లాభాల వర్షం

 Sensex Nifty trade up but these stocks crack up to 9% - Sakshi

తొమ్మిదో రోజూ ఎగిసిన సూచీలు

జోష్‌నిచ్చిన ప్రపంచబ్యాంక్‌ వృద్ధి అంచనాలు  

90 పాయింట్లు పెరిగి 34,395కు సెన్సెక్స్‌

20 పాయింట్ల లాభంతో 10,549కు నిఫ్టీ  

మన స్టాక్‌ మార్కెట్‌లో లాభాల వర్షం కొనసాగుతోంది. ఈ ఏడాది మంచి వర్షాలే కురుస్తాయన్న  భారత వాతావరణ విభాగం అంచనాలు మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ను లాభాల్లో ముంచాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడం కూడా కలసి రావడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 34,395 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10,549 పాయింట్ల వద్ద ముగిశాయి.

స్టాక్‌ సూచీలు వరుసగా తొమ్మిదో రోజూ లాభపడ్డాయి. ఇన్ని ఎక్కువ రోజులు స్టాక్‌ సూచీలు లాభాల్లో కొనసాగడం గత మూడేళ్లలో ఇదే తొలిసారి. ఈ తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,376 పాయింట్లు లాభపడింది.  

రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ!  
ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే ఉండగలవన్న అంచనాలు.. అధిక వ్యవసాయోత్పత్తి సాధించగలదని ఆశలను రేకెత్తిస్తున్నాయి. వర్ష ఆధారిత మన ఆర్థిక వ్యవస్థకు ఈ అంచనాలు, ఆశలు జోష్‌ నిస్తాయనే అంచనాలు.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు మరింత జోష్‌నిచ్చాయి.

భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం చొప్పున వృద్ధి సాధించగలదన్న ప్రపంచ బ్యాంక్‌ అంచనాలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు నుంచి మన ఆర్థిక వ్యవస్థ కోలుకుందన్న ప్రపంచ బ్యాంక్‌ ప్రశంసలు సానుకూల ప్రభావం చూపించాయి. కంపెనీల క్యూ4 ఫలితాలు బాగా ఉంటాయన్న ఆశలు కూడా కొనుగోళ్ల జోరు పెరగడానికి కారణమయ్యాయి.

విద్యుత్తు, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, కన్సూమర్‌ డ్యూరబుల్స్, లోహ, ఇన్‌ఫ్రా, పీఎస్‌యూ, ఆయిల్, గ్యాస్, బ్యాంకింగ్‌ షేర్లు లాభపడగా, ఐటీ, టెక్నాలజీ, హెల్త్‌కేర్, వాహన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  

205 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌
లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 129 పాయింట్ల లాభంతో 34,434 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఆ తర్వాత నష్టపోయింది. ఇంట్రాడేలో 76 పాయింట్ల నష్టంతో 34,230 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత కోలుకొని మళ్లీ లాభాల్లోకి వచ్చింది. మొత్తం మీద రోజంతా 205 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  

సాధారణ వర్షపాత అంచనాలతో మార్కెట్‌ లాభపడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అయితే ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం, కర్ణాటకలో ఎన్నికలు జరగనుండడంతో అప్రమత్తత నెలకొన్నదని దీంతో లాభాలు పరిమితమయ్యాయని వివరించారు. రూపాయి బలహీనపడినప్పటికీ ఐటీ షేర్లు డీలా పడ్డాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్జిన్‌ అంచనాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని పేర్కొన్నారు.  

ఎమ్‌ఆర్‌ఎఫ్‌ @  80,000
టైర్ల కంపెనీ ఎమ్‌ఆర్‌ఎఫ్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.80,000 ను తాకింది. ఒక భారత షేర్‌ ఈ స్థాయికి పెరగడం ఇదే  మొదటిసారి. చివరకు ఈ షేర్‌ 2 శాతం లాభంతో రూ.79,796 వద్ద ముగిసింది. ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల లాభాలు, అమ్మకాలు పెరుగుతాయన్న వార్తల కారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు పరుగులు పెట్టాయి.

హిందుస్తాన్‌ యూనిలివర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ వంటి ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌  హైని తాకాయి. అక్షయ తృతీయ అమ్మకాలు బాగా ఉంటాయనే అంచనాలతో జ్యూయలరీ షేర్లు మెరుపులు మెరిపించాయి. టీబీజడ్‌ 6 శాతం, టైటాన్‌ కంపెనీ 1.5 శాతం, పీసీ జ్యూయలర్‌ 1.5 శాతం చొప్పున లాభపడ్డాయి. డిమాండ్‌ పుంజుకోవడంతో హోటల్‌ షేర్లు జోరుగా పెరిగాయి. ఇండియన్‌ హోటల్స్, తాజ్‌ జీవీకే, లెమన్‌ ట్రీ హోటల్స్, కామత్‌ హోటల్స్‌ షేర్లు 20 శాతం వరకూ పెరిగాయి.  

Advertisement
Advertisement

- మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది

- అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం

- ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరణకు గురవుతాయి

- వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top