10,800 పాయింట్లపైకి నిఫ్టీ

Sensex opens 50 points lower in early trade; Nifty tests 10,750 - Sakshi

సానుకూలంగా అంతర్జాతీయ సంకేతాలు  

చివరి రెండు గంటల్లో జోరుగా కొనుగోళ్లు

మూడో రోజూ మార్కెట్‌ ముందుకే...

131 పాయింట్లు ఎగసి 35,981కు సెన్సెక్స్‌

30 పాయింట్లు పెరిగి 10,802కు నిఫ్టీ  

బ్యాంక్‌ షేర్ల జోరుతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌  వరుసగా మూడవరోజూ లాభాల్లో ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగినప్పటికీ, చివరి రెండు గంటల్లో కొనుగోళ్లు జోరుగా సాగడంతో స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. నిఫ్టీ కీలకమైన 10,800 పాయింట్లపైకి ఎగబాకింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం జరుగుతున్న చర్చల ఫలితంగా అమెరికా– చైనాల మధ్య ఒక ఒప్పందం కుదరగలదన్న అంచనాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పెరగడం కలసి వచ్చింది. కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కొనసాగడం సానుకూల ప్రభావం చూపింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 131 పాయింట్లు పెరిగి 35,981 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 10,802 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, వాహన, లోహ షేర్లు పెరిగాయి. స్టాక్‌ మార్కెట్‌ వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడింది. ఈ మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 466 పాయింట్లు పెరిగింది.  

నష్టాల్లోంచి లాభాల్లోకి... 
ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి బలహీనపడింది. దీంతో ఇటీవల పెరిగిన కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో రోజులో ఎక్కువ భాగం స్టాక్‌ సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు తగ్గాయని, నిధలు సమస్యలేదని, మొత్తం మీద బ్యాంకింగ్‌ రంగం సంతృప్తికరంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం వెల్లడించడంతో బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 7.2 శాతానికి ప్రభుత్వం సవరించడం కూడా సానుకూల ప్రభావం చూపించింది.  

283 పాయింట్ల రేంజ్‌ సెన్సెక్స్‌... 
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. రూపాయి బలహీనత కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. ఆ తర్వాత లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. చివరి రెండు గంటల్లో కొనుగోళ్లు కొనసాగడంతో లాభాలూ కొనసాగాయి. ఒక దశలో 96 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్‌ మరో దశలో 187 పాయింట్ల వరకూ పెరిగింది. మొత్తం మీద రోజంతా 283 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  కాగా  క్యూ3 ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో గత కొన్ని రోజులుగా ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ పెరుగుతోంది.  బుధవారం ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.381.60 ను తాకింది. చివరకు 3.4 శాతం లాభంతో రూ.380  వద్ద ముగిసింది.

ఈ ఏడాది చివరకు నిఫ్టీ@11,300
బ్యాంక్‌ ఆఫ్‌  అమెరికా– మెరిల్‌ లించ్‌
ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ దాదాపు వెయ్యి పాయింట్లకు పైగా క్షీణించగలదని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌ అంచనా వేసింది. మన స్టాక్‌ మార్కెట్‌ విలువ అధికంగా ఉందని, అందుకని ఈ ఏడాది మొదటి అర్థభాగంలో రెండంకెల శాతం మేర స్టాక్‌ సూచీలు క్షీణిస్తాయని పేర్కొంది. ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్‌ పెరుగుతుందని వివరించింది. ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ 11,300 పాయింట్ల వద్దకు(మంగళవారం నిఫ్టీ ముగింపు 10,802 పాయింట్లతో పోల్చితే ఇది 4.6 శాతం వృద్ధి) చేరగలుగుతుందని  అంచనా వేస్తోంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top