మాంద్యం భయాలు

Sensex joins global selloff, falls 355 points; Jet Airways surges 13% - Sakshi

బలహీనంగా యూరో, అమెరికా ఆర్థిక గణాంకాలు 

మాంద్యం వస్తోందేమోనన్న ఆందోళన 

పతనమైన ప్రపంచ మార్కెట్లు 

356 పాయింట్ల నష్టంతో 37,809కు సెన్సెక్స్‌ 

103 పాయింట్లు పతనమై 11,354కు నిఫ్టీ

అంతర్జాతీయంగా మాంద్యం నెలకొనే అవకాశాలున్నాయన్న భయాలతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. అయిల్, గ్యాస్‌ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,400 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్‌ 356 పాయింట్లు పతనమై 37,809 పాయింట్ల వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు క్షీణించి 11,354 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా రెండో సెషన్‌లోనూ స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 577 పాయింట్లు, నిఫ్టీ 167 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అమెరికా, యూరప్‌లకు సంబంధించి గత శుక్రవారం వెలువడిన ఆర్థిక గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన చెలరేగి శుక్రవారం అమెరికా, యూరప్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావంతో సోమవారం ఆసియా మార్కెట్లు కూడా భారీగా నష్టపోగా. మధ్యాహ్నం యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమయ్యాయి. ఇదంతా మన మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావాన్నే చూపించింది.   నష్టాల్లోనే ఆరంభమైన సెన్సెక్స్,  ఒక దశలో 497 పాయింట్ల వరకూ పతనమైంది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 145 పాయింట్ల వరకూ నష్టపోయింది. అయితే చివర్లో కొంత కొనుగోళ్ల మద్దతు లభించింది. 

నేటి నుంచి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇన్సూరెన్స్‌ ఓఎఫ్‌ఎస్‌  
 ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఓఎఫ్‌ఎస్‌ (ఆఫర్‌ ఫర్‌ సేల్‌) నేటి నుంచి ప్రారంభమవుతోంది. బుధవారం ముగిసే ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్‌ ధర రూ.300. మంగళవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, బుధవారం రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయిస్తారు. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో  తనకున్న వాటాలో కొంత వాటాను  ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్స్‌ విక్రయించనున్నది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌’(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో భాగంగా 2.6% వాటాకు సమానమైన 3.74 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ సంస్థ ఆఫర్‌ చేస్తోంది. కాగా. బీఎస్‌ఈలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ షేర్‌ 2.3 శాతం నష్టంతో రూ.322 వద్ద ముగిసింది.

ఆరంభమైన డీఎల్‌ఎఫ్‌ క్యూఐపీ... రూ.3,000 కోట్ల సమీకరణ లక్ష్యం...
రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌)ను సోమవారం ఆరంభించింది. అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు 17.3 కోట్ల షేర్లను కేటాయించడం ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించాలని డీఎల్‌ఎఫ్‌ భావిస్తోంది. ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించుకోవాలని కంపెనీ ఆలోచన. ఈ క్యూఐపీలో ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఫ్లోర్‌ ధరగా రూ.193ను కంపెనీ నిర్ణయించింది. ఫ్లోర్‌ ధరపై 5 శాతం డిస్కౌంట్‌ను ఇచ్చే అవకాశాలున్నాయని కంపెనీ పేర్కొంది. ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌(రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్‌) ద్వారా రూ.4,750 కోట్లు విజయవంతంగా సమీకరించిన నేపథ్యంలో డీఎల్‌ఎఫ్‌ క్యూఐపీకు వస్తోంది. ఈ క్యూఐపీ అనంతరం ప్రమోటర్లు రూ.2,500 కోట్ల మేర నిధులు అందించనున్నారని, ఫలితంగా డీఎల్‌ఎఫ్‌ గత ఏడాది చివరి నాటికి రూ.7,200 కోట్లుగా ఉన్న రుణ భారం చెప్పుకోదగిన స్థాయిలో తగ్గుతుందని సమాచారం. కాగా క్యూఐపీ నేపథ్యంలో బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్‌ షేర్‌ 3.4% నష్టంతో రూ.189 వద్ద ముగిసింది.  కాగా డీఎల్‌ఎఫ్‌ పెద్ద ఎత్తున నిధులు సమీకరించడం ఇది మూడోసారి. 2007లో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.9,200 కోట్లు రాబ ట్టింది. 2013లో ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా రూ.1,900 కోట్లు పొందింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top