ప్రపంచ మార్కెట్ల అండ

Sensex, Nifty trade higher; these stocks gain over 10% - Sakshi

142 పాయింట్ల లాభంతో 34,297కు సెన్సెక్స్‌

ఒడిదుడుకులమయంగా సాగిన గురువారం నాటి ట్రేడింగ్‌లో స్టాక్‌ మార్కెట్‌ చివరకు లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడం, ద్రవ్యోల్బణ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండటం, ఇటీవల పతనం కారణంగా ఆకర్షణీయ ధరల్లో షేర్లు లభ్యం కావడంతో కొనుగోళ్లు జరగడం సానుకూల ప్రభావం చూపించాయి.

అయితే  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ స్కామ్‌ కారణంగా బ్యాంక్‌ షేర్ల నష్టాలు కొనసాగడంతో ఆరంభ లాభాలు తగ్గాయి. సెన్సెక్స్‌  142 పాయింట్లు లాభపడి 34,297 పాయింట్ల వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 10,546 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 379 పాయింట్లు,  నిఫ్టీ 117 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు  
అమెరికాలో ద్రవ్యోల్బణం 2.1 శాతానికి ఎగసినా, వినియోగదారుల అమ్మకాల గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడయ్యాయి. మన దగ్గర జనవరి నెల టోకు ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయి, 2.84 శాతానికి దిగివచ్చింది. కొన్ని బ్లూ చిప్‌ కంపెనీల క్యూ3 ఫలితాలు అంచనాలను మించడంతో కొనుగోళ్లు జరిగాయి.
 
జ్యుయలరీ షేర్లు పతనం   
పీఎన్‌బీ స్కామ్‌ నేపథ్యంలో కొన్ని పెద్ద జ్యుయలరీ కంపెనీలు–గీతాంజలి, జిన్ని, నక్షత్రలపై దృష్టి సారిస్తున్నామని సీబీఐ ఉన్నతాధికారొకరు బుధవారమే వెల్లడించారు. దీంతో గీతాంజలి జెమ్స్‌ షేర్‌ 20 శాతం పతనమై, ఏడాది కనిష్ట స్థాయి రూ.46.90కు పడిపోయింది. . దీంతో  కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.140 కోట్లు తగ్గి రూ.556 కోట్లకు పడిపోయింది. ఇతర జ్యూయలరీ షేర్లు–టీబీజడ్,  రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్, పీసీ జ్యూయలర్, తంగమలై జ్యుయలరీ, తదితర షేర్లు 5 శాతం వరకూ నష్టపోయాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top