కాఫీ డే కింగ్‌ అరుదైన ఫోటో

Siddhartha Rare Photo going viral - Sakshi

సాక్షి, బెంగళూరు :  కేఫే కాఫీ డే  వ్యవస్థాపకుడు సిద్దార్థ  హెగ్డే అకాలమృతి  అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.  మాజీ  కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణకు స్వయానా అల్లుడు సిద్ధార్థ. మాజీ సీఎం కుమార్తె , ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన మాళవికను ఆయన వివాహమాడారు. తాజాగా సిద్ధార్థ, మాళవిక పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే సోషల్‌  మీడియాలో సిద్ధార్థ  మరణంపై  తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ట్విటర్‌లో ‘ఆర్‌ఐపి సిద్దార్థ’ హ్యాహ్‌టాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది. 

ఏ బలహీనత ఆయనను ఆవరించిందింతో తెలియదు కానీ.. సిద్ధార్థలో అపారమైన శక్తిని నింపిన ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అన్న వివేకానంద సూక్తి ఆయనను కాపాడలేకపోయింది. చివరికి ఆయన ఎంతో అభిమానించి, గురువుగా భావించిన మహేష్‌ కంపాని (బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మాజీ ప్రెసిడెంట్‌, జేఎంక్యాపిటల్‌ అధినేత, కారు యాక్సిడెంట్‌లో అనుమానాస్పదంగా మరణించారు) మాదిరిగానే సిద్ధార్థ జీవితం కూడా విషాదాంతమైంది. ‘ఎలాట్‌ కెన్‌ హ్యాపెన్‌ ఓవర్‌ ఎ కాఫీ’ అంటూ కాఫీ తాగుతూ ఒత్తిడిని దూరం చేసుకోమని ప్రపంచానికి మార్గం చూపించిన సిద్ధార్థను చివరికి ఆ ఒత్తిడే మింగేయడం అత్యంత విషాదం. వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సిద్ధార్థ ప్రధానంగా  వికలాంగులకు ప్రాధాన‍్యం ఇచ్చేవారట.  కాఫీ డే కంపెనీలో ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టే అన‍్నంత  సంబరం ఉద్యోగుల్లో.

కాగా  కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌వీ రంగనాథ్‌ను నియమించారు.  సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖ పై కాఫీ డే ఎంటర్‌  ప్రైజెస్‌ దర్యాప్తునకు ఆదేశించనుందని తెలుస్తోంది. ఆగస్టు 8న తదుపరి బోర్డు సమావేశంలో దీనిపై చర్చిచనున్నారని సమాచారం. పలువురు రాజకీయవేత్తల, వ్యాపార వర్గాలు, కార్పొరేట్‌ వర్గాలు ఆయనకు తుది నివాళులు అర్పించేందుకు  వేలాదిగా కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు తరలివచ్చారు. మరికొద్ది క్షణాల్లో సిద్ధార్థ అంత్యక్రియలు ముగియనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top