10,600 పైకి నిఫ్టీ

Sensex Gains 118 Points, Nifty Settles At 10616 - Sakshi

కొనసాగిన చమురు లాభాలు  

బలపడిన రూపాయి 

సానుకూలంగా  అంతర్జాతీయ సంకేతాలు 

119 పాయింట్ల లాభంతో 35,261కు సెన్సెక్స్‌

40 పాయింట్లు పెరిగి 10,617కు నిఫ్టీ  

ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ము గిసింది. అంతర్జాతీయ సంకేతాలు కూడా సానుకూలంగా ఉండటం కలసివచ్చింది. ఆర్థిక రంగ షేర్లు లాభపడటంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 10,600 పాయింట్లపైకి ఎగబాకింది. 40 పాయింట్ల లాభంతో 10,617 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 119 పాయింట్ల లాభంతో 35,261 పాయింట్లకు చేరింది. బ్యాంక్, వాహన, లోహ షేర్లు పెరిగాయి. ముడి చమురు ధరలు తగ్గడం మన ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిస్తోందని విశ్లేషకులంటున్నారు. చమురు ధరలు దిగిరావడం వల్ల మన దిగుమతి బిల్లు తగ్గుతుందని, ద్రవ్యోల్బణం, కరంట్‌  అకౌంట్‌ లోటు కూడా తగ్గుతాయని వారంటున్నారు. అక్టోబర్‌ మొదటివారంలో 80 డాలర్లుగా ఉన్న పీపా చమురు తాజాగా 30 శాతం పడిపోయి 65 డాలర్లకు పతనమైంది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం 44 పైసలు లాభపడి 71.87కు దిగిరావడం (ఇంట్రాడేలో), ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిసి, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ఆరంభం కావడం సానుకూల ప్రభావం చూపించాయి. అమెరికాలో పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గడం, మన క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు పుంజుకోవడం కలసివస్తున్నాయని నిపుణులంటున్నారు. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల విషయంలో అనిశ్చితి, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వచ్చే నెలలో తప్పనిసరిగా రేట్లను పెంచనుండటం వంటి అంశాలు సమీప కాలంలో స్టాక్‌ మార్కెట్‌కు ఒడిదుడుకులకు గురిచేస్తాయని విశ్లేషకులంటున్నారు.  

►టాటా గ్రూప్‌ నియంత్రిత వాటాను కొనుగోలు చేయనున్నదన్న వార్తల కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 25 శాతం ఎగసి రూ.325 వద్ద ముగిసింది. 
►క్యూ2 ఫలితాలు అంచనాలను మించడం, బోనస్‌ షేర్ల జారీ వార్తలతో ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ షేర్‌ 8 శాతం లాభపడి రూ.235 వద్ద ముగిసింది.  
​​​​​​​► అదానీ పోర్ట్స్‌ కంపెనీ షేర్‌ 4.1 శాతం పెరిగి రూ.345 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్‌ ఇదే.  

జీఐసీ, న్యూ ఇండియా  ఎష్యూరెన్స్‌ల్లో ఓఎఫ్‌ఎస్‌ 
జీఐసీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీల్లో మరింత వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)విధానంలో ఈ రెండు బీమా కంపెనీల్లో మరింత వాటాను విక్రయించడానికి కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు కంపెనీల ఓఎఫ్‌ఎస్‌ కార్యక్రమాలను నిర్వహించడానికి ఆసక్తి గల మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) దరఖాస్తులను ఆహ్వానించింది. సదరు మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు వచ్చే నెల 7లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top