సెన్సెక్స్‌ 205 పాయింట్లు డౌన్‌

Sensex down 205 points - Sakshi

మార్పుల్లేని ఆర్‌బీఐ పాలసీ నేపథ్యం

ద్రవ్యోల్బణ అంచనాల పెంపు 

వడ్డీరేట్ల ప్రభావిత షేర్లకు నష్టాలు

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు 

205 పాయింట్ల పతనంతో 32,597కు సెన్సెక్స్‌

74 పాయింట్ల నష్టంతో 10,044కు నిఫ్టీ

ఆర్‌బీఐ కీలక రేట్లను యధాతథంగా ఉంచినప్పటికీ, ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడంతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. స్టాక్‌ సూచీల నష్టాలు రెండో రోజూ కొనసాగాయి. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సునాయాసం కాదన్న మీడియా వార్తలు  కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 205 పాయింట్లు నష్టపోయి 32,597 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి 10,044 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌  ఆరు వారాల, నిఫ్టీ ఎనిమిది వారాల కనిష్టానికి పడిపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.  

లోహ షేర్లు విలవిల...
అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు తగ్గడంతో లోహ షేర్లు పతనమయ్యాయి.  ఇంట్రాడేలో 6–19 శాతం రేంజ్‌లో పతనమైన .నాల్కో, వేదాంత, ఎంఓఐఎల్, హిందాల్కో సెయిల్‌ హిందుస్తాన్‌ జింక్, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌ తదితర లోహ షేర్లు చివరకు 4 శాతం వరకూ నష్టాల్లో ముగిశాయి.  ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించకపోవడంతో గృహ, వాహన రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు తల్లకిందులయ్యాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు–బ్యాంకింగ్, రియల్టీ, వాహన షేర్లు నష్టపోయాయి. ఎస్‌బీఐ 2.2 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2.2 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.2 శాతం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 0.06 శాతం, యస్‌ బ్యాంక్‌ 0.76 శాతం, చొప్పున నష్టపోయాయి. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 1.5 శాతం, ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ 2.2 శాతం, ఒబెరాయ్‌ రియల్టీ 0.62 శాతం చొప్పున క్షీణించాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా 1.3 శాతం, టాటా మోటార్స్‌ 1.3 శాతం, బజాజ్‌ ఆటో 1.6 శాతం చొప్పున పడిపోయాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top