ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌

Sensex, Nifty snap 5-day fall - Sakshi

స్వల్ప లాభాలతో గట్టెక్కిన సూచీలు  

వరుస ఐదు రోజుల స్టాక్‌ మార్కెట్‌ నష్టాలకు మంగళవారం బ్రేక్‌ పడింది.  లాభనష్టాల మధ్య దోబూచులాడిన స్టాక్‌ సూచీలు చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఇటీవల నష్టపోయిన వాహన, లోహ, బ్యాంకింగ్, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఇటీవల బాగా పతనమైన షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 35 పాయింట్లు లాభపడి 34,651 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 10,537 పాయింట్ల వద్ద ముగిశాయి.

అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి.   మొత్తం మీద రోజంతా 205 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 941 పాయింట్లు నష్టపోయింది.   రూపాయి కోలుకోవడం సానుకూల ప్రభావం చూపించినా,  ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, కొన్ని కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటంతో మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.వివరించారు.

దివాళా కేసులు ఒక కొలిక్కి వస్తుండటంతో మొండి బకాయిల సమస్య పరిష్కారమవుతుందనే అంచనాలు, కొన్ని  బ్యాంక్‌ షేర్లలో షార్ట్‌కవరింగ్‌ చోటు చేసుకోవడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయని పేర్కొన్నారు.  పడిపోతున్న ధరల నియంత్రణ గాను నిల్వలను(బఫర్‌ స్టాక్స్‌) మరింతగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తల కారణంగా పంచదార షేర్లు పరుగులు పెట్టాయి.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top