ఒడిదుడుకుల వారం!

 Sensex, Nifty end a rangebound session flat; metal stocks outperform - Sakshi

గురువారం.. క్యూ3 జీడీపీ

గణాంకాలు, జనవరి ద్రవ్యలోటు, ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ డేటా 

శుక్రవారం.. నికాయ్‌ తయారీ రంగ పీఎంఐ, ఆటో రంగ అమ్మకాల గణాంకాలు 

ఈ వారంలోనే ఫిబ్రవరి  ఎఫ్‌ ఎండ్‌ ఓ సిరీస్‌ ముగింపు 

భారత్‌–పాక్‌ మధ్య నెలకొన్న  పరిస్థితులపై ఇన్వెస్టర్ల దృష్టి 

భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందన్న ఎపిక్‌ రీసెర్చ్‌

ముంబై: స్థూల ఆర్థిక సమాచారం, వెంటాడుతున్న భారత్‌–పాక్‌ యుద్ధ భయాలు, వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య వాషింగ్టన్‌లో జరగనున్న చర్చలు ఈ వారం స్టాక్‌ మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. ఈ కీలక అంశాలకు తోడు ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సిరీస్‌ ముగింపు ఈవారంలోనే ఉన్న నేపథ్యంలో భారీ ఒడిదుడుకులకు అవకాశం ఉందని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. ‘ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు ఉన్నందున అంతర్లీన ఒడిదుడుకులు పెరిగి మార్కెట్‌ ఒక్కసారిగా ఏదిశకైనా వెళ్లిపోయే అవకాశం ఉంది. ఈ కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది.’ అని ఎపిక్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు ముస్తఫా నదీమ్‌ అన్నారు. ‘ఫలితాల సీజన్‌ ముగిసినందున.. అంతర్జాతీయ, జాతీయ స్థూల ఆర్థిక అంశాలే ఈ వారంలో మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. మరోవైపు సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగా సమీపకాలంలో అనిశ్చితికి ఆస్కారం ఉందని భావిస్తున్నాం.’ అని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం 12 పీఎస్‌యూ బ్యాంకులకు రూ.48,239 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్న కారణంగా ఈ రంగ షేర్లలో కదలికలు ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. పూర్తి మార్కెట్‌లో మాత్రం స్తబ్దుగానే ఉండనుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 

గురువారం అత్యంత కీలకం.. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసిక(క్యూ3) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలను ప్రభుత్వం ఈనెల 21న (గురువారం) వెల్లడించనుంది. అదేరోజున జనవరి మౌలిక సదుపాయాల నిర్మాణ డేటా, ద్రవ్యలోటు వెల్లడికానుంది. ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు సైతం ఇదేరోజున ఉన్న విషయం తెలిసిందే. ఈ కీలక డేటా నేపథ్యంలో ప్రస్తుత ఒడిదుడుకులు కొనసాగేందుకే అవకాశం ఉందని ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌ డీ కే అగర్వాల్‌ అన్నారు. వీటికి తోడు ముడిచమురు ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి కదలికలు మరింత ఒడిదుడుకుల్ని పెంచే అవకాశం వుందని అన్నారయన. ‘ఇంతకాలం పాటు మార్కెట్‌ సైడ్‌వేస్‌లో ఉండటం చాలా అరుదు. ఫిబ్రవరి ఎఫ్‌ అండ్‌ ఓ ఒడిదుడుకులను మరింత పెంచనుంది. వచ్చే 5 రోజుల్లో ఒక భారీ కదలికకు ఆస్కారం ఉంది. వారం ప్రారంభంలో కాల్‌ ఆప్షన్‌ రైటింగ్‌ దూకుడుగా జరిగితే..మార్కెట్‌ కిందకే వెళుతుందని భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్థూల ఆర్థిక అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.’ అని ఎడెల్వీస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అన్నారు. నిఫ్టీ 50 రోజుల కదలికల సగటు (ఎస్‌ఎంఏ) అయిన 10,823 పాయింట్లను అధిగమిస్తే.. 10,931 పాయింట్ల వరకు నిఫ్టీ వెళ్లనుందని, దిగువస్థాయిలో 10,743 వద్ద మద్దతు ఉందని అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని విశ్లేషించారు. ఆ తరువాత మద్ధతు 10,583 వద్ద ఉందని అన్నారు. 

ఆటో గణాంకాలు... 
ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఆటో రంగ అమ్మకాల గణాంకాలు శుక్రవారం నుంచి వెల్లడికానున్నాయి. ఈనెల తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) సమాచారం శుక్రవారం వెల్లడికానుంది. 

71.60–70.95 శ్రేణిలో రూపాయి 
వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య సయోధ్య కుదురుతుందనే మార్కెట్‌ వర్గాల ఆశాభావం, ముడిచమురు డిమాండ్‌ పెరిగిన కారణంగా ఫిబ్రవరి 22న అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 67.12 డాలర్ల గరిష్టస్థాయిని తాకింది. గతేడాది నవంబర్‌లో నమోదైన 67.73 డాలర్ల గరిష్టస్థాయి తరువాత ముడిచమురు ధర ఈస్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. పెరిగిన ముడిచమురు ధరల ప్రభావంతో డాలరుతో రూపాయి మారకం విలువ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2 శాతం పతనమైంది. ఈవారంలో రూపాయి మారకం విలువ 71.60–70.95 శ్రేణిలో కదలాడవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు అమిత్‌ గుప్తా అన్నారు. భౌగోళిక రాజకీయ అంశాలు ప్రతికూలంగా ఉంటే రూపాయిపై ఒత్తిడి తప్పదన్నారయన.

ఒక్కరోజులో రూ.6,311 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు
ఫిబ్రవరి 1–22 కాలంలో  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,360 కోట్లను భారత మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. అయితే ఒక శుక్రవారం రోజే రూ.6,311 కోట్లు నికర పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఒక్క రోజులో ఇంత అత్యధిక స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top