40,000–40,800 శ్రేణి కీలకం

Sensex Ends 70 Points Higher At 40357 - Sakshi

మార్కెట్‌ పంచాంగం
అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్‌ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో....ఈ నెలలో పలుదఫాలు నిఫ్టీ 12,000 పాయింట్లపైకి వెళ్లినా, నిలదొక్కుకోలేకపోవడంతో అలసిపోయిన బుల్స్‌ ఆఫ్‌లోడింగ్‌ కారణంగా ఇండియా మార్కెట్‌ గరిష్టస్థాయి నుంచి 1 శాతం వరకూ తగ్గింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వాటి రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతుండగా, ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్‌లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీలు వాటి ఇటీవలి కనిష్టస్థాయిల వద్ద కదులుతున్నాయి. ఈ హెవీవెయిట్ల కదలికల్లో భారీ మార్పు వస్తేనే స్టాక్‌ సూచీలు ఎటో ఒకవైపు వేగంగా పయనించే అవకాశం వుంటుంది. సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
నవంబర్‌ 22తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,222 కనిష్టస్థాయి నుంచి పెరిగి, 40,816 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయిలో స్థిరపడలేక, వారాంతంలో దిగువకు జారిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 2 పాయింట్ల స్వల్ప లాభంతో 40,359 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న 40,000–40,800 శ్రేణిని ఛేదించే దిశ...సెన్సెక్స్‌  ట్రెండ్‌కు కీలకం.  ఈ శ్రేణి దిగువస్థాయిని కోల్పోయి,  ముగిస్తే సెన్సెక్స్‌ స్వల్పకాలిక కరెక్షన్‌కు లోనుకావొచ్చు. ఈ సందర్భంలో తొలుత 39,800 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. తరువాత  39,500 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. పైన ప్రస్తావించిన శ్రేణిలో ఈ వారం సెన్సెక్స్‌ కదలితే తొలుత 40,535 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై ముగిస్తే క్రమేపీ 40,750–40,815 పాయింట్ల శ్రేణిని తిరిగి పరీక్షించవచ్చు. 

నిఫ్టీకి 11,800–12,035 శ్రేణి కీలకం
గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,035 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని ఎదుర్కొని, గతవారం ప్రథమార్ధంలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోలేకపోయింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 18 పాయింట్ల స్వల్పలాభంతో 11,914 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ నిఫ్టీ కదిలిన 11,800–12,035 శ్రేణి నుంచి వెలుపలికి వస్తేనే మార్కెట్లో ఆ దిశగా ట్రెండ్‌ వుండవచ్చు.  ఈ వారం నిఫ్టీ 11,800 పాయింట్ల మద్దతును ముగింపులో కోల్పోతే 11,720 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 11,650 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.  లేదా గత మూడువారాల శ్రేణిలోనే నిఫ్టీ కదలికలు పరిమితమైతే తొలుత 11,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 12,030–12,040 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్టం 12,103 పాయింట్ల స్థాయిని దాటే అవకాశాలుంటాయి.

– పి. సత్యప్రసాద్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top