వరుసగా మూడో రోజూ..

Sensex falls for 3rd consecutive day - Sakshi

ముంబై : వరుసగా మూడో సెషన్‌లోనూ మార్కెట్లు నష్టాలే పాలయ్యాయి. చివరి గంటలో నెలకొన్న అమ్మకాలతో ముందస్తు లాభాలు హరించుకుపోయాయి. సెన్సెక్స్‌ 71 పాయింట్ల కిందకి పడిపోయి 33,704 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు నష్టాలు పాలై 10,360 వద్ద క్లోజయ్యాయి. మరోవైపు అమెరికా డాలర్‌తో పోలిస్తే, రూపాయి మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. 53 పైసలు క్షీణించిన రూపాయి విలువ 64.74గా నమోదైంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటంతో రూపాయి విలువ పడిపోయినట్టు విశ్లేషకులు చెప్పారు. నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌ స్టాక్స్‌ ఎక్కువగా నష్టపోయాయి.

అయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొనుగోళ్లు చోటుచేసుకోగా.. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు లాభాల్లో ముగిసింది. ఐటీ స్టాక్స్‌ కూడా నేడు కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉన్నట్టు తెలిసింది. మొత్తంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని విశ్లేషకులు చెప్పారు. మిడ్‌క్యాప్స్‌లో టాటా గ్లోబల్‌, బయోకాన్‌, వోల్టస్‌, భూషణ్‌ స్టీల్‌, జస్ట్‌ డయల్‌ 1 శాతం నుంచి 3 శాతం కిందకి పడిపోగా.. కెనరా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు, యూనియన్‌ బ్యాంకు, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, అపోలో టైర్స్‌, టైటాన్‌ కంపెనీ, పీసీ జువెల్లర్‌ 1 శాతం నుంచి 5 శాతం లాభాలు పండించాయి.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top