‘రికార్డ్‌’ లాభాలు ఆవిరి

Sensex, Nifty settle with small losses - Sakshi

ఆరంభంలో ఆల్‌టైమ్‌ హైకి సెన్సెక్స్‌

192 పాయింట్ల లాభంతో 36,740ను తాకిన సెన్సెక్స్‌

ఆ తర్వాత లాభాల స్వీకరణ  

చివరకు 7 పాయింట్ల నష్టంతో 36,542 వద్ద ముగింపు

అంతర్జాతీయ సంకేతాలు పటిష్టంగా ఉన్నప్పటికీ, శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ స్వల్పంగా నష్టపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇంట్రాడేలో రికార్డ్‌ స్థాయికి చేరినప్పటికీ, ఇటీవల బాగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో నష్టాల్లో ముగిసింది. అయితే నిఫ్టీ కీలకమైన 11 వేల పాయింట్ల ఎగువనే ముగిసింది. మే నెలలో పారిశ్రామికోత్పత్తి, జూన్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశాజనకంగా ఉండడం ప్రతికూల ప్రభావం చూపించింది.

ఇంట్రాడేలో 192 పాయింట్ల లాభంతో 36,740 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ హైని తాకిన సెన్సెక్స్‌ చివరకు 7 పాయింట్ల నష్టంతో 36,542 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 11,019 పాయింట్ల వద్ద ముగిసింది.  మౌలిక, రియల్టీ, పీఎస్‌యూ, ఎఫ్‌ఎమ్‌సీజీ, విద్యుత్తు, క్యాపిటల్‌ గూడ్స్, ఫార్మా, బ్యాంక్, లోహ, వాహన, ఆయిల్, గ్యాస్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా రెండో వారమూ స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. సెన్సెక్స్‌ 884 పాయింట్లు(2.48%), నిఫ్టీ 246 పాయింట్లు(2.29%) చొప్పున లాభపడ్డాయి.  

238 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌  
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్ల జోరుతో కొనుగోళ్లు ఊపందుకోవడం, రూపాయి బలపడటంతో ఇంట్రాడేలో 192 పాయింట్ల లాభంతో 36,740 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. ఇది సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి.

మేలో పారిశ్రామికోత్పత్తి ఉత్పత్తి ఏడు నెలల కనిష్టానికి, 3.2 శాతానికి తగ్గడం, జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి, 5 శాతానికి ఎగియడంతో అప్రమత్తమైన ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఈ లాభాలన్నీ ఆవిరయ్యాయి.  

ఆల్‌టైమ్‌ హైకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌...
ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన షేర్ల జారీకి సంబంధించిన ధరను ఈ నెల 17న నిర్ణయించనుండటంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ 1 శాతం లాభంతో రూ. 2,181 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.2,189 ని తాకింది. ఈ షేర్‌తో పాటు టీసీఎస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎంఫసిస్, మ్యారికో, ఎల్‌ అండ్‌టీ ఇన్ఫోటెక్, బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందుస్తాన్‌ యూని లివర్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తదితర షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.

సినిమా హాళ్లలో ప్రేక్షకులు తమ సొంత ఆహార పదార్థాలను వెంటతెచ్చుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో పీవీఆర్, ఐనాక్స్‌ విండ్‌షేర్లు 5–13 శాతం రేంజ్‌లో పతనమయ్యాయి.  హైదరాబాద్‌ ఐటీ కంపెనీ సైయంట్‌ నికర లాభం ఈ క్యూ1లో 6 శాతం తగ్గి రూ.83 కోట్లకు చేరడంతో ఈ షేర్‌ 6 శాతం పతనమై రూ.696 వద్ద ముగిసింది.  

రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ @ 7 లక్షల కోట్లు
రిలయన్స్‌ షేర్‌ 1.3 శాతం లాభంతో రూ.1,099 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,107ను తాకినప్పుడు ఈ  షేర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది.  ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే. ఇంతకు ముందు ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఈ రికార్డ్‌ను సాధించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top