చమురు పతనంతో లాభాలు

Sensex, Nifty Resume Rally After Two-Day Blip - Sakshi

4 శాతం తగ్గిన చమురు ధరలు

పుంజుకున్న రూపాయి

196 పాయింట్లు పెరిగి 36,520కు సెన్సెక్స్‌

71 పాయింట్ల లాభంతో 11,008కు నిఫ్టీ   

ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో  స్టాక్‌ సూచీలు మంగళవారం భారీ లాభాలను సాధించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్ల ఎగువకు ఎగబాకింది. చమురు, లోహ, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా షేర్ల ర్యాలీతో స్టాక్‌  మార్కెట్‌ కళకళలాడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 196 పాయింట్లు లాభపడి 36,520 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,008 పాయింట్ల వద్ద ముగిశాయి.

చమురు 4 శాతం డౌన్‌..
అధిక సరఫరాల అంచనాల కారణంగా ముడిచమురు ధరలు సోమవారం 4 శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో డాలర్‌తో రూపాయి మారకం బలపడటం, బాండ్ల రాబడులు తగ్గడం  సానుకూల ప్రభావం చూపించాయి.  మరోవైపు పంజాబ్‌  నేషనల్‌ బ్యాంక్, కార్పొరేషన్‌ బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తదితర కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మరికొన్ని రోజుల్లో రూ.10,000 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం అందించనున్నదన్న వార్తలూ కొనుగోళ్ల జోరును పెంచాయి.  

288 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 62 పాయింట్ల నష్టంతో 36,262 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత కొనుగోళ్ల జోరు పుంజుకోవడంతో లాభాల బాట పట్టింది.  ఇంట్రాడేలో 226 పాయింట్ల లాభంతో 36,550 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. అయితే హిందుస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా లాభాలు పరిమితమయ్యాయి. 

మొత్తం మీద రోజంతా 288 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇప్పటివరకూ వెలువడిన కంపెనీల క్యూ1 ఫలితాలు బాగా ఉండటం, చమురు ధరలు తగ్గడంతో రూపాయి బలపడిందని, దీంతో స్టాక్‌ మార్కెట్‌ లాభపడిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.  అమెరికా పార్లమెంట్‌లో తొలిసారిగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమి పావెల్‌ ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో వడ్డీరేట్ల పెంపుపై ఆయన చేసే వ్యాఖ్యల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,500 కోట్ల నికర లాభం సాధించడం లక్ష్యమని, కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా రూ.8,600 కోట్లు సమీకరించాలన్న యాక్షన్‌  ప్లాన్‌ కారణంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ 6.5 శాతం లాభపడి రూ.78.70 వద్ద ముగిసింది.
   కేంద్రం నుంచి మరిన్ని మూలధన నిధులు అందనున్నాయన్న వార్తల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు పరుగులు పెట్టాయి. బీఓబీ, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓబీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్,  కెనరా బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్‌బ్యాంక్‌ షేర్లు 4–6% రేంజ్‌లో పెరిగాయి.  
   యస్‌ బ్యాంక్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి 386ను తాకింది. మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని ఆరంభించడానికి సెబీ నుంచి ఆమోదం పొందినప్పటినుంచి, గత 9 రోజుల్లో ఈ షేర్‌ పెరుగుతూనే ఉంది. ఈ షేర్‌తో పాటు బజాజ్‌ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, టీసీఎస్‌లు కూడా ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌ హైలను తాకాయి.  
    నెస్లే ఇండియా మార్కెట్‌ క్యాప్‌ రూ. లక్ష కోట్లను దాటింది. లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఘనత సాధించిన మూడో ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ ఇది. ఇప్పటివరకూ ఐటీసీ, హెచ్‌యూఎల్‌లు ఈ మైలురాయిని దాటాయి. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.10,574ను తాకిన ఈ షేర్‌ చివరకు 3 శాతం లాభంతో రూ.10,532 వద్ద ముగిసింది.  
 చమురు ధరల పతనం కారణంగా హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ షేర్లు 6 శాతం వరకూ పెరిగాయి.

టాటా స్పాంజ్‌ ఐరన్‌ లాభం 49% వృద్ధి
న్యూఢిల్లీ: టాటా స్పాంజ్‌ ఐరన్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 49 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.31 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.46 కోట్లకు పెరిగిందని టాటా స్పాంజ్‌ ఐరన్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.202 కోట్ల నుంచి రూ.273 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్‌ 0.9 శాతం లాభంతో రూ.968 వద్ద ముగిసింది

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రెట్టింపైంది. గత క్యూ1లో రూ. 42 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.91 కోట్లకు పెరిగిందని జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,204 కోట్ల నుంచి రూ.3,153 కోట్లకు పెరిగిందని జేఎస్‌ఎల్‌ ఎమ్‌డీ అభ్యుదయ్‌ జిందాల్‌ చెప్పారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ మార్కెట్‌ జోరు కారణంగా అమ్మకాలు 51 శాతం పెరిగాయని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top