ఆరు నెలల కనిష్టానికి స్టాక్‌ సూచీలు

Sensex, Nifty hit nearly 7-month low - Sakshi

ప్రపంచ మార్కెట్ల పతనం

ఒడిదుడుకుల్లో  రూపాయి

చివర్లో షార్ట్‌ కవరింగ్‌తో తగ్గిన నష్టాలు

10,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ

98 పాయింట్లు పతనమై 10,147 వద్ద ముగింపు

287 పాయింట్లు నష్టపోయి 33,847కు సెన్సెక్స్‌   

రూపాయి పతనానికి, బలహీన అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టాల్లో ముగిసింది. వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ నష్టపోయిన స్టాక్‌ సూచీలు ఆరు నెలల కనిష్టానికి పడిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కీలకమైన 34,000 పాయింట్లు, నిఫ్టీ కీలకమైన 10,200 పాయింట్ల దిగువకు క్షీణించాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన, ఆర్థిక రంగ షేర్లు కుదేలయ్యాయి. 

ట్రేడింగ్‌ చివర్లో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరగడంతో నష్టాలు తగ్గాయి.   సెన్సెక్స్‌ 287 పాయింట్లు పతనమై 33,847 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 98  పాయింట్లు క్షీణించి 10,147 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్తు, రియల్టీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. సూచీల్లో  వెయిటేజీ అధికంగా ఉన్న ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు 2 శాతం వరకూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ మొత్తం 287 పాయింట్ల నష్టంలో ఈ షేర్ల నష్టాల వాటానే 250 పాయింట్ల వరకూ ఉంది.  

అంతర్జాతీయ సంకేతాల బలహీనత...
డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 73.82కు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు దిగిరావడంతో చివరకు రూపాయి ఫ్లాట్‌గా ముగిసినా, రోజంతా తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. సౌదీ జర్నలిస్ట్‌ ఖషోగ్గి మృతిపై భౌగోళిక–రాజకీయ దుమారం చెలరేగడం, బ్రెగ్జిట్, ఇటలీ బడ్జెట్, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరలిపోతుండటం,  తదితర అంశాలు కూడా తమ వంతు ప్రభావం చూపాయి.  

392 పాయింట్ల వరకూ సెన్సెక్స్‌ డౌన్‌...
ఆసియా మార్కెట్ల బలహీనత కారణంగా సెన్సెక్స్‌ నష్టాల్లోనే ఆరంభమైంది. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఒక దశలో  392 పాయింట్ల నష్టంతో 33,743 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఒక దశలో 23 పాయింట్లు లాభపడినా, మరో దశలో 143 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా స్టాక్‌ మార్కెట్‌కు నష్టాలు వచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌  వి.కె. శర్మ చెప్పారు.

ఇతర షేర్లు పతనమవుతున్నా, ఈ రెండు రంగాల షేర్లు నిలదొక్కుకున్నాయని, ఇన్వెస్టర్లు తాజాగా ఈ షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారని వివరించారు. ఆసియా, యూరప్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. హాంగ్‌కాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 3.2 శాతం, జపాన్‌ నికాయ్‌ 2.67 శాతం, షాంఘై సూచీ 2.2 శాతం చొప్పున పతనమయ్యాయి. యూరప్‌ మార్కెట్లు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. జర్మనీ డ్యాక్స్‌ 2.4 శాతం, ఫ్రాన్స్‌ క్యాక్‌ 1.9 వాతం, లండన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ 1.5 శాతం వరకూ నష్టపోయాయి.  

షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీయా? మరింత పతనమా ?
పతనం మరింతగా కొనసాగితే నిఫ్టీకి 10,100 పాయింట్లు కీలక మద్దతు స్థాయని, దీన్ని కూడా కోల్పోతే 9,950 పాయింట్లకు పడిపోతుందని టెక్నికల్‌ ఎనలిస్ట్‌లు అంటున్నారు. అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరో రోజులో ముగుస్తుండటంతో షార్ట్‌  కవరింగ్‌ కొనుగోళ్లు జోరుగా జరిగితే నిఫ్టీ 10,245 పాయింట్లపైకి చేరుతుందని, అక్కడ నిలదొక్కుకోగలిగితే 10,400 పాయింట్ల పైకి చేరగలుగుతుందని వారంటున్నారు.  
ఆర్థిక ఫలితాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఏషియన్‌ పెయింట్స్‌ షేర్‌ 5.2 శాతం నష్టపోయి రూ.1,139 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. ఏషియన్‌ పెయింట్స్‌తో పాటు ఇతర పెయింట్‌ కంపెనీల షేర్లు–కన్సాయ్‌ నెరోలాక్, బెర్జర్‌ పెయింట్స్, షాలిమార్‌ పెయింట్స్‌ షేర్లు కూడా 4 శాతం వరకూ నష్టపోయాయి.  
♦  డిమార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేర్‌ దాదాపు ఏడాది కనిష్టానికి, 1,126కు పడిపోయింది. చివరకు 4.8 శాతం నష్టంతో రూ.1,136  వద్ద ముగిసింది. కంపెనీ మార్జిన్లు నిరాశపరచడంతో గత ఐదు రోజుల్లో ఈ షేర్‌ 15 శాతానికి పైగా నష్టపోయింది.  
 ఇటీవలే స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన బంధన్‌ బ్యాంక్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, డిక్సన్‌ టెక్నాలజీస్, హెచ్‌ జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్, ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్, మాస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, భారత్‌ డైనమిక్స్‌ షేర్లు జీవిత కాల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బంధన్‌ బ్యాంక్, డిక్సన్‌ టెక్నాలజీస్‌ మినహా మిగిలిన అన్ని షేర్లు వాటి ఇష్యూ ధరలతో పోల్చితే 13–51 శాతం మేర నష్టపోయాయి.  
 దాదాపు 300కు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్, ఇండియన్‌ బ్యాంక్, ఇండియా సిమెంట్స్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నెట్‌వర్క్స్, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్, డిష్‌ టీవీ, దిలిప్‌ బిల్డ్‌కాన్, డీబీ కార్ప్, క్రిసిల్, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, బ్లూ స్టార్, భారత్‌ ఫోర్జ్, బజాజ్‌ కార్ప్, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్, దాల్మియా భారత్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top