మార్కెట్లకు చమురు సెగ 

 Sensex slips 495 points, Nifty closes below 11,600; OMC, IT stocks drag - Sakshi

ఐదు నెలల గరిష్టానికి క్రూడ్‌ ధరలు

74 డాలర్లకు బ్రెంట్‌ క్రూడ్‌ 

అమ్మకాలకు దిగిన ఇన్వెస్టర్లు

సెన్సెక్స్‌ 495 పాయింట్లు డౌన్‌

నిఫ్టీకి 158 పాయింట్ల నష్టం  

మరోసారి చమురు ధరలు ఈక్విటీ మార్కెట్లను షేక్‌ చేశాయి. సోమవారం బ్రెంట్‌ బ్యారెల్‌ 73.24 డాలర్లకు ఎగసింది. దీంతో గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు విక్రయాలకు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్‌ 495 పాయింట్లు (1.26 శాతం) నష్టపోయి 38,645 పాయింట్లకు దిగొచ్చింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 158 పాయింట్లు కోల్పోయి (1.35 శాతం) 11,594 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకవైపు చమురు ధరల పెరుగుదల, మరోవైపు రూపాయి క్షీణత, ఇంకోవైపు ఇరాన్‌పై ఆంక్షలు విధించినప్పటికీ భారత్‌ సహా కొన్ని దేశాలకు ఇచ్చిన దిగుమతుల మినహాయింపులకు అమెరికా మంగళం పాడనుందన్న వార్తలు ప్రతికూల ప్రభావం చూపించాయి. సూచీల్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2.76 శాతం నష్టపోగా, యస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్స్‌ 6.62 శాతం వరకు నష్టాల పాలయ్యాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ షేర్లు ఎక్కువ నష్టపోయాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ 1.7 శాతం తగ్గి 29,688 వద్దకు వచ్చింది. సూచీల్లోని ప్రధాన కంపెనీల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తతో వ్యవహరించడం కూడా నష్టాలకు కారణమని విశ్లేషకులు తెలిపారు. సూచీల నష్టాలకు దారితీసిన అంశాలను చూస్తే... 

74 డాలర్లకు క్రూడ్‌ 
నష్టాలకు ప్రధానంగా కారణమైంది చమురు ధరలే. ఐదు నెలల గరిష్ట స్థాయికి పెరగడంతో భారత్, చైనా మార్కెట్లను నష్టాల పాలు చేశాయి. ఇరాన్‌పై గతేడాది ఆంక్షలు విధించిన అమెరికా కొన్ని దేశాలకు మాత్రం తాత్కాలికంగా దిగుమతులకు మినహాయింపులు ఇచ్చింది. అయితే, ప్రస్తుతం ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ఏ దేశానికీ మే 2 తర్వాత మినహాయింపులు కొనసాగబోవంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించనున్నట్టు వచ్చిన వార్తా కథనం చమురు ధరల మంటలకు కారణమైంది. 

క్యాడ్, రూపాయి భయాలు
చమురు ధరలు పెరుగుతుండడంతో కరెంట్‌ అకౌంట్‌లోటు (దేశంలోకి వచ్చీపోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం), రూపాయి  విలువ పతనంపై భయాందోళనలు ఉన్నాయి. 

రిలయన్స్‌ స్టాక్‌ ప్రభావం 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో ఈ స్టాక్‌ 3% వరకు నష్టపోయి రూ.1,345కు చేరింది. రిఫైనరీ వ్యాపారం నిరాశపరచగా, రిటైల్, జియో, పెట్రోకెమికల్‌ మంచి పనితీరు చూపించాయి. సీఎల్‌ఎస్‌ఏ, నోమురా ఈ స్టాక్‌కు బై రేటింగ్‌ కొనసాగించగా, కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సెల్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఐడీబీఐ క్యాపిల్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది.  

ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీ 
ఈ గురువారం ఏప్రిల్‌ సిరీస్‌ ఫ్యూచర్స్, ఆప్షన్స్‌ గడువు ముగియనుండడం సైతం ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించడానికి ఒక కారణం. నిఫ్టీ రోలోవర్లు గత వారం చివరికి 14.2 శాతంగా, బ్యాంకు నిఫ్టీ రోలోవర్లు 15.5 శాతంగానే ఉన్నాయి. ఏడు దశల పోలింగ్‌లో రెండు దశలు ఇప్పటికే ముగియగా, మంగళవారం మూడో దశ జరగనున్న విషయం తెలిసిందే. ్డ

మరిన్ని ముఖ్యాంశాలు...
►చమురు ధరల పెరుగుదలతో చమురు మార్కెటింగ్‌ కంపెనీలు కుదేలయ్యాయి. హెచ్‌పీసీఎల్‌ 6 శాతం, బీపీసీఎల్‌ 6 శాతం, ఐవోసీ 4 శాతం నష్టపోయాయి.   
► జెట్‌ ఎయిర్‌వేస్‌ వరుసగా మూడో రోజూ నష్టపోయింది. కార్యకలాపాలు పూర్తిగా నిలి పివేయడంతో సోమవారం ఈ స్టాక్‌ మరో 6% నష్టంతో 154.60 వద్ద క్లోజయింది.  
► జెట్‌ సంక్షోభం నేపథ్యంలో  కొన్ని రోజులుగా ర్యాలీ చేసిన స్పైస్‌జెట్‌కు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. చమురు ధరల పెరుగుదలతో లాభాల స్వీకరణకు గురైంది. 8.62% నష్టపోయి రూ.124.50 వద్ద క్లోజయింది. 
► బీఎస్‌ఈ ఎనర్జీ ఇండెక్స్‌ 2.72 శాతం నష్టపోయింది. ఫైనాన్స్‌ ఇండెక్స్‌ 2 శాతం పడిపోయింది.   

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top