మూడో రోజూ నష్టాలే..

Sensex, Nifty end lower on mixed global cues - Sakshi

వాణిజ్య యుద్ధ భయాలు, ఫెడ్‌ పాలసీ, బడ్జెట్‌పై దృష్టి

సెన్సెక్స్‌ 64 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్లు నష్టం

ముంబై: అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం, మరో రెండు రోజుల్లో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం తదితర అంశాల కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలు నమోదు చేశాయి. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 64 పాయింట్లు క్షీణించి 35,592 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు క్షీణించి 10,652 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్ల శ్రేణిలో తిరుగాడింది. గడిచిన మూడు సెషన్స్‌లో సెన్సెక్స్‌ మొత్తం 600 పాయింట్లు నష్టపోయింది.

‘గురువారం జరగబోయే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం, అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు వంటి అంశాల కారణంగా మార్కెట్లు మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయితే, రూపాయి కోలుకోవడం, ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీ నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌తో చివర్లో కొంత కోలుకున్నాయి. కానీ మార్కెట్లు పూర్తిగా రికవర్‌ అయ్యాయని చెప్పలేం. తాత్కాలిక బడ్జెట్, సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో ఒడిదుడుకులు రానున్న రోజుల్లోనూ కొనసాగే అవకాశం ఉంది‘ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. చైనా టెలికం దిగ్గజం హువావేపై అమెరికా.. వ్యాపార రహస్యాల చోరీతో పాటు పలు అభియోగాలు మోపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అయితే, వాణిజ్య యుద్ధ భయాలకు, హువావేపై ఆరోపణలకు సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. 

క్షీణించిన ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ...
కీలకమైన సెన్సెక్స్‌లో యస్‌ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోల్‌ ఇండియా మొదలైనవి అత్యధికంగా 2.43 శాతం దాకా క్షీణించాయి. మరోవైపు లాభపడిన స్టాక్స్‌లో సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్, టీసీఎస్, ఏషియన్‌ పెయింట్స్‌ మొదలైనవి 2.5 శాతంపైగా పెరిగాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top