బ్యాంక్‌ షేర్ల జోరు

Sensex, Nifty bounce back from 7-month lows - Sakshi

ఆర్‌బీఐ నుంచి రూ.40,000 కోట్ల నిధులు

పీసీఏ నిబంధనల్లో మార్పులు

తగ్గిన బాండ్ల రాబడులు

దీంతో బ్యాంక్‌ షేర్ల పరుగులు

అంచనాలను మించిన తాజా క్యూ2 ఫలితాలు

నిలకడగా రూపాయి 

దిగి వచ్చిన చమురు ధరలు

మళ్లీ 34,000 పాయింట్ల పైకి సెన్సెక్స్‌

718 పాయింట్ల లాభంతో 34,067 వద్ద ముగింపు

కీలకమైన 10,250 పైకి నిఫ్టీ 

221 పాయింట్ల లాభం

బ్యాంక్‌ షేర్ల దన్నుతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం దుమ్మురేపింది. రెండు వరుస ట్రేడింగ్‌ సెషన్ల నష్టాలకు బ్రేక్‌పడింది. ముడి చమురు ధరలు దిగిరావడం, ఆర్‌బీఐ రూ.40,000 కోట్ల మేర నిధులందించనుండడంతో అన్ని రంగాల షేర్లు మంచి లాభాలు సాధించాయి. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించిందన్న గణాంకాల కారణంగా ఆసియా మార్కెట్లు నష్టపోయినా, మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 34,000 పాయింట్లపైకి, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,250 పాయింట్ల పైకి ఎగబాకాయి.

గత వారంలో మూడు శాతం వరకూ నష్టపోయిన స్టాక్‌ సూచీలు ఒక్క సోమవారం రోజే 2 శాతానికి పైగా పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, వంటి కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లు– ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ జోరుగా పెరగడం సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్‌ 718 పాయింట్లు(2.15 శాతం) పెరిగి 34,067  పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 221పాయింట్లు (2.2 శాతం)లాభపడి 10,251 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్, వాహన, ఐటీ, లోహ, ఫార్మా, ఇన్‌ఫ్రా, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.  

లాభాలే...లాభాలు.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా, సెన్సెక్స్‌ భారీ లాభాలతో ఆరంభమైంది. బ్యాంకింగ్‌  రంగానికి చెందిన రెండు కీలకమైన నిర్ణయాల నేపథ్యంలో సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 33,550 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  ఆ తర్వాత ఈ లాభాలను కోల్పోయినప్పటికీ, మళ్లీ పుంజుకుంది. ట్రేడింగ్‌ గడిచేకొద్దీ లాభాలు అంతకంతకూ పెరిగాయి. ఒక దశలో 806 పాయింట్ల లాభంతో 34,155 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

మార్కెట్‌ అధిక అమ్మకాల స్థాయిలో (ఓవర్‌ సోల్డ్‌) ఉండటంతో మార్కెట్‌లో రిలీఫ్‌ ర్యాలీ చోటు చేసుకుందని షేర్‌ఖాన్‌ ఎనలిస్ట్‌ రోహిత్‌ శ్రీవాత్సవ చెప్పారు. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడం శుభసూచకమని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకూ బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మంచి ర్యాలీ జరిపాయని పేర్కొన్నారు. బ్యాంక్‌ నిఫ్టీ చార్ట్‌... డబుల్‌ బాటమ్‌ను ఏర్పర్చిందని, సమీప కాలంలో ఈ ర్యాలీ కొనసాగుతుందని ఇది సూచిస్తోందని వివరించారు.  
మరిన్ని విశేషాలు....
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలు సాధించినా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2.2 శాతం వరకూ నష్టపోయాయి.  
    మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో ఏడు షేర్లు– ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్తాన్‌ యూనిలివర్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీలు  మాత్రమే నష్టపోగా, మిగిలిన 24 షేర్లు లాభపడ్డాయి.
    మొత్తం 50 నిఫ్టీ షేర్లలో 9 మాత్రమే నష్టపోగా, 42 షేర్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌లో నష్టపోయిన ఏడు షేర్లతో పాటు భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్‌ మోటార్స్‌ కూడా నష్టపోయాయి.
    నికర లాభం 77 శాతం పెరగడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 5 శాతం లాభంతో రూ.2,532కు పెరిగింది.  
 విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల సవరణకు సుప్రీం కోర్ట్‌ సానుకూలంగా స్పందించడంతో విద్యుత్తు రంగ షేర్లు వెలుగులు విరజిమ్మాయి. అదానీ పవర్, టాటా పవర్‌ షేర్లు ఇంట్రాడేలో 21–25 శాతం వరకూ ఎగిశాయి. అదనంగా ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం కూడా కలసిరావడంతో టాటా పవర్‌ షేర్‌ 12 శాతం లాభంతో ముగిసింది.  
 నికర లాభం 92 శాతం పెరగడంతో దివీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 15 శాతం పెరిగి రూ. 1,444 వద్ద ముగిసింది.
పేపర్‌ కంపెనీల షేర్లు రెపరెపలాడాయి. కాగితం తయారీ కంపెనీలు– శేష సాయి పేపర్‌ అండ్‌ బోర్డ్స్, ఇంటర్నేషనల్‌ ఏపీపీఎమ్‌ కంపెనీలు క్యూ2 ఫలితాలు బావున్నాయి. దీంతో ఈ షేర్లతో పాటు ఇతర పేపర్‌ కంపెనీల షేర్లు–బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్, జేకే పేపర్, వెస్ట్‌ కోస్ట్‌ పేపర్, స్టార్‌ పేపర్‌ మిల్స్, తదితర షేర్లు 5–15 శాతం రేంజ్‌లో పెరిగాయి.  
 200కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. ర్యాడికో ఖైతాన్, ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, విఐపీ ఇండస్ట్రీస్, మన్‌పసంద్‌ బేవరేజేస్, రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ దతితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు అప్‌
సెన్సెక్స్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.3,11,666 కోట్లు పెరిగి రూ.1,36,43,643 కోట్లకు ఎగసింది.

లాభాలు ఎందుకంటే
 ఆర్‌బీఐ నుంచి రూ.40,000 కోట్ల నిధులు:  ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీల డిఫాల్ట్‌ల కారణంగా లిక్విడిటీ సమస్యలతో అతలాకుతలమవుతున్న ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంక్‌లను ఆదుకోవడానికి ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. వచ్చే నెలలో ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల్లో ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్ల ద్వారా వ్యవస్థలోకి రూ.40,000 కోట్ల అందుబాటులోకి తేవాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.  

పీసీఏ నిబంధనల్లో మార్పులు:
మొండి బకాయిల సమస్య నేపథ్యంలో ఆర్‌బీఐ రూపొందించిన త్వరిత గతి దిద్దుబాటు చర్యలు (ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌–పీసీఏ) నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తోందన్న వార్తలు వచ్చాయి. ఈ నిబంధనల్లో మార్పుల వల్ల ప్రయోజనం బాగా ఉంటుందనే అంచనాలతో ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు ఎగబాకాయి.  

ఐబీసీ ప్రయోజనాలు:
కొత్త ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,80,000 కోట్ల మొండి బకాయిలు రికవరీ కాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  

తగ్గిన బాండ్ల రాబడులు:
పదేళ్ల బాండ్ల రాబడులు నెల కనిష్టానికి పడిపోయాయి. సోమవారం ఈ రాబడులు 0.8 శాతం తగ్గి 7.81 శాతానికి దిగివచ్చాయి. బ్యాంక్‌లకు భారీగా బాకీపడిన ఎస్సార్‌స్టీల్‌ దివాలా ప్రక్రియ పూర్తికావడం బ్యాంక్‌ షేర్లను పరుగులు పెట్టించింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 8% ఎగసింది. ఈ సూచీలోని 12 షేర్లూ లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా ఓబీసీ 13%, కెనరా బ్యాంక్‌ 12 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 11% పెరిగాయి.

క్యూ2 ఫలితాల మెరుపులు:
ఇప్పటివరకూ వెలువడిన పలు కంపెనీల క్యూ2 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గత శుక్రవారం వెలువడిన ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు సోమవారం వెలువడిన టాటా పవర్‌ తదితర కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి.  

దిగి వచ్చిన చమురు ధరలు:
ఇటీవల వరకూ నాలుగేళ్ల గరిష్ట స్థాయికు చేరిన ముడి చమురు ధరలు దిగివచ్చాయి. సోమవారం బ్రెంట్, నైమెక్స్‌ క్రూడ్‌ ధరలు 0.6% వరకూ పడిపోయాయి.  డాలర్‌ బలపడుతుండటం, అంతర్జాతీయ ఆర్థిక వృద్ది మందగమనంగా ఉంటుందనే ఆందోళనల కారణంగా ఈ నెలలో ఇప్పటివరకూ చమురు ధరలు 12 శాతం వరకూ తగ్గాయి.

నిలకడగా రూపాయి:
పతన బాటలో ఉన్న రూపాయి సోమవారం ఇంట్రాడేలో 18 పైసలు వరకూ లాభపడటం.. స్టాక్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం చివరకు 2 పైసల లాభంతో 73.44 వద్ద ముగిసింది.  

హెవీ వెయిట్స్‌ ర్యాలీ:
ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌ 12–4 శాతం రేంజ్‌లో పెరిగాయి. మొత్తం సెన్సెక్స్‌ 718 పాయింట్ల లాభంతో ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌ వాటాయే 219 పాయింట్లుగా ఉంది. ఇక రిలయన్స్‌ వాటా 140 పాయింట్లు, ఎల్‌ అండ్‌ టీ వాటా 77 పాయింట్లు, టీసీఎస్‌ వాటా 75 పాయింట్లుగా ఉన్నాయి.  

లాభాల్లో ఆరంభమైన యూరప్‌ మార్కెట్లు: ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిసినా, యూరప్‌ లాభాల్లో ఆరంభం కావడం మన మార్కెట్‌ లాభాలను మరింత పెంచింది. ఇటలీ సావరిన్‌ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ యథాతథంగా ఉంచడం యూరప్‌ మార్కెట్లకు ‘కిక్‌’ నిచ్చింది.

ఐసీఐసీఐ రయ్‌...
ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో ఈ షేర్‌ జోరుగా పెరిగింది. 11 శాతం లాభంతో రూ.349 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా పెరిగిన షేర్‌ ఇదే. సెన్సెక్స్‌ మొత్తం 718 పాయింట్ల లాభంతో ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ వాటాయే 219 పాయింట్ల వరకూ (నాలుగో వంతుకు పైగా) ఉండటం విశేషం.

బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.21,968 కోట్లు పెరిగి రూ.2,24,706 కోట్లకు పెరిగింది. ఈ క్యూ1లో రూ.120 కోట్ల నష్టాలు పొందిన ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఈ క్యూ2లో రూ. 1,205 కోట్ల నికర లాభం రావడం, సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణ నాణ్యత మెరుగుపడటంతో ఈ కౌంటర్లో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top