ఐదో రోజూ అదే వరుస

Sensex ends 119 pts lower, Nifty below 10,800 - Sakshi

కొనసాగుతున్న లాభాల స్వీకరణ, నష్టాలు  

10,800 పాయింట్ల దిగువకు నిఫ్టీ  

38 పాయింట్లు తగ్గి 10,794 వద్ద ముగింపు  

120 పాయింట్లు పతనమై 36,034కు సెన్సెక్స్‌

వరుసగా ఐదో రోజూ స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ట్రేడింగ్‌ చివర్లో బ్యాంక్, వాహన, లోహ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో బుధవారం స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దేశీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు షేర్లను అమ్ముతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 120 పాయింట్లు క్షీణించి 36,034 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 10,794 పాయింట్ల వద్ద ముగిశాయి. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 941 పాయింట్లు నష్టపోయింది. ఈ ఐదు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.3.37 లక్షల కోట్లు హరించుకుపోయింది.  

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు...  
చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కొంత మెతక వైఖరి అవలంభిస్తుండటంతో వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు లాభపడుతున్నాయి. కానీ ఆ సానుకూలతలను మన మార్కెట్‌ అందిపుచ్చుకోలేకపోతోంది.  

413 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 19 నెలల కనిష్టానికి పడిపోవడం, పారిశ్రామికోత్పత్తి ఒకింత పుంజుకోవడంతో ఆరంభంలో కొనుగోళ్లు జోరుగానే జరిగాయి. దీంతో సెన్సెక్స్‌ 222 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నష్టాల్లోకి జారిపోయింది. చివరి గంటలో అమ్మకాలు జోరుగా సాగడంతో సెన్సెక్స్‌ 191 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 413 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 60 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 59 పాయింట్లు పతనమైంది.  
►ముడి చమురు ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 3 శాతం వరకూ నష్టపోయాయి.  
►దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అశోక్‌ లేలాండ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఫినోలెక్స్‌ కేబుల్స్, నాట్కో ఫార్మా,  తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
►డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు బాగా ఉండటంతో న్యూలాండ్‌ ల్యాబ్స్‌ షేర్‌ 20 శాతం ఎగసి రూ.588 వద్ద ముగిసింది.              
►ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో బాటా షేర్‌ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 1,283ను తాకింది. చివరకు 7 శాతం లాభంతో రూ.1,271 వద్ద ముగిసింది.  కాంటాబిల్‌ రిటైల్‌ వంటి పదికి పైగా షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. 
►  సెన్సెక్స్‌లో పది షేర్లు మాత్రమే పెరగ్గా, మిగిలిన 21 షేర్లు నష్టపోయాయి.  
►  సెన్సెక్స్‌ వరుసగా ఐదో రోజూ నష్టపోగా, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ షేర్‌ వరుసగా ఐదో రోజూ లాభపడింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top