చివర్లో అమ్మకాలు... లాభాలు ఆవిరి

Sensex ends flat; realty, metal stocks major gainers - Sakshi

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

ఆదుకున్న దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు

ముంబై: స్టాక్‌ మార్కెట్లో ఎఫ్‌ఐఐల అమ్మకాలు ఆగలేదు. శుక్రవారం మార్కెట్‌ ఆరంభంలో వచ్చిన లాభాలన్నీ ముగింపునకు ఆవిరైపోయాయి. ఉదయం నుంచి సూచీలు సానుకూలంగానే కదలాడినా మధ్యాహ్నం నుంచి ఎఫ్‌ఐఐలు అమ్మకాలు మొదలు పెట్టారు. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గరిష్ట స్థాయి నుంచి 220 పాయింట్ల లాభాలను కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 31,522 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. దీనికి దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు వెన్నుదన్నుగా నిలిచాయి.

అయితే, ఎఫ్‌ఐఐల అమ్మకాలతో చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే ఒక్క పాయింటు లాభపడి 31,283.72 వద్ద క్లోజయింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం 19 పాయింట్ల లాభంతో 9,788.60 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,854 వరకూ వెళ్లినా స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.1,546 కోట్ల మేర విక్రయాలు చేయగా, దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 2,064 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. ఇవి మార్కెట్లను కొంతైనా ఆదుకున్నాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ నికరంగా 638 పాయింట్లు (2 శాతం) కోల్పోగా, నిఫ్టీ సైతం 175 పాయింట్లు (1.76 %) తగ్గింది.

సానుకూలతల బలం
రూపాయి బలపడడం మార్కెట్‌కు సానుకూలంగా నిలిచింది. దీనికితోడు ద్రవ్యలోటుపై ఇన్వెస్టర్లలో ఉన్న ఆందోళనలు సైతం నెమ్మదించాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.2 శాతాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ ఉన్నతాధికారి చేసిన ప్రకటన ఇందుకు దారితీసింది. దేశీయ ఇన్వెస్టర్ల కొనుళ్లు నష్టపోకుండా అడ్డకున్నట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 3, 4న జరిగే ఆర్‌బీఐ విధాన సమీక్ష స్వల్ప కాలంలో మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

9న ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌ ఐపీవో
ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌ ఐపీవో అక్టోబర్‌ 9న ప్రారంభం కానుంది. రూ.1,001 కోట్ల సమీకరణ లక్ష్యంతో కంపెనీ ఐపీవోకు వస్తోంది. ఇష్యూ 11న ముగుస్తుంది. 60,065,009 ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఇది ఐపీవో అనంతరం కంపెనీ ఈక్విటీలో 20 శాతానికి సమానం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top