మార్కెట్‌కు లిక్విడిటీ జోష్‌

Sensex Gains Over 200 Points - Sakshi

ఆర్‌బీఐ నుంచి  రూ.36,000 కోట్ల నిధులు

ప్రభుత్వం చేతికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌

మూడు రోజల నష్టాలకు బ్రేక్‌

299 పాయింట్లు పెరిగి 36,526కు సెన్సెక్స్‌

78 పాయింట్లు పతనమై 11,008కు నిఫ్టీ

ఆర్‌బీఐ ఈ నెలలో రూ.36,000 కోట్ల నిధులు అందించనుండటం సోమవారం స్టాక్‌మార్కెట్‌కు జోష్‌నిచ్చింది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను ప్రభుత్వం టేకోవర్‌ చేయనుండడం,  సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌పడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్లపైకి ఎగబాకింది. తయారీ రంగ పీఎమ్‌ఐ గణాంకాలు సానుకూలంగా ఉండటం, గత నెల వాహన విక్రయ గణాంకాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పుంజుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 299 పాయింట్లు పెరిగి 36,526  పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 11,008 పాయింట్ల వద్ద ముగిశాయి.  

నష్టాల్లోంచి.. లాభాల్లోకి...!  
సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై ఆందోళనతో నష్టాల్లోకి జారిపోయింది. 266 పాయింట్ల నష్టంతో 35,961 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. ఆర్‌బీఐ రూ.36,000 కోట్ల నిధులందిం చనుండటం, తయారీ రంగం పీఎమ్‌ఐ గణాంకాలు పుంజుకోవడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాల కారణంగా లాభాల బాట పట్టింది.

390 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో 36,617 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని తాకింది. మొత్తం మీద రోజంతా   656 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 109 పాయింట్లు పడిపోగా, మరో దశలో 105 పాయింట్లు లాభపడింది. ఇటీవలి పతనం కారణంగా ఆకర్షణీయంగా ఉన్న బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు జరగడం సానుకూల ప్రభావం చూపించిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.  మరిన్ని వివరాలు...

యస్‌బ్యాంక్‌ 10 శాతం పెరిగి రూ.201 వద్ద ముగిసింది. బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ వారసుడి ఎంపిక మొదలైందని ఈ బ్యాంక్‌ ప్రకటించింది. ఆడిట్‌ కాని ఫలితాలను కూడా వెల్లడించింది. దీంతో కొన్ని రోజులుగా నష్టపోతున్న ఈ షేర్‌ లాభపడింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. 
కొత్త బ్రాంచ్‌లు ప్రారంభం, సీఈఓ పారితోషికంపై ఆర్‌బీఐ ఆంక్షలు కారణంగా బంధన్‌ బ్యాంక్‌ 20 శాతం లోయర్‌ సర్క్యూట్‌ (రూ.112 నష్టం)తో రూ. 451వద్ద ముగిసింది. ఈ బ్యాంక్‌తో పాటు పలు షేర్లు ఆయా షేర్ల నిర్దేశిత లోయర్‌ సర్క్యూట్‌కు పడిపోయాయి. బాంబే డయింగ్‌ అండ్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ కంపెనీ, ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ,  తదితర 300కు పైగా షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
 ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌ షేర్‌ ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ.38కు పడిపోయి, ఆ స్థాయి నుంచి 80 శాతం ఎగసి రూ.67 వద్ద ముగిసింది.

లాభాలు ఎందుకంటే..
ఆర్‌బీఐ నిధులు: ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్ల ద్వారా ఈ నెలలో రూ.36,000 కోట్ల నిధులు లభ్యమయ్యేలా చూస్తామని ఆర్‌బీఐ ప్రకటించడంతో కొనుగోళ్ల జోరు పెరిగింది.  
పుంజుకున్న తయారీ రంగం: గత నెలలో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి, ఉద్యోగిత మెరుగుపడటంతో నికాయ్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ 52.2కు ఎగసింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ ఇండెక్స్‌ 51.7గా ఉంది.
ప్రభుత్వం చేతికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌: ఇటీవల వరుస డిఫాల్ట్‌లతో సతమతమవడంతో పాటు ఎన్‌బీఎఫ్‌సీల నష్టాలకు కారణమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ప్రభుత్వం టేకోవర్‌ చేయనున్నది. ఈ నేపథ్యంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ షేర్లు 20 శాతం వరకూ ఎగిశాయి. బ్యాంకింగ్, ఇతర ఆర్థిక రంగ షేర్లు కూడా లాభపడ్డాయి.  
జోష్‌నిచ్చిన ‘ఆటో’అమ్మకాలు: కేరళ వరదల కారణంగా సెప్టెంబర్‌లో వాహన విక్రయాలు తగ్గుతాయనే అంచనాలుండేవి. కానీ వాహన విక్రయాలు అంచనాలను మించడం మార్కెట్‌కు మరింత జోష్‌నిచ్చింది.  
వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం: అమెరికా, కెనడా, మెక్సికో దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో వాణిజ్య ఉద్రిక్తతల తీవ్రత ఒకింత తగ్గింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top