200 పాయింట్లు నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

Sensex fall 200 points - Sakshi

9918 వద్ద మొదలైన నిఫ్టీ

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 200 పాయింట్ల నష్టంతో 33578 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు క్షీణించి  9918 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా రంగాలకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.29శాతం నష్టంతో 20,388.50 వద్ద మొదలైంది. 

దేశీయంగా  ఏప్రిల్‌ టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ (డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు విడుదల కానున్నాయి. మరోవైపు అశోకా బిల్డ్‌కాన్‌, జేకే టైర్స్‌, ఫైజర్‌, టాటామోటర్స్‌తో పాటు సుమారు 56 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు ఇన్వెసర్లకు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. 

ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలు 
నేడు చైనా మే నెల పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు విడుదల నేపథ్యంలో ఇన్వెసర్లు అప్రమత్తత వహిస్తున్నారు. అలాగే కోవిడ్‌-19 వైరస్‌ రెండో దశ వ్యాధి వాప్తి భయాలు కూడా ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. ఫలితంగా నేడు ఆసియా మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు సైతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క ఇండోనేషియా తప్ప మిగిలిన అన్ని దేశాలకు చెందిన సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. అత్యధికంగా సింగపూర్‌ ఇండెక్స్‌ 1.50శాతం క్షీణించింది. జపాన్‌, హాంగ్‌కాంగ్‌, థాయిలాండ్‌ దేశాల స్టాక్‌ సూచీలు అరశాతం పతనమయ్యాయి. చైనా, కొరియా, తైవాన్‌ దేశాల ఇండెక్స్‌లు స్వల్పంగా అరశాతం క్షీణించాయి.

ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటామోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటా స్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో, ఐషర్ మోటర్స్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top