38వేల దిగువకు సెన్సెక్స్‌

Sensex Plunges Over 400 Points, Nifty Below 11500 - Sakshi

తీవ్రమవుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు

కొనసాగుతున్న రూపాయి క్షీణత

భగ్గుమన్న ముడి చమురు ధరలు

మరింతగా పెరిగిన క్యాడ్‌

వెన్నాడిన ఫెడ్‌రేట్ల పెంపు భయాలు

38 వేల పాయింట్ల కిందకు సెన్సెక్స్‌

468 పాయింట్ల నష్టంతో 37,922 వద్ద ముగింపు

11,450 దిగువకు నిఫ్టీ; 151 పాయింట్లు పతనమై 11,438కు  

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. దీనికి రూపాయి పతనం, ముడి చమురు ధరలు మండిపోవడం కూడా తోడవడంతో సోమవారం మన స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. కరంట్‌ అకౌంట్‌ లోటు మరింతగా పెరగడంతో సెన్సెక్స్‌ 38 వేలు, నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు పటిష్టంగా ఉండటంతో ఫెడరల్‌ రిజర్వ్‌రేట్ల పెంపు తధ్యమన్న అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

మరోవైపు కొనసాగుతున్న రూపాయి పతనం భారత కంపెనీలకు ప్రతికూలమని మూడీస్‌ నివేదిక హెచ్చరించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 468 పాయింట్లు క్షీణించి 37,922 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయి 11,438 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే సెన్సెక్స్‌ 1.22 శాతం, నిఫ్టీ 1.3 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు  మూడు వారాల కనిష్ట స్థాయికి క్షీణించాయి.

ఈ ఏడాది మార్చి 16 తర్వాత సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి. మార్చి 16న సెన్సెక్స్‌ 509 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ విషయానికొస్తే, ఈ ఏడాది ఫిబ్రవరి 6 తర్వాత నిఫ్టీ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం కూడా ఇదే మొదటిసారి. బ్యాంక్, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, ఫార్మా షేర్లు తగ్గాయి.ఐటీ షేర్లు మాత్రం లాభపడ్డాయి.  

ఆరంభం నుంచే అమ్మకాలు..
ఆరంభం నుంచే అమ్మకాల వెల్లువతో స్టాక్‌ సూచీలు నష్టపోయాయి. నష్టాలు అంతకంతకూ పెరిగాయే కానీ ఏమాత్రం తగ్గలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 507 పాయింట్లు, నిఫ్టీ 162 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో కరంట్‌ అకౌంట్‌ లోటు మరింతగా విస్తరిస్తుందనే ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు.

అమెరికా ఉద్యోగ గణాంకాలు పటిష్టంగా ఉండటంతో డాలర్‌ బలపడి రూపాయి క్షీణించడం, పదేళ్ల బాండ్ల రాబడులు పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయని వివరించారు. కాగా స్టాక్‌ మార్కెట్లో బలహీనతలు కొనసాగుతాయని, కరెక్షన్‌ మరికొంత కాలం తప్పదని నిపుణులంటున్నారు. హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 1.3 శాతం, చైనా షాంగై సూచీ 1 శాతం చొప్పున నష్టపోగా, జపాన్‌ నికాయ్‌ మాత్రం స్వల్పంగా లాభపడింది. ఇక యూరప్‌ మార్కెట్లు నష్టాల్లో ఆరంభమై, స్వల్ప లాభాల్లో ముగిశాయి.

రూ. 2 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1.96 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.155.44 లక్షల కోట్లకు పరిమితమైంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top