మార్కెట్‌పై రాజకీయ పంజా!

Sensex Nifty dive on TDPs NDA exit robust IPO market - Sakshi

ఎన్‌డీఏ కూటమి నుంచి జారిపోతున్న మిత్రపక్షాలు

వచ్చే ఎన్నికల్లో మోదీ విజయంపై సంశయాలు

బలహీనంగా ఆసియా మార్కెట్లు

అనిశ్చితిని పెంచిన అమెరికా పరిణామాలు  

ఇండెక్స్‌ షేర్లలో భారీ అమ్మకాలు

కీలకమైన 10,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ

165 పాయింట్ల నష్టంతో 10,195 వద్ద క్లోజ్‌

510 పాయింట్లు పతనమై 33,176కు సెన్సెక్స్‌

రాజకీయ అనిశ్చితి, వాణిజ్య యుద్ధభయాలు, ఇండెక్స్‌ షేర్లలో భారీ అమ్మకాల కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా పతనమైంది. ఆసియా మార్కెట్లు నష్టపోవడం కూడా తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 33,200 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,200 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ) నుంచి వైదొలుగుతున్నామని, మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని  తెలుగుదేశం పార్టీ ప్రకటించడం స్టాక్‌ మార్కెట్లో ప్రకంపనలు పుట్టించింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 510 పాయింట్లు(1.51 శాతం) పతనమై 33,176 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 165 పాయింట్లు (1.59 శాతం)నష్టపోయి 10,195 పాయింట్ల వద్ద ముగిశాయి. గత నెల 6 తర్వాత సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పడిపోవడం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే చివర్లో ఐటీ షేర్లలో కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో ఐటీ ఇండెక్స్‌ నష్టాలు తగ్గాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 566 పాయింట్ల వరకూ నష్టపోయింది.  

నాలుగో రోజూ నష్టాలు..
అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు తలెత్తే అవకాశాలున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టపోవడంతో మన మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌ వరుసగా నాలుగో రోజూ నష్టపోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  33,120, 33,691 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది.

లోహ, ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ, విద్యుత్తు, వాహన, బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 742 పాయింట్లు నష్టపోయింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌131 పాయింట్లు(0.39%), నిఫ్టీ 32 పాయింట్లు(0.30%) నష్టపోయాయి. వారం పరంగా స్టాక్‌ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడో వారం.  

10,000 దిగువకు నిఫ్టీ !  
అమెరికాలో సమస్యలు, వాణిజ్య యుద్ధాల భయాలకు తోడు దేశీయంగా రాజకీయ అనిశ్చితి పరిస్థితులు తలెత్తడంతో మార్కెట్‌ పతనమైందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవడంతో మద్దతు స్థాయిల వద్ద ప్రధాన స్టాక్‌ సూచీలు కన్సాలిడేట్‌ కావడం కష్టమవుతోందని పేర్కొన్నారు. శుక్రవారం 10,195 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ 10,000 పాయింట్ల దిగువకు పడిపోయే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌  ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ అంచనా వేస్తున్నారు.  

తాజా ఏడాది కనిష్టానికి టాటా మోటార్స్‌...
♦  టాటా మోటార్స్‌ షేర్‌ 3.67 శాతం క్షీణించి రూ.340 వద్ద ముగిసింది.  ఇంట్రాడేలో ఈ షేర్‌ తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.339ని తాకింది. ఈ షేర్‌తో పాటు టాటా మోటార్స్‌ డీవీఆర్, ఫోర్స్‌ మోటార్స్, బీఈఎమ్‌ఎల్, ఇక్రా, గ్రేట్‌ ఈస్టర్న్‌ షిప్పింగ్, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు కూడా ఏడాది కనిష్టాన్ని తాకాయి.  
♦   సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లు–మహీంద్రా అండ్‌ మహీంద్రా, విప్రో, యస్‌ బ్యాంక్, హిందుస్తాన్‌ యూనిలివర్‌లు లాభపడ్డాయి.  
♦  నిఫ్టీ షేర్లలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రా, అరబిందో ఫార్మా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, విప్రో, యస్‌బ్యాంక్‌లు ట్రెండ్‌కు ఎదురీదాయి.  నిఫ్టీ, సెన్సెక్స్‌ షేర్లలో అధికంగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
♦  అమెరికా సుంకాలు వృద్ధికి విఘాతం కలిగిస్తాయనే భయాలతో లోహ షేర్లు వెలవెలబోయాయి. సెయిల్, వేదాంత, హిందుస్తాన్‌ కాపర్, తదితర షేర్లు 3–5 శాతం రేంజ్‌లో పడిపోయాయి. 
♦ ఏషియన్‌ పెయింట్స్‌ 3% క్షీణించింది. అదానీ పోర్ట్స్, హీరో మోటో, ఎన్‌టీపీసీ, సన్‌ ఫార్మా, కోటక్‌ బ్యాంక్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ అండ్‌ టీ, డాక్టర్‌ రెడ్డీస్, ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, పవర్‌ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్, ఇన్ఫీ, ఎయిర్‌టెల్, ఎస్‌బీఐషేర్లు 3 శాతం వరకూ నష్టపోయాయి.  
♦ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1% లాభపడింది. సిండికేట్‌ బ్యాంక్‌ 5%, ఓబీసీ, అలహాబాద్‌ బ్యాంక్, పీఎన్‌బీ షేర్లు 3% వరకూ పెరిగాయి.  
♦ ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మూడు కోట్ల షేర్లను కొనుగోలు చేసిందన్న వార్తల కారణంగా జేపీ అసోసియేట్స్‌ 9 శాతం పెరిగింది.  
 బీఎస్‌ఈలో 36 షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకగా, 108 షేర్లు ఏడాది కనిష్ట స్థాయిని తాకాయి.

రూ. 1.86 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్‌ భారీ పతనం తో ఇన్వెస్టర్ల సంపద రూ.1.86 లక్ష ల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,86,415 కోట్లు దిగజారి... రూ.1,43,17,308 కోట్లకు పడిపోయింది.

పతనానికి ప్రధాన కారణాలు
రాజకీయ కారణాలు:  పార్లమెంట్‌లో 16 మంది సభ్యులు గల తెలుగుదేశం పార్టీ(బీజేపీకి మద్దతిస్తున్న రెండో అతి పెద్ద పార్టీ ఇదే) ఎన్‌డీఏ నుంచి తెగదెంపులు చేసుకుంది. అంతే కాకుండా మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు కూడా ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానం నుంచి మోదీ ప్రభుత్వం గట్టెక్కుతుందని.. అయితే 2019 ఎన్నికల్లో మోదీకి విజయం నల్లేరు మీద నడక కాదన్న విశ్లేషణల కారణంగా మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయని  నిపుణులంటున్నారు.  
అమెరికా అనిశ్చితి: చైనా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తోందని, దీనికి ప్రతిగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలు విధించాలని ఇతర దేశాలు భావిస్తున్నాయనే వార్తలు వచ్చాయి. దీంతో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలపై ఆందోళనలు పెరిగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌... జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి మ్యాక్‌మస్టర్‌ను తొలగించాలని నిర్ణయించడం,   అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ వ్యాపారాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని అక్కడి జడ్జి ఒకరు ఆదేశాలు ఇవ్వడం అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.  
ఆసియా మార్కెట్ల పతనం: అమెరికా సుంకాల విధింపు, తాజాగా చైనా వస్తువులపై అమెరికా సుంకాలు విధించనున్నాయన్న వార్తల కారణంగా అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలపై ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా  ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. జపాన్‌ నికాయ్‌ 0.5 శాతం, హాంగ్‌కాంగ్‌ హాంసెంగ్‌ 0.1 శాతం, షాంగై కాంపొజిట్‌ 0.6 శాతం చొప్పున నష్టపోయాయి.
ఇండెక్స్‌ షేర్లలో అమ్మకాలు: సూచీల్లో అధిక వెయిటేజ్‌ ఉన్న షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. వీటితో పాటు టాటా మోటార్స్, టాటా స్టీల్, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, టీసీఎస్, హీరో మోటో తదితర ఇండెక్స్‌ షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి.  
సాంకేతిక కారణాలు: నిఫ్టీ వంద రోజుల ఎక్స్‌పోనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌(డీఈఎమ్‌ఏ) 10,410 దిగువకు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపించిందనేది విశ్లేషకుల మాట.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top