11,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ

Sensex ends 217 points lower, Nifty below 10950 - Sakshi

నాలుగున్నరేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

ఐదేళ్ల గరిష్టానికి వాణిజ్య లోటు

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు

218 పాయింట్లు క్షీణించి 36,324కు సెన్సెక్స్‌

82 పాయింట్లు పతనమై 10,937కు నిఫ్టీ  

టోకు ధరల ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయికి, వాణిజ్య లోటు ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. బ్యాంక్, ఫార్మా, లోహ, రియల్టీ, వాహన, ఇంధన షేర్ల పతనం కారణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు పడిపోయింది.

ఈ ఏడాది రెండో క్వార్టర్‌లో చైనా వృద్ధి మందగించిదన్న గణాంకాల కారణంగా ఆసియా మార్కెట్లు పతనం కావడం ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 218 పాయింట్ల నష్టంతో 36,324 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 10,937 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి.

360 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌..
సెన్సెక్స్‌ తొలుత లాభాల్లోనే ప్రారంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 117 పాయింట్ల లాభంతో 36,659 పాయింట్ల వద్ద ఇంట్రాడేలో గరిష్ట స్థాయిని తాకింది. టోకు ధరల ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. దీంతో పలు షేర్లలో అమ్మకాలు చోటు చేసుకున్నాయి. సెన్సెక్స్‌ నష్టాల్లోకి జారిపోయింది.

ఒకదశలో 243 పాయింట్ల నష్టంతో 36,299 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మొత్తం మీద సెన్సెక్స్‌  360 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. టోకు ధరల ద్రవ్యోల్బణం నిరాశపరచడం, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయని, దీంతో ఇటీవల పెరిగిన షేర్లలో అమ్మకాలు జరిగాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.  

మరికొన్ని మార్కెట్‌ విశేషాలివీ...
ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయినా, 1:1 బోనస్‌ను ప్రకటించడంతో ఇన్ఫోసిస్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.1,384ను తాకింది. చివరకు 1.8 శాతం లాభంతో రూ.1,333 వద్ద ముగిసింది. బజాజ్‌ ఫైనాన్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు కూడా ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌ హైలను తాకాయి.  
షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంతో పీసీ జ్యూయలర్‌ షేర్‌ 26 శాతం పతనమై రూ.89 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 28 శాతం వరకూ పతనమై తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.86ను తాకింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.1,223 కోట్లు ఆవిరై రూ.3,507 కోట్లకు తగ్గిపోయింది.  
సబోక్సోన్‌ జనరిక్‌ ఔషథ విక్రయాలపై అమెరికా కోర్టు తాత్కాలిక నిషేధం విధించడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్‌ 10 శాతం నష్టపోయి రూ.2,089 వద్ద ముగిసింది.
గత నెలలో చైనాలో ముడి స్టీల్‌ ఉత్పత్తి రికార్డ్‌ స్థాయికి చేరిందన్న వార్తల కారణంగా టాటా స్టీల్‌  6.9 శాతం నష్టంతో రూ.519 వద్ద ముగసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
చందా కొచర్‌ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుండటంతో వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్‌) ఐసీఐసీఐ బ్యాంక్‌ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ షేర్‌ 3.2 శాతం పతనమైంది.  
నిర్వహణ లాభ వృద్ధి రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో డీసీబీ బ్యాంక్‌ 11 శాతం పతనమైంది.  
300కు పైగా షేర్లు తాజాగా ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. అంబుజా సిమెంట్స్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భెల్, ఫెడరల్‌ బ్యాంక్, హెచ్‌డీఐఎల్, ఐడీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఐనాక్స్‌ లీజర్, జెట్‌ ఎయిర్‌వేస్, దేనా బ్యాంక్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top