్యక్షుడి అర్థిక సలహాదారు రాజీనామా చేయటంతో వాణిజ్య యుద్ధాల భయం మళ్లీ చెలరేగింది. ఫలితం... ప్రపంచ మార్కెట్లు భారీగానే పతనమయ్యాయి. దీనికి బ్యాంక్‌ షేర్ల నష్టాలు కొనసాగడం కూడా జత కావడంతో మన స్టాక్‌ మార్కెట్‌ బుధవారం నష్టపోయింది. స్టాక్‌ సూచీలు వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ క్షీణించాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 33 వేల పాయింట్ల దిగువకు పడిపోగా, నిఫ్టీ కీలకమైన 10,200 పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్‌ 284 పాయింట్ల నష్టంతో 33,033 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95 పాయింట్లు పతనమై 10,154 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఈ ఏడాది కనిష్ట స్థాయిలు ఇవే. ఎఫ్‌ఎమ్‌సీజీ, కన్సూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. జీవిత కాల గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ 1,000 పాయింట్లు, సెన్సెక్స్‌ 3,410 పాయింట్లు పతనయ్యాయి. సూచీల ఆల్‌టైమ్‌ హైల నుంచి ఇన్వెస్టర్ల సంపద రూ.12 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 326 పాయింట్ల నష్టంతో 32,991 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. మొత్తం గత ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,413 పాయింట్లు నష్టపోయింది.

గ్యారీ రాజీనామా..
ఉక్కు, అల్యూమినియమ్‌ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్, ఆయన ఆర్థిక సలహాదారు గ్యారీ కోన్‌లకు మధ్య విభేదాలొచ్చాయి. గ్యారీ కోన్‌ రాజీనామా చేశారు. దీంతో సుంకాల విధింపుపై ట్రంప్‌ ముందుకే సాగుతారని, ఫలితంగా వాణిజ్య యుద్ధాలు చెలరేగుతాయనే ఆందోళనతో ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమయ్యాయి. ఇది మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. దేశీయ, అంతర్జాతీయ అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. కధ అప్పుడే ముగియలేదని, ఈ ఏడాది మార్కెట్లో మరింతగా ఒడిదుడుకులకు చోటు చేసుకుంటాయని ఎమ్‌కే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెచ్చరించింది.

ఏడాది కనిష్టానికి  15 ప్రభుత్వ బ్యాంకుల షేర్లు..
పీఎన్‌బీ దర్యాప్తు మరింత విస్తరించడంతో బ్యాంక్‌ షేర్లు పతనం కొనసాగింది. పీఎన్‌బీ స్కామ్‌ వెలుగులోకి వచ్చిన గత నెల 14 నుంచి చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ 19 శాతం క్షీణించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 40శాతం నష్టపోయింది. మొత్తం లిస్టయిన 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 15 బ్యాంక్‌లు బుధవారం నాడు  ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. యూనియన్‌ బ్యాంక్‌ షేర్‌ అయితే ఇంట్రాడేలో 11 ఏళ్ల కనిష్టానికి పతనమైంది. కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐ, అలహాబాద్‌ బ్యాంక్, ఓబీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయికి దిగజారాయి. ఈ బ్యాంక్‌ షేర్లతో పాటు  పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంక్, ఐడీబీఐలు 8 శాతం వరకూ నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టపోయింది. పీఎన్‌బీ రుణ కుంభకోణంలోని కీలక నిందితులు నీరవ్‌ మోదీ, మొహుల్‌ చోక్సీలకు ఎలాంటి రుణాలివ్వలేదని ఐసీఐసీఐ బ్యాంక్‌ స్పష్టం చేసినప్పటికీ ఈ బ్యాంక్‌ షేర్‌ పతనం ఆగలేదు.

అదానీ షేర్లు డౌన్‌
అదానీ గ్రూప్‌నకు చెందిన గౌతమ్‌ అదానీకి కూడా భారీగా మొండి బకాయిలున్నాయని బీజేపీ పార్లమెంటు సభ్యుడు సుబ్రమణ్యం స్వామి ట్వీట్‌ చేసిన నేపథ్యంలో ఆదానీ గ్రూప్‌ షేర్లు– అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పోర్ట్స్‌ దాదాపు 8 శాతం వరకూ నష్టపోయాయి. ఎప్పటికప్పుడు బ్యాంకు రుణాలను తీర్చివేస్తూనే ఉన్నామని, అదానీ గ్రూప్‌ వివరణ ఇచ్చినప్పటికీ ఈ షేర్లు క్షీణించాయి. గీతాంజలి జెమ్స్‌ షేర్‌ 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. సెన్సెక్స్‌ షేర్లలో ఐటీసీ, మారుతీ సుజుకీ, బజాజ్‌ ఆటో, ఏషియన్‌ పెయింట్స్, కోటక్‌ బ్యాంక్, ఎన్‌టీపీసీలు మాత్రం లాభపడ్డాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top