మళ్లీ 10,450 పైకి నిఫ్టీ

Sensex Jumps Over 400 Points, Nifty Hits 10350 - Sakshi

ముడి చమురు ధరలు చల్లబడటం, రూపాయి రికవరీ కావడం వంటి సానుకూలాంశాల కారణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. గురువారం అమ్మకాల వెల్లువతో కకావికలమైన స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కొనుగోళ్ల జోరుతో కళకళలాడింది. వరుస రెండు రోజుల పతనం అనంతరం అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం కూడా కలసివచ్చింది. ఇటీవల పతనం కారణంగా నష్టపోయి ఆకర్షణీయంగా మారిన పలు షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి.

ఐటీ, టెక్నాలజీ షేర్లు మినహా, వాహన, రియల్టీ, లోహ, ఆయిల్, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సీజీ, బ్యాంక్, విద్యుత్తు, ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 732 పాయింట్లు (2.15 శాతం) లాభపడి 34,734 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 237 పాయింట్లు (2.32 శాతం) పెరిగి 10,492 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు పెరగటం దాదాపు 30 నెలల విరామం తర్వాత ఇదే మొదటిసారి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. గత ఆరు వారాల్లో స్టాక్‌ సూచీలు ఈ వారంలోనే లాభపడ్డాయి. ఈ వారంలో నికరంగా సెన్సెక్స్‌ 367 పాయింట్లు, నిఫ్టీ 156 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  

రూపాయి రికవరీ...
ఇటీవల కాలంలో రోజూ జీవిత కాల కనిష్ట స్థాయిలకు పడిపోతున్న రూపాయి సైతం శుక్రవారం రికవరీ అయింది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 53 పైసలు బలపడి 73.58 ను తాకడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. మరోవైపు ఇటీవలే నాలుగేళ్ల గరిష్టానికి చేరిన ముడి చమురు ధరలు 2 శాతం తగ్గాయి. ప్రస్తుత, వచ్చే సంవత్సరాల్లో ముడి చమురు డిమాండ్‌ అంచనాలను అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ–ఐఈఏ) సవరించింది. దేశాల మధ్య సుంకాల పోరు, అంతర్జాతీయ వృద్ధి అంచనాలు బలహీనంగా ఉండటం వల్ల డిమాండ్‌ అంచనాలను ఐఈఏ తగ్గించింది.

ముడి చమురు ధరలు దిగిరావడం... మన మార్కెట్‌కు కోరిన కొండ మీద వాన కురిసినట్లయింది. మరోవైపు ఆగస్టు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్న నేపథ్యంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడం కలసివచ్చింది. గత కొన్ని సెషన్లుగా షార్ట్‌ పొజిషన్లు తీసుకుంటూ వచ్చిన బేర్‌ ఆపరేటర్లు షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చేయక తప్పలేదని కొందరు బ్రోకర్లు చెప్పారు. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్‌ మార్కెట్లు కూడా లాభాల్లో ఆరంభం కావడం సానుకూల ప్రభావం చూపించింది.  

ఇంట్రాడేలో 807 పాయింట్లు లాభం...
ఆసియా మార్కెట్ల జోష్‌తో సెన్సెక్స్‌ 291 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో 807 పాయింట్ల లాభంతో 34,808 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 258 పాయింట్లు లాభపడింది. ఇంట్రాడే లాభపరంగా (శాతంలో) చూస్తే, స్టాక్‌ సూచీలకు  రెండేళ్ల కాలంలో ఇదే అత్యధికం. ఐటీ దిగ్గజం, టీసీఎస్‌ మంచి ఫలితాలతో క్యూ2 సీజన్‌ను బోణీ చేసిందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వ్యాఖ్యానించారు.

ముడి చమురు ధరలు దిగిరావడం, గిల్ట్‌ బాండ్‌ రాబడులు తగ్గడం, రూపాయి రివకరీ కావడం సానుకూల ప్రభావం చూపించాయని వివరించారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు జరుపుతున్నా దానికి తగ్గట్లుగా దేశీ ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరుపుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్‌ ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌లో ఉన్నా కూడా దేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని వివరించారు.  

మరిన్ని విశేషాలు...
మారుతీ 5.8% లాభంతో రూ.7,283 వద్ద ముగి సింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
 ఈ క్యూ2లో రికార్డ్‌ స్థాయి లాభం సాధించినప్పటికీ, టీసీఎస్‌ షేర్‌ 3.1 శాతం నష్టపోయి రూ.1,918 వద్ద ముగిసింది. మార్జిన్లు తగిన స్థాయిలో లేవన్న ఆందోళన కారణంగా ఈ షేర్‌ పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీ షేర్లలో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే. గత మూడు రోజుల్లో ఈ షేర్‌ మొత్తం 8 శాతం నష్టపోయింది. ఈ మూడు రోజుల్లో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.64,579 కోట్లు హరించుకుపోయి రూ.7,19,857 కోట్లకు పడిపోయింది.
 సెన్సెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లు మంచి లాభాలు సాధించడం సెన్సెక్స్‌ భారీ లాభాలకు ఒక కారణం. ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వల్లే సెన్సెక్స్‌ 120 పాయింట్లు లాభపడగలిగింది. మొత్తం 732 పాయింట్ల సెన్సెక్స్‌ లాభాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటా 88 పాయింట్లు, ఐటీసీ వాటా 81 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ వాటా 75 పాయింట్లు, కోటక్‌ బ్యాంక్‌ 64 పాయింట్లు, మారుతీ సుజుకీ 54 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 46 పాయింట్లుగా ఉన్నాయి.  
  31 సెన్సెక్స్‌ షేర్లలో రెండు షేర్లు–టీసీఎస్, టాటా మోటార్స్‌ డీవీఆర్‌ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 29 షేర్లు లాభాల్లో ముగిశాయి.  
  నిఫ్టీ షేర్లలో 4... టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, టెక్‌ మహీంద్రాలు మాత్రమే తగ్గాయి. మిగిలిన 46 షేర్లు పెరిగాయి.  
  ముడి చమురు ధరలు చల్లబడటంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, విమాన యాన కంపెనీల షేర్ల లాభాలు కొనసాగాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీలు 5 శాతం వరకూ లాభపడగా, ఇంటర్‌గ్లోబ్, జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్‌ షేర్లు 6 % వరకూ పెరిగాయి.
  యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ ఎంపిక కోసం సలహాదారుగా అంతర్జాతీయ సంస్థ కార్న్‌ ఫెరీని నియమించడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ 2.7 శాతం లాభంతో రూ.247 వద్ద ముగిసింది.

రూ.2.98 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
సెన్సెక్స్‌ 732 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద రూ.2.98 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,98,411 కోట్లు పెరిగి రూ.1,38,68,814 కోట్లకు చేరింది.

వాహన షేర్లు రయ్‌.. విద్యుత్తు షేర్ల వెలుగులు
దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 7 శాతం పెరిగాయని సియామ్‌ వెల్లడించింది. దీంతో వాహన షేర్లు లాభాల రోడ్డుపై పరుగులు పెట్టాయి. మారుతీ సుజుకీ 5.8 శాతం, బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్‌ షేర్లు 4 శాతం వరకూ లాభపడ్డాయి. విద్యుత్‌ షేర్లు వెలుగులు విరజిమ్మాయి.

ధరల పెంపునకు సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్‌ విచారణకు స్వీకరించడానికి అంగీకరించడం, గుజరాత్‌లోని నిలిచిపోయిన మూడు విద్యుత్‌ ప్రాజెక్ట్‌ల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.1.29 లక్షల కోట్లు నిధులు అందించనున్నదన్న వార్తలు విద్యుత్‌ షేర్లకు లాభాల వెలుగునిచ్చాయి. టాటా పవర్,, రిలయన్స్‌ఇన్‌ఫ్రా, అదానీ పవర్, సీఈఎస్‌సీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, షేర్లు 16% వరకూ పెరిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top