అవిశ్వాసం : లాభాలకే మార్కెట్లు సై

Sensex Ends Over 140 Pts Higher, Nifty Hold 11K - Sakshi

ముంబై : ఓ వైపు లోక్‌సభలో కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం చర్చ కొనసాగుతున్నప్పటికీ.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఏ మాత్రం తొణకలేదు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తిచూపడంతో తొలి నుంచీ దేశీ స్టాక్‌ మార్కెట్లు పటిష్టంగా కదిలాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది సేపటి నుంచి పుంజుకున్న మార్కెట్లు, ఆ అనంతరం కొంత లాభాలను కోల్పోయినప్పటికీ, చివరి గంట ట్రేడింగ్‌ మరింత లాభాలను చేకూర్చేలా చేసింది. 200 పాయింట్ల మేర ఎగిసిన సెన్సెక్స్‌, చివరికి 145 పాయింట్ల లాభంలో 36,496 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంలో 11,010 వద్ద ముగిశాయి.

మిడ్‌​క్యాప్‌ షేర్లలో ఎక్కువగా కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో, శుక్రవారం మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రా, బ్యాంక్‌లు, ఎనర్జీ స్టాక్స్‌ కూడా మంచి లాభాలను పండించాయి. మెటల్స్‌, ఆటో స్టాక్స్‌ మాత్రమే టాప్‌ లూజర్లుగా ఉన్నాయి. స్టాక్స్‌ అన్నింటిలో ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ టాప్‌ గెయినర్లుగా ఉండగా.. బజాజ్‌ ఆటో, వేదంత, హెచ్‌పీసీఎల్‌ ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసల లాభంలో 68.85గా నమోదైంది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్‌ యూనియన్‌ అమెరికా మధ్య తాజాగా వాణిజ్య వివాద సంకేతాలు వెలువడ్డాయి. ఇన్ని అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, మార్కెట్లు మాత్రం చివరికి లాభాలవైపు ముగిశాయని విశ్లేషకులు చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top