11,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ

Sensex dives 536 points, Nifty breaches 11000 - Sakshi

ఐదో రోజూ నష్టాలే

రెండు నెలల కనిష్టానికి స్టాక్‌ సూచీలు

నాలుగేళ్ల గరిష్టానికి చమురు ధరలు

ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో కొనసాగిన నష్టాలు

ఫెడ్‌ సమావేశం నేపథ్యంలో తరలిపోతున్న విదేశీ నిధులు

ముదిరిన సుంకాల పోరు...ప్రపంచ మార్కెట్ల పతనం

537 పాయింట్లు క్షీణించి 36,305కు సెన్సెక్స్‌

176 పాయింట్ల నష్టంతో 10,967కు నిఫ్టీ   

స్టాక్‌ మార్కెట్‌ పతనం కొనసాగుతోంది. ఈ వారం స్టాక్‌ సూచీలు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల లిక్విడిటీ సమస్యకు తోడు ముడి చమురు ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరడం, రూపాయి పతనం కొనసాగుతుండటం కూడా తోడవడంతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం భారీగా నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల మద్దతును కోల్పోయింది.

అమెరికాతో చర్చలను చైనా నిలిపేయడంతో వాణిజ్య యుద్ధం మరింతగా తీవ్రమవుతుందనే ఆందోళనలు నెలకొనడం, ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక సమావేశం నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి.బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 537 పాయింట్లు పతనమై 36,305 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 176 పాయింట్ల నష్టంతో 10,967 పాయింట్ల వద్ద ముగిశాయి.

స్టాక్‌ సూచీలకు  ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌ ఒక్క రోజులో ఇన్ని పాయింట్లు నష్టపోవడం ఏడు నెలల కాలంలో ఇదే మొదటిసారి.  వరుసగా స్టాక్‌ సూచీలు ఐదో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ క్షీణించాయి. ఈ ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 1,786 పాయింట్లు నష్టపోయింది. ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. బ్యాంక్, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, ఫార్మా షేర్లు పతనమయ్యాయి.  

ఫలించని ప్రభుత్వ భరోసా...
ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల కొరత లేకుండా చూస్తామని ఆర్థిక మంత్రి అభయం ఇచ్చినా, ఆ షేర్ల పతనం ఆగలేదు. మరోవైపు పరిస్థితులను చక్కదిద్దడానికి సరైన చర్యలు తీసుకుంటామని సెబీ, ఆర్‌బీఐలు భరోసానిచ్చినా ఫలితం కనిపించలేదు. సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైంది.

ఇంట్రాడేలో 104 పాయింట్ల లాభంతో 36,946 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. వెంటనే నష్టాల్లోకి జారింది.  అమ్మకాల సునామీతో 625 పాయింట్ల నష్టంతో 35,217 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. రోజంతా 729 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. మరోవైపు నిఫ్టీ ఒక దశలో 27 పాయింట్లు లాభపడగా, మరో దశలో 200 పాయింట్ల వరకూ నష్టపోయింది.  

షార్ట్‌  కవరింగ్‌ ర్యాలీ ...!  
నిధుల లభ్యత సమస్య కారణంగా హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీల షేర్లు పతనం సోమవారం కూడా కొనసాగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ çసర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. వడ్డీరేట్లు పెరుగుతాయనే భయాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. వరుసగా ఐదు రోజుల పాటు స్టాక్‌ మార్కెట్‌ నష్టపోవడం, మరో మూడు రోజుల్లో ఈ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ చోటు చేసుకునే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ట్రేడర్లు హెడ్జ్‌డ్‌ ట్రేడింగ్‌ లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మాంగ్లిక్‌ సూచించారు.

కొనసాగిన  ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల నష్టాలు...
రుణ చెల్లింపుల్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలు విఫలం కావడంతో ముసలం మొదలైంది. ఈ గ్రూప్‌కు రుణాలిచ్చిన పలు ఎంఎఫ్‌ సంస్థలు లిక్విడిటీ కోసం ఇతర ఆర్థిక సంస్థల కమర్షియల్‌ పేపర్స్‌ను డిస్కౌంట్‌ను విక్రయించాయి. దీంతో నిధుల కొరత ఉందనే ఆందోళనతో  హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఈ నష్టాలు సోమవారం కూడా కొనసాగాయి.

మరిన్ని విశేషాలు  
మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 6.4 శాతం నష్టంతో రూ.895 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్‌ ఇదే.  
 మొత్తం 31 సెన్సెక్స్‌ షేర్లలో 25 షేర్లు నష్టపోగా, ఐదు షేర్లు (టీసీఎస్, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఎన్‌టీపీసీ)మాత్రమే లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ ఫ్లాట్‌గా ముగిసింది.  
 సెంట్రలైజ్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌కు ఆర్‌బీఐ కొన్ని ఐటీ కంపెనీల(టీసీఎస్, ఇన్ఫోసిస్‌)లను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. దీనికి తోడు రూపాయి పతనంతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్‌ జీవిత కాల గరిష్ట స్థాయిని చూసింది.
 ముడి చమురు ధరలు పెరగడంతో చమురు మా ర్కెటింగ్, విమానయాన షేర్ల ధరలు పడ్డాయి.
 బీఎస్‌ఈలో దాదాపు 470 షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, అశోక బిల్డ్‌కాన్, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.  

పతనానికి పంచ కారణాలు
1. ఆర్థిక రంగ షేర్ల నష్టాలు...
హౌసింగ్‌ ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్ల నష్టాలు సోమవారం కూడా కొనసాగాయి. లిక్విడిటీ భయాలతో గత శుక్రవారం ఈ షేర్లు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. వడ్డీరేట్లు పెరిగి ఎన్‌బీఎఫ్‌సీలపై మరింత భారం పడనున్నదనే ఆందోళనతో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. వీటికి తోడు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తదితర దిగ్గజ ఆర్థిక రంగ షేర్లూ పతనమయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ 6.2 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 5 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.8 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 2.6 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.1 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్‌  మొత్తం 537 పాయింట్ల నష్టంలో ఈ ఐదు షేర్ల వాటానే 418 పాయింట్ల వరకూ ఉంది.  
2. నాలుగేళ్ల గరిష్టానికి చమురు ధరలు
ఇరాన్‌పై అమెరికా ఆంక్షల అమలు దగ్గరకు వస్తుండటంతో ముడి చమురు ఉత్పత్తిని పెంచాలన్న అమెరికా అభ్యర్థనను ఒపెక్‌ తోసిపుచ్చింది. దీంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి.
3. తరలిపోతున్న విదేశీ నిధులు: రేపు (బుధవారం) అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచనున్నదనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు.
4. రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 53 పైసలు నష్టపోయింది.  
5. మరింత ముదిరిన వాణిజ్య ఉద్రిక్తతలు:  అమెరికా, చైనాలు పరస్పరం విధించుకున్న తాజా వాణిజ్య సుంకాలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. మరోపైవు వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఉద్దేశించిన చర్చలను నిలిపేస్తున్నట్లు చైనా పేర్కొంది.

ఐదు రోజుల్లో రూ.8.5 లక్షల కోట్లు ఆవిరి
ఐదు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 1,786 పాయింట్లు నష్టపోగా  ఇన్వెస్టర్ల సంపద రూ.8.48 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌  రూ.8,47,974 కోట్లు తగ్గి, రూ.1,47,89,045 కోట్లకు పడిపోయింది.  

కోలుకున్న దివాన్‌ హౌసింగ్‌
శుక్రవారం 42% పడిన దివాన్‌ హౌసింగ్‌  సోమవారం కోలుకుంది.  ఇంట్రాడేలో రూ.439 వరకూ పెరిగిన ఈ షేర్‌ చివరకు 12% లాభంతో రూ.393 వద్ద ముగిసింది.   

అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు ఓకే
బిస్కెట్లు తయారు చేసే అన్మోల్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా రూ.750 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top