మార్కెట్‌ అక్కడక్కడే!

Sensex, Nifty close flat  IT stocks top gainers - Sakshi

బ్యాంక్‌ షేర్లకు నష్టాలు...

టీసీఎస్‌ జోష్‌తో ఐటీ షేర్ల పరుగులు

12 పాయింట్ల పతనంతో 34,416కు సెన్సెక్స్‌

1 పాయింటు నష్టంతో 10,564కు నిఫ్టీ  

బ్యాంక్‌ షేర్లు భారీగా పతనమైనప్పటికీ, టీసీఎస్‌ ఫలితాల జోరుతో ఐటీ షేర్లు ర్యాలీ జరపడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ అక్కడక్కడే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 12 పాయింట్ల నష్టంతో 34,416 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1 పాయింట్‌ నష్టపోయి 10,564 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, వరుసగా నాలుగో వారమూ మార్కెట్‌ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్‌ 223 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.

ఇటీవల జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశ వివరాలను గురువారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్‌బీఐ వెల్లడించింది. వడ్డీరేట్లను పెంచే అవకాశాలున్నాయంటూ ఈ సమావేశ వివరాలు  సంకేతాలివ్వడం బ్యాంక్‌ షేర్లను కుదేలు చేయడమే కాకుండా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

అంతే కాకుండా కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఇటీవల పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ, ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధరలు పడిపోవడంతో లోహ, మైనింగ్‌ షేర్లు పతనం కావడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయి.

176 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌
సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, బ్యాంక్‌ షేర్ల పతనంతో నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్‌ 34,311, 34,487 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. ఒక దశలో 60 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ మరో దశలో 116 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 176 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. అయితే టీసీఎస్‌ జోష్‌కు డాలర్‌తో రూపాయి మారకం 13 నెలల కనిష్టానికి పడిపోవడం కూడా తోడవడంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. దీంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు గణనీయంగా తగ్గి, సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.

బ్యాంక్‌ షేర్లు బేర్‌...
భారత బ్యాంక్‌లు గత ఆర్థిక సంవత్సరానికి బలహీనమైన ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్నాయని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ స్డాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ వెల్లడించడంతో బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. వడ్డీరేట్లు పెరిగే అవకాశాలున్నాయన్న ఆర్‌బీఐ ఎమ్‌పీసీ మినిట్స్‌ వెల్లడించడంతో నష్టాలు మరింతగా పెరిగాయి.

కెనరా బ్యాంక్‌ 7 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 6 శాతం,  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.4 శాతం, ఎస్‌బీఐ 1.9 శాతం చొప్పున నష్టపోయాయి. ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ 6.7 శాతం లాభంతో రూ.3,406 వద్ద ముగిసింది. ఇది ఆల్‌టైమ్‌ హై క్లోజింగ్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top