విదేశీ ఎఫెక్ట్‌- 35,000 దిగువకు

Sensex ends below 35000 points mark - Sakshi

‌ 210 పాయింట్లు మైనస్

34,961 పాయింట్ల వద్ద ముగింపు

71 పాయింట్లు డీలా- 10312కు నిఫ్టీ

పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ పల్టీ

యూఎస్‌, ఆసియా మార్కెట్లు అమ్మకాలతో నీరసించడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనయ్యారు. తొలి నుంచీ అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా నష్టాలతోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 210 పాయింట్లు క్షీణించి 34,961 వద్ద ముగిసింది. తద్వారా 35,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్లు తక్కువగా 10,312 వద్ద స్థిరపడింది. రెండో దశ కోవిడ్‌ కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డవున్‌కు తెరలేవనున్న అంచనాలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35,032- 34,662 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. నిఫ్టీ సైతం 10,338 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకగా.. 10,224 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది.

ఎఫ్‌ఎంసీజీ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ మాత్రమే(0.7 శాతం) బలపడగా.. మిగిలిన అన్ని రంగాలూ డీలాపడ్డాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ 3.5 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఈ బాటలో మెటల్‌, మీడియా, ఐటీ, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2.6-1.2 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, హిందాల్కో, ఎస్‌బీఐ, విప్రో, బీపీసీఎల్‌, ఎల్‌అండ్‌టీ, జీ, ఇన్ఫోసిస్‌ 5-2.25 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే బ్రిటానియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సిప్లా, కొటక్‌ మహీంద్రా, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌ 2.2-0.5 శాతం మధ్య లాభపడ్డాయి.

ఫైనాన్స్‌ వీక్‌
డెరివేటివ్స్‌లో భారత్‌ ఫోర్జ్‌, అశోక్‌ లేలాండ్‌, ఈక్విటాస్‌, సన్‌ టీవీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌, బీవోబీ, ఐబీ హౌసింగ్‌ 10-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. మరోపక్క ఐడియా, బీఈఎల్‌, జస్ట్‌ డయల్‌, పిరమల్‌, ఎస్కార్ట్స్‌ 6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతం స్థాయిలో వెనకడుగు వేశాయి. ట్రేడైన షేర్లలో 1640 నష్టపోగా.. 1144 లాభపడ్డాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 753 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1304 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గురువారం ఎఫ్‌పీఐలు రూ.  1051 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 256 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top