మళ్లీ 11,000 పైకి నిఫ్టీ

Sensex, Nifty pare gains - Sakshi

అవిశ్వాస తీర్మానాన్ని పట్టించుకోని మార్కెట్‌

కలసివచ్చిన రూపాయి రికవరీ

145 పాయింట్లు పెరిగి 36,496కు సెన్సెక్స్‌

53 పాయింట్ల లాభంతో 11,010కు నిప్టీ  

ఐటీ, ఫార్మా షేర్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాల్లో ముగిసింది. నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్ల పైకి ఎగబాకింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 145 పాయింట్లు పెరిగి 36,496 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 11,010 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రా, బ్యాంక్‌ షేర్లు లాభపడగా, లోహ, వాహన షేర్లు నష్టపోయాయి.

వారం పరంగా చూస్తే స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. గత మూడు వారాల్లో స్టాక్‌ మార్కెట్‌కు  తొలి సారి నష్టం ఇదే. ఈ వారంలో  సెన్సెక్స్‌ 45 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఇన్వెస్టర్లు అవిశ్వాస తీర్మానాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పైగా తాజా పొజిషన్లను తీసుకున్నారని స్టాక్‌ బ్రోకర్లు వ్యాఖ్యానించారు. డాలర్‌తో రూపాయి మారకం రికార్డ్‌ స్థాయి పతనం (69.13) నుంచి కోలుకోవడం కలసివచ్చిందని పేర్కొన్నారు.  

ఇంట్రాడేలో 216 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌...
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది.  ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో నష్టాల్లోకి జారిపోయింది. 16 పాయింట్ల నష్టంతో 36,336 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇటీవల పతనమైన కొన్ని షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడంతో లాభాల్లోకి మళ్లింది. 216 పాయింట్ల లాభంతో 36,567 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా 232 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.

ఆల్‌టైమ్‌ హైకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,138ని తాకింది. చివరకు 2.2 శాతం లాభంతో రూ.1,129 వద్ద ముగిసింది. ఇది కూడా ఆల్‌టైమ్‌ హై. ఇటీవల జరిగిన కంపెనీ 41వ ఏజీఎమ్‌ నుంచి ఈ షేర్‌ పెరుగుతూనే ఉంది. ఏడాది కాలంలో ఈ షేర్‌ 40 శాతం ఎగసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,15,107 కోట్లకు చేరింది.

మార్కెట్‌ క్యాప్‌ పరంగా అతి పెద్ద రెండో కంపెనీ ఇదే. మొదటిది టీసీఎస్‌. బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌ సర్వ్, బంధన్‌ బ్యాంక్, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్, హెచ్‌ఈజీ షేర్లు కూడా ఆల్‌టైమ్‌హైలను తాకాయి. గత నాలుగు నెలల కాలంలో బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 62 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 32 శాతం చొప్పున లాభపడ్డాయి. మరో బజాజ్‌ గ్రూప్‌ కంపెనీ బజాజ్‌ ఆటో షేర్‌ మాత్రం 9 శాతం వరకూ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, యూరప్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఆరంభమై, స్వల్ప నష్టాల్లో ముగిశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top