ప్రపంచ మార్కెట్ల దన్ను

Sensex regains 38000 - Sakshi

కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు 

రూపాయి లాభాల బాట... 

బ్లూ చిప్‌ షేర్లలో భారీగా కొనుగోళ్లు 

మళ్లీ 38,000 పాయింట్లపైకి సెన్సెక్స్‌ 

425 పాయింట్లు పెరిగి 38,233 పాయింట్ల వద్ద ముగింపు  

129 పాయింట్ల లాభంతో  11,483కు నిఫ్టీ

విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరుకు వేల్యూ బయింగ్‌ కూడా తోడవడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. మాంద్యం భయాలు తొలగి అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా ఉండటంతో రెండు రోజుల స్టాక్‌ సూచీల నష్టాలకు బ్రేక్‌ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 38,000 పాయింట్ల ఎగువకు చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,500 పాయింట్లకు చేరువ అయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి ఇండెక్స్‌ షేర్లు భారీగా లాభపడటం, డాలర్‌తో రూపాయి మారకం 19 పైసలు పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ 425 పాయింట్ల లాభంతో 38,233 పాయింట్ల వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 11,483 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, ఇంధన షేర్లు మంచి లాభాలు సాధించగా, రూపాయి బలపడటంతో ఐటీ షేర్లు నీరసించాయి. ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే ముగిశాయి.

అమెరికాలో మాంద్యం ఏర్పడే ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ దన్నుతో  సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. అయితే మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ఒక దశలో 9 పాయింట్లు నష్టపోయింది కూడా. మధ్యాహ్నం తర్వాత సెన్సెక్స్‌ పుంజుకుంది. ట్రేడింగ్‌ చివరి గంటలో కొనుగోళ్లు మరింత జోరుగా సాగడంతో స్టాక్‌ సూచీలు మంచి లాభాలు సాధించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 489 పాయింట్లు, నిఫ్టీ 143 పాయింట్లు చొప్పున లాభాలను చూశాయి. మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో 24 షేర్లు లాభపడగా, ఏడు షేర్లు నష్టపోయాయి. 

లాభాలకు కారణాలు ఇవీ..
∙విదేశీ పెట్టుబడుల వెల్లువ ఈ నెలలో మన మార్కెట్లో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇతర వర్థమాన దేశాలు బలహీనంగా ఉండటం మన మార్కెట్‌కు కలసి వస్తోంది. చమురు ధరలు స్థిరంగా ఉండడం, రూపాయి పుంజుకోవడం మోదీ ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టడం ఖాయమన్న అంచనాలు దీనికి కారణం.  

∙రూపీ–డాలర్‌ స్వాప్‌ విండో సక్సెస్‌ రూపీ–డాలర్‌ స్వాప్‌ విండో ద్వారా వ్యవస్థలోకి ఆర్‌బీఐ రూ.35,000 కోట్లు నిధులందించింది. ఆర్‌బీఐ చేపట్టిన ఈ రూపీ–డాలర్‌ స్వాప్‌కు మంచి స్పందన లభించింది. 500 కోట్ల డాలర్లకు వేలం నిర్వహించగా 1,631 కోట్ల డాలర్ల విలువైన బిడ్‌లు వచ్చాయి.  దీంతో లిక్విడిటీ పరిస్థితి మెరుగుపడి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌  బలపడింది. 

∙పుంజుకున్న రూపాయి అమెరికా ఆర్థిక వ్యవస్థలో మందగమన భయాలతో డాలర్‌ బలహీనపడుతోంది. దీంతో మన రూపాయి పుంజుకుంటోంది. మంగళవారం కూడా రూపాయి లాభాలు కొనసాగాయి. 68.86 వద్ద ముగిసింది. 

∙తొలగిన మాంద్యం భయాలు  అమెరికాలో 3 నెలల బాండ్ల రాబడుల కన్నా, పదేళ్ల బాండ్ల రాబడులు శుక్ర, సోమవారాల్లో తగ్గాయి. స్వల్ప కాలిక బాండ్ల రాబడుల కన్నా దీర్ఘకాలిక బాండ్ల రాబడులు తగ్గడం..మాంద్యం వస్తోందనడానికి ఒక సూచిక అన్న విశ్లేషణతో శుక్ర, సోమ వారాల్లో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. తాజాగా 3 నెలల బాండ్ల రాబడుల కంటే పదేళ్ల బాండ్ల రాబడులు పుంజుకోవడంతో మాంద్యం భయాలు తొలగినట్లేనని విశ్లేషణలు వచ్చాయి. దీంతో ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభపడ్డాయి. 

∙వేల్యూ బయింగ్‌ కొన్ని ఎంపిక చేసిన బ్లూ చిప్‌ షేర్లలో భారీగా కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌లు 1–3 శాతం రేంజ్‌లో లాభపడ్డాయి. సెన్సెక్స్‌ మొత్తం 425 పాయింట్ల లాభంలో ఈ ఆరు షేర్ల వాటాయే 84 శాతంగా(358 పాయింట్లుగా) ఉంది.

మరిన్ని విశేషాలు..
∙ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.1.36 లక్షల కోట్లు పెరిగి రూ.1.48,37,723 కోట్లకు ఎగసింది. 

∙ఎన్‌టీపీసీ షేర్‌ 3.2 శాతం లాభంతో రూ.140 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. 

∙చైర్మన్‌ పదవి నుంచి నరేశ్‌ గోయల్‌ వైదొలగి, రుణదాతల నియంత్రణలోకి జెట్‌ ఎయిర్‌వేస్‌ రావడం, రూ.1,500 కోట్లు తక్షణ రుణం అందనుండటంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ లాభాలు రెండో రోజూ కూడా కొనసాగాయి. సోమవారం 13 శాతం లాభపడిన ఈ షేర్‌ మంగళవారం మరో 6.4 శాతం ఎగసి రూ.271 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 10% లాభపడింది. 

శనివారం ఎన్‌ఎస్‌ఈ మాక్‌ ట్రేడింగ్‌
శనివారం ఎన్‌ఎస్‌ఈ మాక్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తోంది. ప్రి–ఓపెన్‌ మాక్‌ ట్రేడింగ్‌ ఉదయం 10 గంటలకు మొదలై 10.08 వరకూ జరుగుతుంది. సాధారణ ట్రేడింగ్‌కు సంబంధించిన మాక్‌ ట్రేడింగ్‌ గం.10.15 ని. ఆరంభమై, సాయంత్రం గం.3.30 ని. వరకూ కొనసాగుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top