సెన్సెక్స్‌ 464 పాయింట్లు డౌన్‌

 Sensex drops 463 points; Nifty ends at 10303 points - Sakshi

ప్రపంచ మార్కెట్ల పతనం

కొనసాగిన ఎన్‌బీఎఫ్‌సీల నష్టాలు

464 పాయింట్ల నష్టంతో 34,316కు సెన్సెక్స్‌

150 పాయింట్లు క్షీణించి 10,304కు నిఫ్టీ

నిఫ్టీ తదుపరి మద్దతు 10,100 పాయింట్లు!

లిక్విడిటీ భయాలు మళ్లీ తలెత్తడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. దసరా  (గురువారం) సెలవు కారణంగా ఒక్క రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్‌ సూచీలు చెరో ఒక శాతానికి పైగా క్షీణించాయి. ఫెడ్‌ రేట్ల పెంపు భయాలు, చైనా వృద్ధి మందగించడం వంటి కార ణాల వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి తోడు  వీసా నిబంధనలు మరింత కఠినతరం కానుండటం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌  ఇండెక్స్‌ హెవీ వెయిట్‌ షేర్లు 4 శాతం వరకూ నష్టపోవడం  వంటి ప్రతికూలాంశాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతిన్నది.

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు సంబంధించిన లిక్విడిటీ కవరేజ్‌ రేషియో నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించినా, ఎలాంటి ప్రయోజనం దక్కలేదు.  ఇంట్రాడేలో నిఫ్టీ కీలకమైన 10,250 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 464 పాయింట్లు క్షీణించి 34,316 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 10,304 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే, స్టాక్‌ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌  418 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఇంధన, ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్లు నష్టపోయాయి. ఒక్క ఎఫ్‌ఎమ్‌సీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.  

ఇంట్రాడేలో 639 పాయింట్లకు సెన్సెక్స్‌...
ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్‌ నష్టాల్లోనే ప్రారంభమైంది. అన్నీ ప్రతికూలాంశాలే ఉండటంతో నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఇంట్రాడేలో 639 పాయింట్లు క్షీణించి 34,140 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఇక నిఫ్టీ ఒక దశలో 203 పాయింట్ల వరకూ నష్టపోయింది. బుధవారం వెల్లడైన అమెరికా ఫెడ్‌ సమావేశ వివరాలు రేట్ల పెంపు అంచనాలను మరింత బలపడేట్లు చేశాయని పేర్కొన్నారు.

10,300 దిగువకు వస్తే, 10,100..!: విశ్లేషణలు
కాగా నిఫ్టీకి 10,300 పాయింట్లు కీలకమైన మద్దతని నిపుణులంటున్నారు. నిఫ్టీ ఈ స్థాయి దిగువకు పడిపోతే స్టాక్‌ మార్కెట్‌ మరింతగా బలహీనపడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ తదుపరి కీలక మద్దతు 10,100 పాయింట్లని టెక్నికల్‌ ఎనలిస్ట్‌లు అంటున్నారు.  

తగ్గిన ఐటీ షేర్లు...
హెచ్‌–1 వీసా నిబంధనలను సవరించనున్నామని అమెరికా వెల్లడించడం ఐటీ షేర్లను నష్టాల పాలు చేసింది.  ఇన్ఫోసిస్‌ 3.1 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 6 శాతం  నష్టపోయింది.

కొనసాగిన ఎన్‌బీఎఫ్‌సీల నష్టాలు
నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నిధుల నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించింది. అయినప్పటికీ,     ఎన్‌బీఎఫ్‌సీల పతనం ఆగలేదు.
నష్టాలు ఎందుకంటే.... ప్రపంచ మార్కెట్ల పతనం, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు,   హెవీ వెయిట్‌ షేర్లకు నష్టాలు వంటివి నష్టాలకు ప్రధాన కారణాలు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ షేర్లు 3–4 శాతం వరకూ నష్టపోయాయి.

రూ.1.60 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్‌ భారీ పతనం కారణంగా రూ.1.60 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.138.64 లక్షల కోట్ల  నుంచి రూ.137.04 లక్షల కోట్లకు తగ్గింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top