10,450 దిగువకు నిఫ్టీ

 Sensex plunges 306 pts, Nifty below 10450: 5 key factors - Sakshi

  అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు

కంపెనీల ఫలితాలు అంతంతే

సెన్సెక్స్‌ 306 పాయింట్లు పతనం

10,430 పాయింట్లకు నిఫ్టీ

ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో స్టాక్‌ మార్కెట్‌ బుధవారం భారీగా నష్టపోయింది. చివర్లో అమ్మకాలు జోరుగా ఉండటంతో స్టాక్‌ సూచీలు పతనమయ్యాయి.  రూపాయి 18 నెలల కనిష్టానికి పడిపోవడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పతనం కావడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,450 పాయింట్ల దిగువకు పతనమైంది. సెన్సెక్స్‌ 306 పాయింట్ల నష్టంతో 34,345 పాయింట్ల వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు పతనమై 10,430 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి.  

ఉత్తర కొరియాతో వచ్చే నెలలో జరిగే శిఖరాగ్ర చర్చల విషయమై అనిశ్చితి చోటు చేసుకోవడం, సుంకాల విషయమై చైనాతో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వెలిబుచ్చడం ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ట్రేడింగ్‌ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 17 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 348 పాయింట్లు పతనమైంది. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగా ఉండటం, రూపాయి పతనం కారణంగా మార్కెట్‌ నష్టపోయిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.
 
కొనసాగిన ఎస్‌బీఐ జోరు..
మంగళవారం 4 శాతం లాభపడిన ఎస్‌బీఐ బుధవారం కూడా మరో 4 శతం ఎగసింది. ఇంట్రాడేలో 6.1 శాతం లాభంతో రూ.270కు ఎగసిన ఈ షేర్‌చివరకు 3.5 శాతం లాభంతో రూ.263 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  వచ్చే ఆర్థిక సంవత్సరం మంచి ఫలితాలు సాధించగలమన్న బ్యాంక్‌ ఆశాభావం, రుణ నాణ్యత మెరుగుపడగలదన్న అంచనాలు ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురికొల్పాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎస్‌బీఐ జోరు కారణంగా అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూకో బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్‌లు 1–3% రేంజ్‌లో ఎగశాయి.  

వేదాంత 6 శాతం డౌన్‌: తమిళనాడులోని తూత్తుకుడి ఘటన నేపథ్యంలో వేదాంత షేర్‌ 6.2 శాతం నష్టంతో రూ.253 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు పతనం కావడం ఇతర లోహ షేర్లను నష్టాలపాలు చేసింది. టాటా స్టీల్‌ షేర్‌ 6.57 శాతం నష్టపోయి రూ.539 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. సెయిల్, నాల్కో, హిందుస్తాన్‌ జింక్, హిందాల్కో, ఎన్‌ఎమ్‌డీసీ షేర్లు 4 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు పెట్రో ధరల భారాన్ని భరించాల్సిందిగా ప్రభుత్వం కోరే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌లు 8 శాతం వరకూ నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top