ఐదో రోజూ నష్టాల బాటే

Sensex on longest losing streak in three months - Sakshi

కొనసాగిన రూపాయి,స్టాక్‌ మార్కెట్‌ క్షీణత

భగ్గుమంటున్న ముడి చమురు ధరలు

ఆర్థిక అంశాలపై ఆందోళన

155 పాయింట్ల నష్టంతో 38,158కు సెన్సెక్స్‌

62 పాయింట్లు పతనమై 11,520కు నిఫ్టీ

రూపాయి పతనానికి ముడి చమురు ధరలు పెరగడం కూడా తోడవడంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. వాణిజ్య ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుండటంతో సెన్సెక్స్‌ వరుసగా ఐదో రోజూ నష్టపోయింది. ఈ సూచీ వరుసగా ఇన్నేసి రోజులు క్షీణించడం మూడు నెలల కాలంలో ఇదే మొదటిసారి.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్లు నష్టపోయి 38,158 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో 11,520 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 739 పాయింట్లు నష్టపోయింది. కన్సూమర్‌ డ్యూరబుల్స్,ఆర్థిక, బ్యాంక్‌ షేర్లు పతనమయ్యాయి.

ఆర్థిక అంశాలపై ఆందోళన.. ?  
డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో జీవిత కాల కనిష్ట స్థాయి, 71.57కు పడిపోయింది. మరోవైపు బ్యారెల్‌ బ్రెంట్‌ ఆయిల్‌  79 డాలర్లను తాకింది. రూపాయి పతనం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందని, కరంట్‌ అకౌంట్‌ లోటు మరింతగా విస్తరిస్తుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

విదేశీ నిధులు తరలిపోతుండటం, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించాయి. సెబీ కొత్త కేవైసీ నిబంధనల్లో సవరణలు జరపకపోతే, 7,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు స్వల్ప వ్యవధిలోనే వెలుపలికి వెళ్లే అవకాశాలున్నాయన్న భయాల కారణంగా అమ్మకాలు జోరుగా సాగాయి. 
 
420 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌
సెన్సెక్స్‌ ఆరంభంలో కొనుగోళ్ల జోరుతో 206  పాయింట్ల వరకూ లాభపడింది. తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారిపోయింది. సెన్సెక్స్‌ ఒక దశలో 206 పాయింట్లు లాభపడగా, మరో దశలో 214 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 420 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 20 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 86 పాయింట్ల పతనమైంది.
8 లక్షల కోట్లకు టీసీఎస్‌: టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 8 లక్షల కోట్లను దాటేసింది.  ఈ ఘనత సాధంచిన రెండో భారత కంపెనీ ఇది. ఇటీవలనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ తొలిసారిగా ఈ మైలురాయిని దాటింది.

మార్కెట్లకు భారీ దాడుల ప్రమాదం
ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో విక్రం లిమాయే
ఫైనాన్షియల్‌ మార్కెట్ల తాలూకు ఆస్తులపై చాలా తక్కువ ఖర్చుతోనే భారీ స్థాయిలో సైబర్‌ దాడులు జరిపే ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా పొంచి ఉందని ఎన్‌ఎస్‌ఈ ఆందోళన వ్యక్తం చేసింది. మేథో సాధికారత, ఆవిష్కరణలపై పెట్టుబడుల ద్వారా తగిన ప్రమాణాలను నెలకొల్పాలని ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో విక్రం లిమాయే అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ అనుసంధానత పెరుగుతుండడం, వ్యవస్థల సంక్లిష్టతతో భారీ స్థాయి సైబర్‌ దాడుల రిస్క్‌ ఉందని మంగళవారం ముంబైలో జరిగిన ఎన్‌ఎస్‌ఈ ఫ్యూచర్‌ టెక్‌ 2018 కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. క్యాపిటల్‌ మార్కెట్‌ విభాగంలో అగ్రగాములుగా ఉన్నందున ప్రమాణాలను నెలకొల్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top