స్వల్ప లాభాలతో సరి..

Sensex, Nifty end mildly higher; SBI lifts PSU Bank 4% - Sakshi

సెన్సెక్స్‌ 64, నిఫ్టీ 13 పాయింట్లు అప్‌

రోజంతా హెచ్చుతగ్గులకు లోనైనా దేశీ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం చివర్లో స్వల్పలాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 64 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్లు లాభంతో క్లోజయ్యాయి. జీఎస్‌టీ మండలి పలు ఉత్పత్తులపై పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాక.. సెన్సెక్స్‌ ఒక దశలో 33,380 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకినప్పటికీ.. చివర్లో మాత్రం 64 పాయింట్ల స్వల్ప లాభాలతో 33,315 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 10,322 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

వారంవారీగా చూస్తే మాత్రం సెన్సెక్స్‌ 371 పాయింట్లు (1.10 శాతం), నిఫ్టీ 131 పాయింట్లు (1.25 శాతం) మేర నష్టపోయింది. చూయింగ్‌ గమ్స్‌ నుంచి డిటర్జెంట్ల దాకా పలు వినియోగ ఉత్పత్తులపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు జీఎస్‌టీ కౌన్సిల్‌ ప్రకటించడం పలు రంగాల సంస్థలకు కొంత ఊరటనిచ్చింది. ‘జీఎస్‌టీ మండలి నిర్ణయాలు.. కన్జూమర్‌ డ్యూరబుల్స్, ఆటో విడిభాగాలు, ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగ ఉత్పత్తులు మొదలైన రంగాల సంస్థల షేర్లకు దిశానిర్దేశం చేస్తాయి.

అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, ముడిచమురు రేట్లు పెరుగుతుండటం తదితర అంశాలతో ఇన్వెస్టర్లు కొంత రక్షణాత్మకంగా వ్యవహరించే అవకాశం ఉంది‘ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

ఎస్‌బీఐ 6 శాతం అప్‌: క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ 6 శాతం ఎగిసి రూ. 333 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌ షేర్లలో ఇదే అత్యధికంగా పెరిగింది. పలు పెద్ద ఆర్డర్ల రాకతో ఎల్‌అండ్‌టీ 3.9%  పెరిగింది.

హిందుస్తాన్‌ యూనిలీవర్, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్‌ ఆటో, పవర్‌గ్రిడ్‌ మొదలైనవి దాదాపు 3% దాకా లాభపడిన వాటిలో ఉన్నాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్‌ఈ క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ అత్యధికంగా 1.87% పెరిగింది. మరోవైపు, సౌదీ అరేబియాలో పరిణామాలు, ముడిచమురు రేటు పెరుగుతుండటం వంటి అంశాలతో ఇతరత్రా ఆసియా దేశాల మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

సైబర్‌ దాడులతో జాగ్రత్త: బీఎస్‌ఈ
న్యూఢిల్లీ: సైబర్‌ దాడుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో తమ కీలక సమాచారం చోరీకి గురికాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ మార్కెట్‌ వర్గాలకు బోంబే స్టాక్‌ ఎక్సే్చంజీ (బీఎస్‌ఈ) సూచించింది. ‘కంప్యూటింగ్‌ పరికరాలు, ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌లు, టెక్నాలజీ మొదలైనవి రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలన్నీ ఈ నెట్‌వర్క్, ఇన్‌ఫ్రాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

సమాచార వ్యవస్థలపై సైబర్‌ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కీలకమైన కస్టమర్‌ సమాచారం, చెల్లింపులు.. సెటిల్‌మెంట్‌ వ్యవస్థలను నిర్వహించే ఆర్థిక సంస్థలతో పాటు మార్కెట్‌ వర్గాలు, ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని ఒక నోటీసులో పేర్కొంది. వానా క్రై, పెట్యా, లాకీ వంటి మాల్‌వేర్ల బారిన పడకుండా యూజర్లు, సంస్థలు తమ విండోస్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని, యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది. సందేహాస్పద ఈమెయిల్స్‌ తెరవొద్దని, పర్సనల్‌ కంప్యూటర్స్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను తరచూ అప్‌డేట్‌ చేసుకోవాలని బీఎస్‌ఈ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top