మళ్లీ కొత్త రికార్డ్‌లు

Sensex ends at all-time high - Sakshi

లాభాల్లో బ్యాంక్‌ షేర్లు 

ఇంట్రాడే, ముగింపుల్లో కొత్త శిఖరాలకు సూచీలు

స్టాక్‌ సూచీలు సోమవారం మళ్లీ కొత్త శిఖరాలకు చేరాయి. బ్యాంక్, ఇంధన, టెలికం, కన్సూమర్‌ డ్యూరబుల్స్, ప్రభుత్వ రంగ, లోహ, వాహన  షేర్ల జోరుతో స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. ట్రేడింగ్‌ ఆరంభంలోనే నిఫ్టీ 11,400 పాయింట్లపైకి, సెన్సెక్స్‌ కీలకమైన 37,800 పాయింట్ల పైకి ఎగబాకాయి.

చివరకు  బీఎస్‌ఈ సెన్సెక్స్‌  136 పాయింట్లు లాభపడి 37,692 పాయింట్ల వద్ద, నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,387 పాయింట్ల వద్ద ముగిశాయి.సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 249 పాయింట్ల లాభంతో 37,805 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇది సెన్సెక్స్‌కు జీవిత కాల గరిష్ట స్థాయి. ఇక నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 67 పాయింట్లు లాభపడి ఆల్‌ టైమ్‌ హై, 11,428 పాయింట్లను తాకింది. ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు నష్టపో యాయి.

దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు తాజా గా కొనుగోళ్లు జరపడం, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడుతోందని నిపుణులంటున్నారు. కంపెనీల ఫలితాలు బాగా ఉండటంతో స్టాక్‌ సూచీలు కొత్త శిఖరాలకు చేరుతున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నాయర్‌ చెప్పారు. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ట్రేడింగ్‌ చివర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుందని వివరించారు.  

స్టాక్‌ సూచీలతో పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. డాబర్‌ ఇండియా, గెయిల్, గ్లాక్సోస్మిత్‌లైన్, వర్ల్‌పూల్‌ ఇండియా, గ్రాఫైట్‌ ఇండియా, హావెల్స్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ వెంచర్స్, పేజ్‌ ఇండస్ట్రీస్, వీఐసీ ఇండస్ట్రీస్, వినతి ఆర్గానిక్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
    యాక్సిస్‌ బ్యాంక్‌ 3.8 శాతం లాభంతో రూ.596 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
 గ్లోబల్‌ సబ్‌మెరైన్‌ కేబుల్‌ సిస్టమ్స్‌ కోసం టెలికం ఈజిప్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 3 శాతం లాభపడి రూ.386 వద్ద ముగిసింది.  
    స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 3 శాతం లాభంతో రూ.308కు చేరింది. ఇది ఆరు నెలల గరిష్ట స్థాయి. రిలయన్స్‌ జియోతో జట్టు కట్టడం, ఈ నెల 10న క్యూ1 ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఈ షేర్‌ పెరుగుతోంది.
   ఇక్రా షేర్‌ 6 శాతం లాభంతో రూ. 3,639వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top