కొత్త శిఖరాలకు స్టాక్‌ సూచీలు  

Sensex extends gains to close at record high - Sakshi

సానుకూల వర్షపాత అంచనాలు

పుంజుకున్న రేట్ల కోత ఆశలు 

క్యూ4 ఫలితాలపై  పెరిగిన ఆశాభావం 

జోరుగా విదేశీ నిధుల ప్రవాహం 

ఇంట్రాడే, క్లోజింగ్‌ల్లో కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ

370 పాయింట్ల లాభంతో  39,276కు సెన్సెక్స్‌

11,787కు నిఫ్టీ; 97 పాయింట్లు ప్లస్‌

కంపెనీల ఆర్థిక ఫలితాలపై, వర్షాలపై ఆశావహ అంచనాలతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం మెరుపులు మెరిపించింది. ప్రధాన స్టాక్‌ సూచీలు–సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. వరుసగా నాలుగో రోజూ స్టాక్‌ మార్కెట్‌ లాభపడింది. నిఫ్టీ తొలిసారిగా (ఇంట్రాడేలో) 11,800 పాయింట్లను అధిగమించింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం,  ముడి చమురు ధరలు తగ్గడం, ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ఉండటం కలసివచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ వరుసగా మూడో రోజూ పడిపోయినా, మార్కెట్‌ ముందుకే నడిచింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 370 పాయింట్ల లాభంతో 39,276 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,364 పాయింట్లను, నిఫ్టీ 11,811 పాయింట్లను తాకాయి. ఇవి రెండూ ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. బ్యాంక్, ఆర్థిక, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, ఆయిల్, గ్యాస్, టెలికం  షేర్లు అధికంగా పెరిగాయి. రియల్టీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. గత నాలుగు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 690 పాయింట్లు లాభపడింది. 

తదుపరి మజిలీ  12,000 పాయింట్లు...! 
సెన్సెక్స్, నిఫ్టీల జోరు కొనసాగే అవకాశాలే ఉన్నాయని, ఇన్వెస్టర్లు తొందరపడి లాభాల స్వీకరణ చేయకుండా, వేచి చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. మంగళవారం నాటి నిఫ్టీ గ్యాప్‌ జోన్‌ 11,731–11,804 రేంజ్‌లో నిఫ్టీ కొనసాగితే  తదుపరి మజిలీ 12,000 పాయింట్లేనని ప్రముఖ టెక్నికల్‌ ఎనలిస్ట్‌ మజర్‌ మహ్మద్‌ పేర్కొన్నారు.   
మరిన్ని విశేషాలు... 

► 31 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లు–టాటా మోటార్స్, టాటా మోటార్స్‌ డీవీఆర్, ఇన్ఫోసిస్, పవర్‌ గ్రిడ్‌ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభపడ్డాయి.  
►   టీసీఎస్‌ గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో 6 శాతం లాభపడి, రూ.2,132 వద్ద ముగిసింది. షేర్‌ జోరుగా పెరగడంతో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.8 లక్షల కోట్లను దాటేసింది.  
​​​​​​​►    ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 3% లాభంతో రూ.407 వద్ద ముగిసింది. అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఈ షేర్‌కు బై రేటింగ్‌ను కొనసాగిస్తూ, టార్గెట్‌ ధరను రూ.451 నుంచి రూ.492కు పెంచడమే దీనికి కారణం.  
​​​​​​​►    జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు తాత్కాలికంగా మూతపడనున్నాయనే వార్తల కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 8 శాతం నష్టపోయి రూ. 242 వద్ద ముగిసింది.   విమానాల సంఖ్యను మరింతగా పెంచుకోనున్నామని పేర్కొననడంతో స్పైస్‌ జెట్‌ షేర్‌ శాతం 11 శాతం లాభంతో రూ. 132 వద్ద ముగిసింది.
​​​​​​​►స్టాక్‌ సూచీలతో పాటు ఆరు కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, బాటా ఇండియా, జిల్లెట్‌ ఇండియా, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో), పీవీఆర్, రిలాక్సో ఫుట్‌వేర్‌ షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.

లాభాలు ఎందుకంటే...
సానుకూల వర్షపాత అంచనాలు... 
ఎల్‌నినో కారణంగా ఈసారి వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తాయని గతంలో స్కైమెట్‌ అంచనాలు వెలువరించింది. తాజాగా ఇండియన్‌ మెటిరియలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఎమ్‌డీ)మాత్రం వర్షాలు దాదాపు సాధారణంగానే ఉంటాయన్న అంచనాలను వెల్లడించింది. వర్షాలు కురిస్తే, ద్రవ్యోల్బణం తగ్గి, వడ్డీరేట్లు దిగివస్తాయన్న ఆశలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది.  

ఆర్‌బీఐ రేట్ల కోత ఆశలు... 
ఐఎమ్‌ఈ సానుకూల అంచనాల నేపథ్యంలో రేట్ల కోతపై ఆశలు పెరిగాయి. జూన్‌ 7న జరిగే పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ మరో పావు శాతం మేర కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు బలం పుంజుకున్నాయి.  

ఫలితాల జోష్‌... 
ఐటీ దిగ్గజం అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను వెలువరించింది. ఈ క్యూ4లో బ్యాంక్‌లు, వినియోగ సంబంధిత కంపెనీలతో సహా అన్ని రంగాల కంపెనీలు  మంచి ఫలితాలనే వెల్లడిస్తాయనే ఆశలు నెలకొన్నాయి.  

ముడి చమురు ధరల పతనం... 
ఇటీవలే ఐదు నెలల గరిష్టానికి ఎగసిన ముడి చమురు ధరలు దిగివచ్చాయి. మార్కెట్‌ వాటా పెంచుకునే విషయమై అమెరికాతో పోటీ కోసం రష్యా–ఒపెక్‌లు చమురు ఉత్పత్తిని పెంచే అవకాశాలున్నాయని, ఫలితంగా బ్యారెల్‌ చమురు 40 డాలర్లకు దిగి వచ్చే అవకాశాలున్నాయన్న రష్యా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు చమురు ధరలను పడగొట్టాయి.  

సానుకూల వాణిజ్య గణాంకాలు.... 
ఈ ఏడాది మార్చిలో ఎగుమతులు ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయన్న వాణిజ్య గణాంకాలు ఇన్వెస్టర్లలో జోష్‌ను నింపాయి.  

విదేశీ నిధుల వెల్లువ... 
విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. సోమవారం రూ.713 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు మంగళవారం రూ.1,038 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఈ నెలలో ఇప్పటికే రూ.7,071 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. మొత్తం మీద ఈ ఏడాది విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.65,000 కోట్లకు మించాయి.   

డ్రీమ్‌ రన్‌ కొనసాగుతుంది... 
గత కొన్ని వారాలుగా భారత స్టాక్‌ మార్కెట్‌లో డ్రీమ్‌ రన్‌ కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌తో సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు రేట్ల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో విదేశీ నిధులు వెల్లువలా వస్తున్నాయి. ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయన్న ఐఎమ్‌డీ అంచనాలు... వడ్డీరేట్ల కోత ఆశలతో కొనుగోళ్లు జోరుగా జరుగుతున్నాయి.  
–దేవాంగ్‌ మెహతా, ఈక్విటీ అడ్వైజరీ హెడ్, సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌   

4 రోజులు.. 3 లక్షల కోట్లు  
గత నాలుగు రోజుల్లో స్టాక్‌ మార్కెట్‌ లాభపడుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద పెరుగుతోంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ నాలుగు రోజుల్లో రూ.3.02 లక్షల కోట్లు పెరిగింది. గత బుధవారం రూ.1.51,22,121 కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ మంగళవారం నాటికి రూ.1,54,24,308 కోట్లకు చేరింది.

నేడు సెలవు 
మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు (బుధవారం) మార్కెట్‌కు సెలవు. గుడ్‌ఫ్రైడ్‌ కారణంగా శుక్రవారం (ఈ నెల19న) కూడా మార్కెట్‌ పనిచేయదు. ఈ వారంలో ఒక్క గురువారం మాత్రమే ట్రేడింగ్‌ జరగనున్నది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top