మార్కెట్లో సు‘నమో’! 

Sensex sees profitbooking; closes 298 points lower - Sakshi

ఎగ్జిట్‌ పోల్స్‌ మించి ఎన్‌డీఏకు సీట్లు

ఆరంభంలోనే ఆల్‌టైమ్‌ హైలకు సెన్సెక్స్, నిఫ్టీలు 

ప్రారంభంలోనే 40,000కు సెన్సెక్స్, 12,000 పైకి నిఫ్టీ  

ఒప్పందం లేకుండానే ముగిసిన అమెరికా–చైనా చర్చలు 

పతన బాటలో ప్రపంచ మార్కెట్లు

దీంతో  లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు  

ఒక దశలో 1,015 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌   మరో దశలో 459 పాయింట్లు దిగువకు  

303 పాయింట్లు పెరిగి, 123 పాయింట్లకు పడిన నిఫ్టీ  

చివరకు 299 పాయింట్లు పతనమై 38,811కు సెన్సెక్స్‌ 

81 పాయింట్లు నష్టపోయి 11,657కు నిఫ్టీ

మోదీ సునామీలో ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి... 
నమో దెబ్బకు రికార్డులు బద్దలయ్యాయి...
దేశీ స్టాక్‌మార్కెట్లు ఉవ్వెత్తున ఎగసిపడి... 
ఇన్వెస్టర్లలో ఉత్తేజాన్ని నింపాయి.

ఎగ్జిట్‌ పోల్స్‌ను మించిన సీట్లు ఎన్‌డీఏకు వచ్చే అవకాశాలు కనిపించడంతో గురువారం ట్రేడింగ్‌ ఆరంభంలోనే స్టాక్‌ మార్కెట్లో కొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అంచనాలకు అనుగుణంగానే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏనే మళ్లీ అధికారం చేపట్టడం ఖాయం కావడంతో సెన్సెక్స్‌ 40,000 పాయింట్లు, నిఫ్టీ 12,000 పాయింట్లపైకి ఎగబాకాయి. అయితే అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం, ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 37 పైసలు క్షీణించి 70.04ను తాకడంతో గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఇంట్రాడేలో 1,015 పాయింట్లు లాభపడిన  సెన్సెక్స్‌ చివరకు 299 పాయింట్లు నష్టపోయి 38,811 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 81పాయింట్ల నష్టంతో 11,657 పాయింట్ల వద్ద ముగిశాయి. 

11 ఏళ్లలో భారీ ‘ఇంట్రాడే’ నష్టం.... 
ఓట్ల లెక్కింపు ఆరంభంలోనే ఎన్‌డీఏకు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నా, మన మార్కెట్‌ మాత్రం భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,015 పాయింట్ల లాభంతో 40,125 పాయింట్లను తాకింది. ఇక నిఫ్టీ 303 పాయింట్ల లాభంతో 12,041 పాయింట్లను తాకింది. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయిలు. ట్రేడింగ్‌ చివర్లో లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు జోరుగా సాగడంతో సెన్సెక్స్‌ 459 పాయింట్లు, నిఫ్టీ 123 పాయింట్ల మేర నష్టపోయాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 1,474 పాయింట్లు, నిఫ్టీ 426 పాయింట్ల రేంజ్‌లో కదలాడాయి. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 1,314 పాయింట్లకు పైగా నష్టపోయింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఇన్ని పాయింట్లు నష్టపోవడం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండటం, వేల్యుయేషన్లు అధికంగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇచ్చారని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా–చైనాల మధ్య 11వ రౌండ్‌ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. ఇరు దేశాల ఒప్పందంపై అనిశ్చితి, యూరప్‌ పీఎమ్‌ఐ డేటా అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి.  

మార్కెట్‌ దృష్టి పెట్టే అంశాలు... 
ఎన్‌డీఏకే ప్రజలు మళ్లీ పట్టం కడతారని మార్కెట్‌ ముందుగానే అంచనా వేసిందని, ఇక ఇప్పుడు మార్కెట్‌ దృష్టి సంస్కరణలు, ఆర్థిక వృద్ధి, వర్షాలు, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు  తదితర అంశాలపై ఉంటుందని విశ్లేషకులంటున్నారు. ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 5.2 శాతం లాభంతో రూ.1,597 వద్ద ముగిసింది. ఈ బ్యాంక్‌ నికర లాభం తగ్గినప్పటికీ, బ్రోకరేజ్‌ సంస్థలు పాజిటివ్‌ రివ్యూలు ఇవ్వడంతో ఈ షేర్‌ బాగా పెరిగింది.  సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. మరోవైపు గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 14 శాతం వరకూ పెరిగాయి.

ముందుంది మరింత పెద్ద ర్యాలీ...!
స్టాక్‌ మార్కెట్లో మరింత పెద్ద ర్యాలీ ముందుందని ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వ్యాఖ్యానించారు. భారత్‌ ఇంకా చెప్పుకోదగ్గ స్థాయి వృద్ధిని చూడలేదని పేర్కొన్నారు. ప్రస్తుత వినియోగ మాంద్యం తాత్కాలికమేనని చెప్పారు. స్టాక్‌ మార్కెట్లో భారీ పెట్టుబడులు మరింతగా రానున్నాయని వివరించారు. కొత్త ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తుందని, అన్ని ఆర్థిక సమస్యలకు సంజీవని వృద్ధేనని వ్యాఖ్యానించారు.

ఐదేళ్లలో... రూ.75 లక్షల కోట్లు 
నరేంద్ర మోదీ గత ఐదేళ్ల హయాంలో స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల సంపద రూ.75.25 లక్షల కోట్లు ఎగసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్‌ 61 శాతం(14,690 పాయింట్లు) లాభపడింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.75.25 లక్షల కోట్లు పెరిగి రూ.150.25 లక్షల కోట్లకు ఎగసింది. 

ఆ విషయంలో మన్మోహన్‌ సర్కార్‌దే పైచేయి.. 
ప్రధాని నరేంద్ర మోదీ హయాంతో పోలిస్తే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ హయాంలోనే స్టాక్‌ మార్కెట్లు అధిక రాబడులు ఇచ్చాయి. తొలి విడత యూపీఏ–1 హయాంలో సెన్సెక్స్‌ 180 శాతం రాబడులు ఇచ్చింది. 2004–09 మధ్య కాలంలో సెన్సెక్స్‌ 245 సార్లు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలను తాకింది. ఇక నరేంద్ర మోదీ–1 హయాం విషయానికొస్తే సెన్సెక్స్‌ 118 సార్లు ఇంట్రా–డేలో ఆల్‌–టైమ్‌ గరిష్ట స్థాయిలను తాకింది. గడిచిన అయిదేళ్లలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 3.85 లక్షల కోట్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 2.11 లక్షల కోట్లు దేశీ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. 

సెన్సెక్స్‌ 45,000 పాయింట్లకు!
వచ్చే ఏడాది జూన్‌కల్లా బీఎఎస్‌ఈ సెన్సెక్స్‌  45,000 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13,500 పాయింట్లకు చేరతాయని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేస్తోంది. గురువారం నాటి ముగింపు నుంచి చూస్తే, ఈ రెండు సూచీలు అప్పటికల్లా 15 శాతం పెరుగుతాయని పేర్కొంది. కేంద్రంలో మెజారిటీ ప్రభుత్వమే అధికారంలోకి రావడం వల్ల విధానాలు, సంస్కరణలు కొనసాగుతాయని పేర్కొంది.  ద్రవ్యోల్బణ నియంత్రణ పాలసీలు, ద్రవ్య స్థిరీకరణ, మౌలిక రంగాలపై వ్యయం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపుపై దృష్టి, పటిష్టమైన విదేశీ వ్యవహారాల విధానాలు కొనసాగుతాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. కొత్త ప్రభుత్వం పేద ప్రజలకు నగదు బదిలీలు మరింతగా పెంచే చర్యలు తీసుకుంటుందని, విదేశీ వాణిజ్యం పెంచుకోవడంపై  దృష్టి పెడుతుందని పేర్కొంది. ఇక మార్కెట్‌ దృష్టి వృద్ధి చక్రం వైపు మరలుతుందని వివరించింది. రానున్న ఆరు నెలల్లో వడ్డీరేట్లను 25–50 బేసిస్‌ పాయింట్ల రేంజ్‌లో ఆర్‌బీఐ తగ్గించగలదని తెలిపింది. మరిన్ని నిధులను వ్యవస్థలోకి ఆర్‌బీఐ తీసుకురాగలదని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతంగా ఉన్న జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతానికి పెరగగలదని పేర్కొంది.  

వదంతి వచ్చినప్పుడు కొంటే..
స్టాక్‌ మార్కెట్‌ ఎప్పుడు ఎలా ట్రేడ్‌ అవుతుందో ఎవరూ అంచనా వేయలేరు. వదంతి వచ్చినప్పుడు కొనుగోళ్లు చేసి, దానికి సంబంధించిన వార్త వచ్చినప్పుడు అమ్మకాలు జరపాలనే (బై ద రూమర్, సెల్‌ ద న్యూస్‌)నానుడి గురువారం స్టాక్‌ మార్కెట్‌కు వంద శాతం వర్తిస్తుంది. గత శుక్రవారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్‌డీఏదే అధికారమని వెల్లడి కావడంతో సోమవారం కొనుగోళ్ల సునామీతో సెన్సెక్స్‌ 1.400 పాయింట్లకు పైగా పెరిగింది. ఇక గురువారం ఎగ్జిట్‌ పోల్స్‌కు మించిన ఫలితాలు వచ్చినప్పటికీ, సెన్సెక్స్‌ 299 పాయింట్లు నష్టపోయింది. ఆరంభంలో 1,025 పాయింట్లు పెరిగినప్పటికీ, ఇంట్రాడేలో 459 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇన్వెస్టర్లు అప్పుడు కొని, ఇప్పుడు అమ్మేసి లాభాలు స్వీకరించారని నిపుణులు అంటున్నారు.

ముందుంది మరింత పెద్ద ర్యాలీ...!
స్టాక్‌ మార్కెట్లో మరింత పెద్ద ర్యాలీ ముందుందని ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వ్యాఖ్యానించారు. భారత్‌ ఇంకా చెప్పుకోదగ్గ స్థాయి వృద్ధిని చూడలేదని పేర్కొన్నారు. ప్రస్తుత వినియోగ మాంద్యం తాత్కాలికమేనని చెప్పారు. స్టాక్‌ మార్కెట్లో భారీ పెట్టుబడులు మరింతగా రానున్నాయని వివరించారు. కొత్త ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తుందని, అన్ని ఆర్థిక సమస్యలకు సంజీవని వృద్ధేనని వ్యాఖ్యానించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top