ఎనిమిదో రోజూ లాభాలు

Sensex rises 112 points Nifty ends at 10528 - Sakshi

లాభాలు తెచ్చిన గణాంకాలు

10,500 పాయింట్లపైకి నిఫ్టీ

అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గణాంకాల ప్రోత్సాహంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. స్టాక్‌ సూచీల లాభాలు వరసగా ఎనిమిదో రోజూ కొనసాగాయి. నవంబర్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయన్న భారత వాతావరణ విభాగం అంచనాలూ సానుకూల ప్రభావం చూపించడంతో నిఫ్టీ కీలకమైన 10,500 పాయింట్లపైకి ఎగిసింది.

సెన్సెక్స్‌ 113 పాయింట్లు లాభపడి 34,305 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 10,528 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సీజీ, విద్యుత్తు, ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్, వాహన, బ్యాంకింగ్‌ షేర్లు లాభపడ్డాయి. స్టాక్‌ సూచీలు ఏడు వారాల గరిష్ట స్థాయికి చేరాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్‌ 406, నిఫ్టీ 132 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

నష్టాల్లోంచి..లాభాల్లోకి..!
సిరియాపై అమెరికా దాడుల కారణంగా ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్న నేపథ్యంలో మన మార్కెట్‌ బలహీనంగా ఆరంభమైంది. ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో సెన్సెక్స్‌ 293 పాయింట్ల నష్టంతో 33,899 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది.

  మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 2.47 శాతానికి తగ్గిందని గణాంకాలు వెల్లడించడంతో కొనుగోళ్ల జోరు పెరిగింది. 149 పాయింట్ల లాభంతో 34,341 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది.  మొత్తం మీద 442 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 84 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 60 పాయింట్లు లాభపడింది. గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,286 పాయింట్లు పెరిగింది.

టాటా మోటార్స్‌ 5 శాతం డౌన్‌..
ఉత్పత్తి తగ్గించడానికిగాను ఉద్యోగాలను తొలగించే విషయమై ఆలోచన చేస్తున్నామని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ అండ్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) ప్రకటించడంతో టాటా మోటార్స్‌ షేర్‌ 5 శాతం నష్టపోయి రూ. 339వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.

మిధాని.. 3 రోజుల్లో 43 శాతం అప్‌..
మిశ్ర ధాతు నిగమ్‌(మిధాని) 20 శాతం లాభంతో రూ.133 వద్ద ముగిసింది. గత గురువారం రూ.93 వద్ద  ముగిసిన ఈ షేర్‌ మొత్తం మూడు ట్రేడింగ్‌ సెషన్లలో 43 శాతం లాభపడింది.

ఎస్‌బీఐని వెనక్కి నెట్టిన కోటక్‌ బ్యాంక్‌
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,174ను తాకింది. చివరకు 2 శాతం లాభంతో రూ.1,170 వద్ద ముగిసింది. భారత్‌లో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా రెండో అతి పెద్ద బ్యాంక్‌గా (మొదటిది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌) కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అవతరించింది. అంతేకాకుండా విలువ పరంగా టాప్‌ 10లో ఎస్‌బీఐని తోసిరాజని ఈ బ్యాంక్‌ చోటు సంపాదించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top