స్వల్ప లాభాలతో సరి

Sensex, Nifty extend gains to 4th week - Sakshi

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు  

నాలుగు నెలల గరిష్టానికి వాణిజ్య లోటు  

ఇంట్రాడేలో 180 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌  

చివర్లో ఫార్మా, టెక్నాలజీ షేర్లలో కొనుగోళ్లు  

22 పాయింట్లు పెరిగి 35,622కు సెన్సెక్స్‌

రోజంతా తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం నాడు చివరకు స్వల్ప లాభాలతో గట్టెక్కింది. సెన్సెక్స్‌ ఒక దశలో  180 పాయింట్ల వరకూ నష్టపోయింది. అయితే  ట్రేడింగ్‌ చివర్లో టెక్నాలజీ, ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరగడం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభపడటం వల్ల ఆ నష్టాలన్నింటినీ రికవరీ చేసుకోగలిగింది.

మొత్తం మీద 22 పాయింట్ల లాభంతో 35,622 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 10,818 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ నాలుగో రోజూ కీలకమైన 10,800 పాయింట్లపైనే ముగియడం విశేషం. లోహ, ప్రభుత్వ రంగ, ప్రభుత్వ రంగ బ్యాంక్, రియల్టీ, ఇన్‌ఫ్రా షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు వరుసగా నాలుగో వారంలోనూ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 178 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

మళ్లీ వాణిజ్య ఉద్రిక్తతల భయాలు..
చైనా నుంచి దిగుమతయ్యే 5,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై అమెరికా తాజాగా సుంకాలు విధించడం, మరో పదివేల కోట్ల డాలర్ల ఉత్పత్తులపై సుంకాల విధింపుకు అమెరికా సిద్ధంగా ఉందన్న వార్తలు వచ్చాయి. దీంతో వాణిజ్య ఉద్రిక్తతల భయాలు మళ్లీ చెలరేగి ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి.

మే నెలలో వాణిజ్య లోటు ప్రతికూల ప్రభావం చూపించింది. చైనాపై తాజాగా అమెరికా సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధాల భయాలు మళ్లీ చెలరేగాయని, దీంతో స్టాక్‌ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.  

ఈ వారంలో ఫార్మాదే రాజ్యం...
ఈ వారంలో ఫార్మా షేర్లు రాజ్యమేలాయి. డాక్టర్‌ రెడ్డీల్‌ ల్యాబ్స్‌ 14 శాతం, లుపిన్‌ 13 శాతం, సిప్లా 9 శాతం చొప్పున ఎగిశాయి. ఈ జోరుతో నిఫ్టీ ఫార్మా సూచీ ఈ వారంలో 15 శాతం లాభపడింది. వారం పరంగా చూస్తే, ఈ సూచీ గత 15 ఏళ్లలో అత్యధికంగా ఈ వారంలోనే పెరిగింది. స్టాక్‌ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకుల్లో ట్రేడ్‌ అయినప్పటికీ పలు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,024ను తాకింది. చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,014 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు  బజాజ్‌ ఫైనాన్స్, యునైటెడ్‌ బ్రూవరీస్, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ వంటి షేర్లు కూడా ఆల్‌టైమ్‌ హైని తాకాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఈ షేర్లన్నీ 50 శాతానికి పైగా ర్యాలీ చేయడం విశేషం.  

ఎనిమిదో రోజూ ఎగువకే.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌..
సుబోక్సోన్‌ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ తుది ఆమోదం లభించడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 3.6 శాతం లాభంతో రూ. 2,351వద్ద ముగిసింది. ఈ షేర్‌ వరుసగా ఎనిమిదో రోజూ ఎగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top