ఆర్‌బీఐ నిర్ణయాలపై ఆశలు

Sensex, Nifty Clock Their Longest Winning Streak In Over A Month - Sakshi

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల ర్యాలీ

అంతర్జాతీయ సంకేతాల సానుకూలత

81 పాయింట్ల లాభంతో 10,763కు చేరిన నిఫ్టీ

317 పాయింట్లు పెరిగి 35,775కు సెన్సెక్స్‌  

కీలకమైన ఆర్‌బీఐ నిర్ణయాలకు ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఆసియా, యూరోప్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం ఒకటయితే... ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో సోమవారం నాటి భేటీలో ఆర్‌బీఐ నుంచి సానుకూల నిర్ణయాలు రావచ్చన్న అంచనాలతో దేశ, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 35,818 స్థాయి వరకు వెళ్లి చివరికి 318 పాయింట్ల లాభంతో 35,774.88 వద్ద ముగిసింది.

అక్టోబర్‌ 3 తర్వాత సెన్సెక్స్‌ గరిష్ట స్థాయిలో క్లోజ్‌ అయింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 81 పాయింట్లు ర్యాలీ చేసి 10,763 వద్ద క్లోజ్‌ అయింది. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాలు, ఆర్‌బీఐ వద్దనున్న మిగులు నిల్వలపై... అటు ప్రభుత్వం, ఇటు ఆర్‌బీఐ ఎవరికి వారు తమ వాదనకే కట్టుబడి ఉండటంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి తెరపడుతుందన్న అంచనాలు లాభాలకు తోడ్పడ్డాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ కొరత, ప్రభుత్వరంగ బ్యాంకులకు సంబంధించి నిబంధనల సరళీకరణపై దేశీయ స్టాక్‌ మార్కెట్లు దృష్టి సారిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

యస్‌ బ్యాంకు జోరు
గత వరుస రెండు సెషన్లల్లో 15 శాతానికి పైగా నష్టపోయిన యస్‌ బ్యాంకు అత్యధికంగా 7 శాతానికి పైగా లాభపడింది. ఐటీసీ, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, వేదాంత, సన్‌ఫార్మా, ఆర్‌ఐఎల్, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌ తదితర స్టాక్స్‌ లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంకు, బజాజ్‌ ఆటో స్టాక్స్‌ అమ్మకాలతో నష్టపోయాయి.

టాటాసన్స్‌ కొనుగోలు వార్తలతో కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన జెట్‌ఎయిర్‌వేస్, ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో 7 శాతం నష్టపోయింది. రియల్టీ ఇండెక్స్‌ గరిష్టంగా 1.45 శాతం మేర లాభపడింది. ఆ తర్వాత ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆటో రంగాల సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.67 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.47 శాతం మేర పెరిగాయి. గత శుక్రవారం మన ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు నికరంగా రూ.844 కోట్ల మేర కొనుగోళ్లు చేసినట్టు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

ఆర్‌బీఐ సంకేతాల కోసం...
‘‘అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలపై ఆశలు తగ్గినా గానీ దేశీయ మార్కెట్లు లాభపడ్డాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆర్‌బీఐ బోర్డు భేటీపై దృష్టి సారించాయి. లిక్విడిటీ, పీఎస్‌యూ బ్యాంకుల నిబంధనల సరళతరంపై సంకేతాల కోసం చూస్తున్నాయి.

డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఐదు ట్రేడింగ్‌ సెషన్ల నుంచీ రికవరీ బాటన ఉండడం, చమురు ధరల్లో తగ్గుదల అన్నవి మన స్థూల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాయి. దాంతో ఇవి వర్ధమాన మార్కెట్ల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ విధానాన్ని మార్చుకునేందుకు దారితీస్తాయి’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు.   

పైకే అవకాశం..
గత కొన్ని వారాలుగా 10,750–10,850 శ్రేణిపై దృష్టి నెలకొంది. 200 రోజుల ఎస్‌ఎంఏ, 89 రోజుల ఈఎంఏ ఇక్కడే ఉన్నాయి. అక్టోబర్‌ 4న ఇక్కడ గ్యాప్‌ ఏర్పడింది. కీలకమైన 10,800–10,850 శ్రేణిని బ్రేక్‌చేసి పైకి వెళ్లేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇండెక్స్‌ తదుపరి సెషన్‌లో ఎలా చలిస్తుందో చూడాల్సి ఉంది. దిగువ వైపు 10,700, 10,650 కీలక మద్దతు స్థాయిలు. – సమీత్‌చావన్‌ ఏంజెల్‌ బ్రోకింగ్‌ టెక్నికల్‌ చీఫ్‌ అనలిస్ట్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top