పరిమితి శ్రేణిలో మార్కెట్‌ 

Sensex, Nifty slip on weak global sentiment - Sakshi

వృద్ధిపై ఆర్‌బీఐ ఆందోళన  

స్వల్ప శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీలు  

27 పాయింట్లు తగ్గి 35,871కు సెన్సెక్స్‌ 

2 పాయింట్లు పెరిగి 10,792కు నిఫ్టీ  

ఆద్యంతం పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య కదలాడిన శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌  చివరకు నష్టాల్లో ముగిసింది. దీంతో సెన్సెక్స్‌ లాభాలు రెండు రోజులకే పరిమితమయ్యాయి. వృద్ధి అంచనాలపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిందన్న ఆర్‌బీఐ మినిట్స్‌ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 27 పాయింట్లు తగ్గి 35,871 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 10,792 పాయింట్ల వద్దకు చేరింది. లోహ, వాహన షేర్లు పెరగగా, బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 63 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు చొప్పున పెరిగాయి.  

లాభ, నష్టాల మధ్య దోబూచులాట 
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా స్టాక్‌ సూచీలు పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఇటీవలి ఆర్‌బీఐ మోనేటరీ పాలసీ కమిటీ మినట్స్‌ (సమావేశ వివరాలు) గురువారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడయ్యాయి. బలహీనంగా ఉన్న వృద్ధి పట్ల ఈ కమిటీ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ మినిట్స్‌ పేర్కొన్నాయి. పదేళ్ల బాండ్ల రాబడుల పెరగడం, బ్యాంక్‌ షేర్లు కుదేలవడం, ముడి చమురు ధరలు పెరగుతుండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్‌ నష్టాల్లో ఆరంభమైంది. ఆ తర్వాత లాభాల్లోకి మళ్లింది. ఇలా రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. ఒక దశలో 43 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 103 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 146 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. సుంకాల విధింపునకు గడువు తేదీ అయిన మార్చి 1కు ముందే అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరగలదన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

►కోటక్‌ బ్యాంక్‌లో ఐఎన్‌జీ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్‌ 3.7 శాతం నష్టంతో రూ.1,241  వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
►  గ్రీసులో కొత్త విమానాశ్రయ అభివృద్ధి కోసం ఒప్పందం కుదరడంతో జీఎమ్‌ఆర్‌ ఇన్‌ఫ్రా షేర్‌ 2% లాభపడి రూ.16.45  వద్ద ముగిసింది.  
► భారత సైన్యం నుంచి 200 కోట్ల డాలర్ల ఆర్డర్‌ రావడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 7 శాతం లాభపడి రూ.129 వద్ద ముగిసింది.  
►   సుజ్లాన్‌ ఎనర్జీలో డెన్మార్క్‌ కంపెనీ నియంత్రిత వాటాను కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా సుజ్లాన్‌ ఎనర్జీ 31 శాతం ఎగసి రూ.5.80 వద్ద ముగిసింది.  
►రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. గత రెండు రోజుల్లో ఈ షేర్‌ 30 శాతానికి పైగా ఎగసింది.

విదేశీ ఇన్వెస్టర్ల రూ.6,311 కోట్ల పెట్టుబడులు 
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)మన స్టాక్‌ మార్కెట్లో ఒక శుక్రవారం రోజే రూ.6,311 కోట్లు నికర పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత అత్యధిక స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు రూ.10,438 కోట్లు కొనుగోళ్లు,  రూ.4,127 కోట్ల  అమ్మకాలు జరిపారు. దీంతో వీరి నికర కొనుగోళ్లు రూ.6,311 కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ నెల 11న ఎఫ్‌పీఐలు రూ.2,966 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఇదే అత్యంత అధిక పెట్టుబడి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top