ఫలితాలపై భరోసా

Share Market: Sensex closes 138 points higher, Nifty at 1169 - Sakshi

అంచనాలను మించిన టీసీఎస్‌

క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరమే ! 

తోడైన సానుకూల అంతర్జాతీయ సంకేతాలు 

39,000 పాయింట్లపైకి సెన్సెక్స్‌

139 పాయింట్ల లాభంతో  38,906 వద్ద ముగింపు 

47 పాయింట్లు పెరిగి 11,690కు నిఫ్టీ   

టీసీఎస్‌ అంచనాలను మించిన ఫలితాలతో ఫలితాల సీజన్‌ ప్రోత్సాహకరంగా మొదలైంది. ఈ భరోసాతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో పరుగులు తీసింది. స్టాక్‌ మార్కెట్‌ లాభపడటం ఇది వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌. సెన్సెక్స్‌ 38,900 పాయింట్ల ఎగువున, నిప్టీ 11,650 పాయింట్లపైకి ఎగబాకాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహ అంచనాలు, ఈ ఏడాది వర్షాలు దాదాపు సాధారణంగానే ఉండొచ్చన్న వాతావరణ విభాగం అంచనాలు.... ఇవన్నీ  సానుకూల ప్రభావాన్ని చూపించాయి. రూపాయి పతనమైనా, ముడి చమురు ధరలు తగ్గడం కలసివచ్చింది.  ఇంట్రాడేలో 200 పాయింట్ల వరకూ లాభపడిన సెన్సెక్స్‌ చివరకు 139 పాయింట్ల లాభంతో 38,906 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 11,690 పాయింట్ల    వద్దకు చేరింది.  

సాగు షేర్లకు లాభాల పంట... 
వర్షాలు దాదాపు సాధారణంగానే కురుస్తాయన్న అంచనాల కారణంగా సాగు సంబంధిత షేర్లు లాభపడ్డాయి. ధనుక  ఆగ్రిటెక్, కావేరి సీడ్‌ కంపెనీ, మోన్‌శాంటో ఇండియా, పీఐ ఇండస్ట్రీస్, 1.4 శాతం వరకూ పెరిగాయి. శివ గ్లోబల్‌ ఆగ్రో ఇండస్ట్రీస్, జీఎస్‌ఎఫ్‌సీ, ఫెర్టిలైజర్స్‌  అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్కూర్, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌అండ్‌కెమికల్స్‌ 3–5 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి.  

∙టాటా మోటార్స్‌ షేర్‌ 7 శాతం లాభంతో రూ.231 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అధికంగా లాభపడ్డ షేర్‌ ఇదే. ఈ ఏడాది ఫిబ్రవరి 8న రూ.142కు పడిపోయిన ఈ షేర్‌... అప్పటి నుంచి చూస్తే 62 శాతం లాభపడింది.  టాటా సన్స్‌ కంపెనీ రూ.500 కోట్ల విలువైన టాటా మోటార్స్‌ షేర్లను కొనుగోలు చేసిందన్న వార్తల నేపథ్యంలో ఈ షేర్‌ జోరుగా పెరిగింది. 

∙గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు పెరగడంతో టీసీఎస్‌ షేర్‌ 4.7% లాభంతో రూ. 2,110 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.36,136 కోట్లు పెరిగి
రూ.7,91,772 కోట్లకు ఎగసింది.  

∙ఆదాయ అంచనాల విషయంలో నిరాశపరచడంతో ఇన్ఫోసిస్‌ షేర్‌ 3 శాతం నష్టంతో రూ.726 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.9,241 కోట్లు ఆవిరై రూ.3,17,468      కోట్లకు తగ్గింది.  

∙అంతర్జాతీయ సర్వీసులు ఆరంభించిన నేపథ్యంలో స్పైస్‌జెట్‌ షేర్‌ 8 శాతం లాభపడి రూ.119 వద్ద ముగిసింది.  

∙స్టాక్‌ మార్కెట్‌ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. లక్ష కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. లక్ష కోట్లు ఎగసి రూ.1,53,15,889 కోట్లకు చేరింది.  

∙ఆసియా, యూరప్‌  మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top