అమెరికా – చైనా చర్చలపై ఆశాభావం!

Sensex makes a U-turn, rises 178 pts on trade deal hopes - Sakshi

రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ 

రూపాయి పతనమైనా లాభపడ్డ సూచీలు  

సానుకూల అంతర్జాతీయ సంకేతాలే కారణం  

176 పాయింట్లు పెరిగి 38,862కు సెన్సెక్స్‌ 

68 పాయింట్ల లాభంతో 11,666కు నిఫ్టీ

అమెరికా–చైనాల మధ్య చర్చలపై ఆశాభావంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీంతో మన మార్కెట్‌ కూడా శుక్రవారం లాభాల్లో ముగిసింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. లోహ, ఆర్థిక, ఐటీ షేర్ల జోరుతో ప్రధాన స్టాక్‌సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 178 పాయింట్ల లాభంతో 38,862 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్లు ఎగసి 11,666 పాయింట్ల వద్ద ముగిశాయి.    ఐటీ, బ్యాంక్, ఇతర ఆర్థిక రంగ షేర్లు లాభపడగా, వాహన, విద్యుత్తు రంగ షేర్లు పతనమయ్యాయి. వారం పరంగా చూస్తే స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లోనే ముగిసింది. సెన్సెక్స్‌ 182 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. 
సానుకూలంగా ప్రపంచ మార్కెట్లు..: వాణిజ్య ఒప్పందం నిమిత్తం చైనాతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని, మరో నెల రోజుల్లో చెప్పుకోదగిన ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. దీంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం 7 పైసలు క్షీణించి 69.24 వద్ద ముగిసింది. ముడి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. చివరి అరగంట వరకూ పరిమిత శ్రేణిలోనే కదలాడింది. ట్రేడింగ్‌చివర్లో కొనుగోళ్ల జోరుగా సాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 274 పాయింట్ల వరకూ, నిఫ్టీ 92 పాయింట్ల వరకూ పెరిగాయి. ఇక వచ్చే వారం నుంచి వెలువడే కంపెనీల నాలుగో క్వార్టర్‌ ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని నిపుణులంటున్నారు. 

మార్కెట్‌ కబుర్లు కొన్ని..
►టాటా స్టీల్‌ 3.3 శాతం లాభంతో రూ.548 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌  ఇదే.  
►గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌ షేర్‌ 7 శాతం లాభంతో రూ.978 వద్ద ముగిసింది. వండర్‌ స్పేస్‌ ప్రొపర్టీస్‌లో వాటా పెంచుకోవడం, నవీ ముంబైలో కొత్త రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టడం సానుకూల ప్రభావం చూపడంతో ఈ షేర్‌ లాభపడింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.988 ని తాకింది. ఈ షేర్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, పిడిలైట్‌ ఇండస్ట్రీస్, ఎస్‌కేఎఫ్‌ ఇండియా, ఎస్‌ఆర్‌ఎఫ్‌లు కూడా ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌హైలను తాకాయి.  
​​​​​​​►బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌ హైలను తాకాయి. ఈ కంపెనీల నిర్వహణ ఆస్తులు పెరుగుతాయనే అంచనాలతో ఈ షేర్లు బాగా పెరుగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ రూ.3,120 వద్ద, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్‌ రూ.7,469 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. చివరకు బజాజ్‌ ఫైనాన్స్‌  2 శాతం లాభంతో రూ.3,109 వద్ద, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.2 శాతం లాభంతో రూ.7,416 వద్ద ముగిశాయి. గత మూడు నెలల కాలంలో బజాజ్‌ ఫైనాన్స్‌ 22 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 16 శాతం చొప్పున లాభపడ్డాయి.  
​​​​​​​►ఒక్కో షేర్‌ను రూ.175 ధరకు కొనుగోలు చేయాలని, షేర్ల బైబ్యాక్‌ కోసం రూ.148 కోట్లు కేటాయించాలని డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించడంతో బలరామ్‌పూర్‌ చినీ 5.5 శాతం లాభంతో రూ.145  వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ ఏడాది గరిష్ట స్థాయి, రూ.146ను తాకింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top