సుంకాల పోరుకు చమురు సెగ జత

 Sensex sheds 273 points, Nifty ends at 10671 - Sakshi

10,700 పాయింట్ల దిగువకు నిఫ్టీ  

98 పాయింట్లు పతనమై 10,671 వద్ద ముగింపు  

273 పాయింట్ల నష్టంతో 35,217కు సెన్సెక్స్‌

వాణిజ్య ఉద్రిక్తతలతో అతలాకుతలమవుతున్న స్టాక్‌ మార్కెట్‌కు తాజాగా చమురు సెగ తగిలింది. దీనికి రూపాయి పతనం కూడా తోడవడంతో బుధవారం స్టాక్‌ సూచీలు భారీగా క్షీణించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది.  98 పాయింట్ల నష్టంతో 10,671 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 273 పాయింట్ల నష్టంతో 35,217 పాయింట్ల వద్ద ముగిసింది. చమురు, బ్యాంక్, లోహ, ఇన్‌ఫ్రా, వాహన, విద్యుత్తు, క్యాపిటల్‌ గూడ్స్, యుటిలిటీస్‌  షేర్లు నష్టపోగా, ఐటీ షేర్లు లాభపడ్డాయి.  
400 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 129 పాయింట్ల లాభంతో 35,619 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అమ్మకాల జోరు పెరగడంతో ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 336 పాయింట్ల నష్టంతో 35,154 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 400 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 465 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

ఇక నిఫ్టీ 50 రోజుల మూవింగ్‌ యావరేజ్‌  (10,685 పాయింట్ల)దిగువకు పడిపోయింది. అమెరికా, ఇతర దేశాల మధ్య సుంకాల పోరు మరింత ముదురుతుండటం, రూపాయి మరింతగా బలహీనపడటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ కూడా బలహీనపడుతోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు పుంజుకున్నాయని వివరించారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.1 శాతం నష్టపోయి రూ. 271 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. సెన్సెక్స్‌లో ఐదు షేర్లు –హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్‌ ఇండియా, టీసీఎస్, సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ప్రతి ఐదు షేర్లలో నాలుగు షేర్లు పతనం కాగా, ఒక్క షేర్‌ మాత్రమే లాభపడింది.  

ఏడాది కనిష్టానికి 300కు పైగా షేర్లు  
300కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. టాటా మోటార్స్, భెల్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, సిండికేట్‌ బ్యాంక్, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఇండియా, ఏషియన్‌ గ్రానిటో ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గతి, ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్, ఎన్‌బీసీసీ, జెట్‌ ఎయిర్‌వేస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

పతనానికి ప్రధాన కారణాలు...
చమురు ధరలు భగ్గు...
కెనడాలో చమురు సరఫరాలో సమస్యలు తలెత్తడం, లిబియా ఎగుమతుల విషయమై అనిశ్చితి నెలకొనడం, అమెరికా చమురు నిల్వలు తగ్గడం, ఈ ఏడాది నవంబర్‌ నుంచి అన్ని దేశాలు ఇరాన్‌ నుంచి చమురు కొను గోలు చేయకూడదని అమెరికా ఆంక్షలు విధిం చడం...ఈ అంశాలన్నింటి కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి.

బ్రెంట్‌  చమురు ధర బ్యారెల్‌కు 76 డాలర్లు దాటేసింది. ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నష్టపోయాయి. బీపీసీఎల్‌  8%, హెచ్‌పీసీఎల్‌ 7.4%, ఐఓసీ 6.1% చొప్పున పతనమయ్యాయి.
 
19 నెలల కనిష్టానికి రూపాయి...  
నెలాఖరు కావడంతో డాలర్‌కు దిగుమతిదారులు, బ్యాంక్‌ల నుంచి డిమాండ్‌ బాగా ఉండటంతో డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ 19 నెలల కనిష్టానికి, 68.54కు పడిపోయింది.
ముదరనున్న ‘మొండి’ సమస్య !  
బ్యాంకింగ్‌ మొండిబకాయిల సమస్య మరింత అధ్వాన్నమవుతుందన్న ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదికా సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.  బ్యాంక్‌ షేర్లు కుదేలయ్యాయి.  
డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు  
జూన్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top