నెల గరిష్టానికి సెన్సెక్స్‌

Sensex to the maximum of month - Sakshi

సానుకూలముగా అంతర్జాతీయ సంకేతాలు

162 పాయింట్ల లాభంతో 33,788కు సెన్సెక్స్‌

48 పాయింట్లు పెరిగి 10,379కు నిఫ్టీ  

కంపెనీల నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా జరిగాయి. దీనికి సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. బ్యాంక్, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్‌ 162 పాయింట్ల లాభంతో 33,788 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో 10,379 పాయింట్ల వద్ద ముగిశాయి.స్టాక్‌ సూచీలు వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో లాభపడ్డాయి.

నెల గరిష్టానికి చేరాయి. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 770 పాయింట్లు లాభపడింది. అమెరికా వడ్డీ రేట్లు భారీగా పెరుగుతాయనే ఆందోళనలు తగ్గుముఖం పట్టడం, చైనా–అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశావహ అంచనాలతో ఆసియా మార్కెట్లు లాభపడగా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచింది. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల జోరుతో 220 పాయింట్ల లాభంతో 33,847 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది.

అమెరికాలో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాల కంటే తక్కువగా పెరగడంతో వడ్డీరేట్లు పెరుగుతాయనే ఆందోళనలు తొలగిపోయాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. దీంతో ఆసియా, యూరప్‌ మార్కెట్లు లాభపడటంతో మన మార్కెట్‌ కూడా లాభపడిందని వివరించారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండడం, అమెరికాలో ఉత్పత్తి పెరగడంతో ముడి చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉంటాయన్న అంచనాలు, వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు... భవిష్యత్తులో మార్కెట్‌కు తోడ్పాటునందిస్తాయని పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి కంపెనీల క్యూ4 ఫలితాలపై ఉందని, ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ గణాంకాలు స్టాక్‌ మార్కెట్‌ను నడిపిస్తాయని వివరించారు.

యాక్సిస్‌ బ్యాంక్‌ 3.4 శాతం అప్‌
యాక్సిస్‌ బ్యాంక్‌ 3.4 శాతం లాభంతో రూ. 518 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. మహీంద్రా 2.1 శాతం, ఐటీసీ 2 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.9 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే, ఇన్ఫోసిస్‌ 1.6 శాతం, టాటా మోటార్స్‌1.5 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 1.2 శాతం, టీసీఎస్‌ 0.9 శాతం చొప్పున నష్టపోయాయి.

సర్క్యూట్‌ పరిమితుల సవరణ..
బీఎస్‌ఈ తాజాగా ఐదు కంపెనీల సర్క్యూట్‌ పరిమితులను సవరించింది. రెస్పాన్సివ్‌ ఇండస్ట్రీస్‌కు 10 శాతం, సుమీత్‌ ఇండస్ట్రీస్‌కు 5 శాతం, ఎస్కార్ట్స్‌ ఫైనాన్స్, అలయన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ మెటాలిక్స్, ఎస్‌సీ ఆగ్రోటెక్‌ కంపెనీలకు 2 శాతం చొప్పున సర్క్యూట్‌ ఫిల్టర్లను విధించామని బీఎస్‌ఈ వెల్లడించింది. ఈ మార్పులు నేటి(మంగళవారం) నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది. షేర్లలో తీవ్రమైన హెచ్చుతగ్గులను   నివారించడానికి బీఎస్‌ఈ ఇలా సర్క్యూట్‌ పరిమితులను విధిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top