5 రోజుల్లో 1759 పాయింట్లు అప్‌

Sensex gains 5th day in a row - Sakshi

తాజాగా 187 పాయింట్లు ప్లస్‌

36,675కు సెన్సెక్స్‌

10,800 వద్ద ముగిసిన నిఫ్టీ 

ప్రయివేట్‌ బ్యాంకులు, ఐటీ జోరు

స్వల్ప ఒడిదొడుకుల మధ్య వరుసగా ఐదో రోజూ దేశీ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడంతో చివరికి సెన్సెక్స్‌ 187 పాయింట్లు జమ చేసుకుని 36,675 వద్ద ముగిసింది. గత 4 రోజుల్లో సెన్సెక్స్‌ 1572 పాయింట్లు జంప్‌చేసిన విషయం విదితమే. ఇకనిఫ్టీ 36 పాయింట్లు బలపడి 10,800 వద్ద నిలిచింది. కాగా.. సెన్సెక్స్‌ ఒక దశలో 36,271 వద్ద కనిష్టానికి చేరగా.. 36,723 వద్ద గరిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 10814-10690 పాయింట్ల హెచ్చుతగ్గులను నమోదు చేసుకుంది. సోమవారం యూరోపియన్‌, యూఎస్‌ మార్కెట్లు 2 శాతం స్థాయిలో లాభపడటంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంతమేర ఆటుపోట్లు చవిచూసినట్లు తెలియజేశారు.

మెటల్‌ వీక్
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2.7 శాతం, ఐటీ 1.5 శాతం చొప్పున పుంజుకోగా.. మెటల్‌ 1.7 శాతం, రియల్టీ 0.7 శాతం చొప్పున డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఫిన్‌, ఐషర్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 8-2.25 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, గ్రాసిమ్‌, బీపీసీఎల్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, వేదాంతా, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ 3.5-2 శాతం మధ్య నీరసించాయి.

ఫైనాన్స్‌ స్పీడ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో బాష్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఈక్విటాస్‌, బంధన్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌, చోళమండలం, నిట్‌ టెక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 12-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా..  ఐజీఎల్‌, పెట్రోనెట్‌, ఎంజీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఆర్‌ఈసీ, భెల్‌, గ్లెన్‌మార్క్‌, ఎన్‌ఎండీసీ 6-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1339 లాభపడితే.. 1379 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 348 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 263 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 857 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 332 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top