10,250 దిగువకు నిఫ్టీ

Sensex Rises Over 100 Points, Nifty Above 10300 - Sakshi

ఆరంభంలో 1 శాతం లాభపడిన సూచీలు

ట్రేడింగ్‌ చివర్లో జోరుగా అమ్మకాలు

తొలగని లిక్విడిటీ భయాలు

పెరిగిన ముడి చమురు ధరలు

181 పాయింట్లు పతనమై 34,134కు సెన్సెక్స్‌

58 పాయింట్లు నష్టపోయి 10,245కు నిఫ్టీ  

స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు కొనసాగుతున్నాయి. ఆరంభంలో 1 శాతం వరకూ లాభపడిన స్టాక్‌ సూచీలు ఆ తర్వాత ఆ లాభాలన్నింటినీ కోల్పోయాయి. ట్రేడింగ్‌ చివర్లో బ్యాంక్, ఇంధన షేర్లలో అమ్మకాల కారణంగా సోమవారం స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ స్టాక్‌ మార్కెట్‌ క్షీణించింది.

నిఫ్టీ కీలకమైన 10,250 పాయింట్ల దిగువకు పతనమైంది. ఆయిల్, గ్యాస్, కన్సూమర్‌ డ్యూరబుల్స్, ఐటీ, ఇన్‌ఫ్రా, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్, పీఎస్‌యూ, లోహ  స్టాక్స్‌ నష్టపోయాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 181 పాయింట్లు నష్టపోయి 34,134 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి 10,245 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ మొత్తం మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 1,028 పాయింట్లు పతనమైంది.  

433 పాయింట్ల లాభం నుంచి...
కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉండటం, లిక్విడిటీ సమస్యల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం  ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. గత రెండు సెషన్లలో సెన్సెక్స్‌ 800 పాయింట్లకు పైగా నష్టపోవడంతో కొన్ని షేర్లలో వేల్యూ బయింగ్‌ జరిగింది.

ఈ ఆరంభ కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్‌ 433 పాయింట్ల లాభంతో 34,749 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత ఈ లాభాలన్నీ ఆవిరయ్యాయి. ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాల వెల్లువతో నష్టాల్లోకి జారిపోయింది. బ్లూ చిప్‌ షేర్లు–రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు 4 శాతం వరకూ పతనం కావడంతో నష్టాల జోరు బాగా పెరిగింది. సెన్సెక్స్‌ 233 పాయింట్ల నష్టంతో 34,083 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

మొత్తం మీద రోజంతా 666 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 105 పాయింట్లు లాభపడగా, మరో దశలో 80 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు సానుకూలంగానే ఉన్నా నిఫ్టీ పరిమిత శ్రేణిలో కదలాడి చివరకు నష్టాల్లో ముగిసిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. లిక్విడిటీ, వడ్డీరేట్ల భయాలే దీనికి కారణాలని వివరించారు. సూచీలో అధిక వెయిటేజీ గల కంపెనీల క్యూ2 ఫలితాలు మిశ్రమంగా ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని పేర్కొన్నారు.  

ఏడాది కనిష్టానికి 200కు పైగా షేర్లు  
స్టాక్‌ మార్కెట్‌ నష్టాల కారణంగా రెండు వందలకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్, సీమెన్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, దిలిప్‌ బిల్డ్‌కాన్, డిష్‌ టీవీ ఇండియా, ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇండియాబుల్స్‌  రియల్‌ఎస్టేట్, ఇండియా సిమెంట్, సెరా శానిటరీ వేర్, కజారియా సిరామిక్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 8.5 శాతం నష్టపోయి రూ.1,442 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3.5 శాతం నష్టంతో రూ.1,062 వద్దకు చేరింది.
అంచనాలను మించిన ఫలితాల కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.3 శాతం లాభంతో రూ.1,993 వద్ద ముగిసింది.  
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓఎల్‌ షేర్లు 4 శాతం వరకూ పతనమయ్యాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top